ఆ అధ్యక్షుడితో భేటీ కష్టంగా ఉంటుంది: ట్రంప్
వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో జరగబోయే సమావేశం చాలా కష్టంగా ఉండబోతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే వారంలో గురువారం, శుక్రవారం జిన్పింగ్తో సమావేశం ఉండనుందని తెలిపారు. చైనా తమ ఆర్థిక సంపదనంతా దోచుకెళుతోందని, తమ వ్యాపారాన్ని మొత్తం దెబ్బకొడుతోందని, ఉద్యోగాలను కొల్లగొడుతుందని ట్రంప్ గతంలో ఆరోపించిన నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అదీ కాకుండా ట్రంప్ కూడా ఇక తాము ఏ మాత్రం వాణిజ్యవ్యాపారాన్ని నష్టపోవడం తమకిష్టం లేదని, ఉద్యోగాలు కోల్పోవడం ఇష్టం లేదని చెప్పారు. చైనా, అమెరికా మధ్యలో వాణిజ్యపరమైన విభేదాలు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చైనా సహాయంతో వ్యాపారం నిర్వహిస్తున్న కంపెనీలు ప్రత్యామ్నాయం చూసుకోవాలని కూడా ట్రంప్ సూచించారంట.
వచ్చే నెల 6, 7 తేదీల్లో ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో అనే ట్రంప్ నివాసంలో ట్రంప్, జిన్పింగ్ భేటీ అవనున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వీరిరువురి మధ్య సమావేశం జరగడం ఇదే తొలిసారి. ‘ట్రంప్, జిన్పింగ్ ఇరు దేశాల మధ్య ఉన్న ఆందోళనకరమైన విషయాలు ఉత్తర కొరియా అంశం, వర్తక వాణిజ్యం, ప్రాంతీయ భద్రత వంటి విషయాలపైన చర్చించనున్నారు’ అని అమెరికా వైట్ హౌస్ తెలిపింది.