పసివాడికి ప్రాణభిక్ష పెట్టరూ!
తిమ్మాపూర్ : మండలంలోని రామకృష్ణకాలనీకి చెందిన కిన్నెర వెంకటేష్(09) అనే బాలుడు కిడ్నీవ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యానికి డబ్బుల్లేక.. ఆసుపత్రికి తీసుకెళ్లలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కిన్నెర లక్ష్మి, తిరుపతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు వెంకటేశ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుండగా ఏడాది క్రితం పచ్చకామెర్లు వచ్చాయి.
తల్లిదండ్రులు కరీంనగర్, హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. తర్వాత కిడ్నీలు చెడిపోవడంతో హైదరాబాద్లోని ఏషియన్ ఆసుపత్రిలో పలుమార్లు డయాలసిస్ చేయించారు. ప్రస్తుతం వెంకటేశ్ పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. వైద్యం కోసం రూ.నాలుగు లక్షల వరకు అప్పు చేసి ఖర్చు పెట్టిన తిరుపతి ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక కుమారుడిని ఆసుపత్రికే తీసుకెళ్లడం లేదు. తమ కుమారుడికి ప్రభుత్వం, దాతలు సాయమందింది ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వెంకటేశ్ పరిస్థితిని స్థానిక జెడ్పీటీసీ భర్త ఉల్లెంగుల సేవా ట్రస్టు చైర్మన్ ఏకానందం, సర్పంచ్ కిన్నెర సారయ్య తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా సాయమందించేందుకు కృషి చేస్తామన్నారు.