‘సత్యం’ను వెంటాడుతున్న పాత విదేశీ కేసులు
న్యూయార్క్: ఐటీ సంస్థ సత్యం కంప్యూటర్స్.. మహీంద్రా గ్రూప్లో విలీనమైనప్పటికీ, పాత కేసులు దాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. సత్యం కంప్యూటర్స్ తమను మభ్యపెట్టి భాగస్వామ్యం కుదుర్చుకునేలా చేసిందంటూ ఒకప్పటి భాగస్వామి వెంచర్ గ్లోబల్ ఇంజనీరింగ్ (వీజీఈ) తాజాగా మరోసారి దావా వేసింది. దీనిపై విచారణ జరపాలంటూ అమెరికాలోని అప్పీల్స్ కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సత్యం కంప్యూటర్స్కి అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది.
పిటిషన్ వివరాల ప్రకారం.. ఆటో పరిశ్రమకు ఇంజినీరింగ్ సర్వీసులు అందించే ఉద్దేశంతో ల్యారీ వింగెట్ లివింగ్ ట్రస్టు సారథ్యంలోని వెంచర్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియాతో కలిసి 2000లో సత్యం.. జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేసింది. అయితే, విభేదాలు రావడంతో 2005లో రెండూ తెగతెంపులు చేసుకున్నాయి. దీనికి సంబంధించి అప్పట్లో వెంచర్ సంస్థ వాదనలను తోసిపుచ్చి, జేవీలో ఆ కంపెనీకి ఉన్న వాటాలను సత్యంకు బదలాయించాలంటూ మిషిగాన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశించింది. అకౌంటింగ్ స్కాం దరిమిలా.. తాజాగా వెంచర్ సంస్థతో పాటు ట్రస్టు ప్రస్తుతం అప్పీల్స్ కోర్టుకెళ్లాయి. అప్పట్లో కూడా సత్యం తన ఆర్థిక స్థితిగతుల గురించి మాయమాటలు చెప్పి భాగస్వామ్యం కుదుర్చుకుందని వాదించాయి. దీనిపైనే కోర్టు ప్రస్తుత ఆదేశాలు జారీ చేసింది.