‘మమత’చూపిన సీఎం...
- కేసీఆర్ పర్యటనతో మమతానగర్ వాసుల ఖుషీ
- దశ తిరుగుతుందని ఆశ
నాగోలు: ఎల్బీనగర్ పరిధిలోని నాగోలు మమతానగర్, వెంకటరమణ కాలనీల్లో ఆదివారం సీఎం కేసీఆర్ పర్యటించడంతో ఆయా కాలనీల ప్రజలు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇక తమ కాలనీల్లో అన్ని వసతులు సమకూరుతాయని, తమ దశ తిరుగుతుందని ఆశలుపెట్టుకుంటున్నారు.
మమతానగర్ కాలనీలో సీఎం స్వయంగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అన్ని వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తాను పర్యటించిన కాలనీలను నగరంలోని ఇతర అన్ని కాలనీల వాసులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కాగా సీఎం వస్తున్నట్లు తెలియడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చారు.
ఇక పరిసర కాలనీవాసులు సీఎంకు వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. దీంతో స్థానిక నాయకులు వాటిని తీసుకుని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అందజేశారు. బీ.కే.రెడ్డినగర్ పార్కులో బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పటికీ ఆ కాలనీ సంక్షేమ సంఘం నాయకులను ఎవరినీ వేదికపైకి పిలువకపోవడం, కాలనీ గురించి చర్చించకపోవడంతో సీఎం వెళ్లిన అనంతరం వారు నిరసన వ్యక్తం చేశారు. సీఎం రాక సందర్భంగా ఎల్బీనగర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ సర్కిల్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు ఉదయం నుంచే పరిసర కాలనీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎక్కడ చెత్తా చెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.