వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల దాడి
అనంతపురం : అనంతపురంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. యల్లనూరు మండలం వెన్నపూసపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. ఈ సంఘటనలో ముగ్గురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మొదటి నుంచి వెన్నపూసపల్లె కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న గ్రామం. అయితే తాజాగా రాష్ట్ర విభజన, మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆ గ్రామ ప్రజలు వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో జేసీ వర్గీయులు దీన్ని తట్టుకోలేక ఆ గ్రామ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతను కలిసేందుకు వెళుతున్నకార్యకర్తలపై జేసీ వర్గీయులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.