Victims workers
-
రామోజీ మోసాలు.. మార్గదర్శి బాధితుల సంఘం ఏర్పాటు
సాక్షి, విజయవాడ: చిట్‌ఫండ్స్ పేరిట రామోజీరావు మోసాల నేపథ్యంలో మార్గదర్శి బాధితుల సంక్షేమ సంఘం ఏర్పాటైంది. ఈ మేరకు సంక్షేమ సంఘాన్ని బాధితులు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలో బాధితులు.. ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్, కార్యదర్శులను ఎన్నుకున్నారు. అనంతరం, మీడియా ముందు రామోజీ మోసాలను బాధితులు ఎండగట్టారు. ఆధారాలతో మార్గదర్శి మోసాలను బాధితులు బయటపెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి బాధితుల సంఘం ప్రెసిడెంట్ ముష్టి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘మార్గదర్శిలో నేను మోసపోయాక గళం విప్పడం ప్రారంభించాను. పేద, మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. షూరిటీస్ నెపంతో డబ్బు ఎగ్గొడుతున్నారు. చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నారు. మార్గదర్శి ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియట్లేదు. కర్నూలులో ఒక వ్యక్తికి మార్గదర్శి బెదిరింపుల కారణంగా పక్షవాతం వచ్చింది. మార్గదర్శిపై పోరాడుతున్న నాపైన కూడా కేసులు పెడుతున్నారు. నేను కోర్టుకు వెళ్తానంటే నువు బ్రాహ్మణుడివి ఏమీ చేయలేవు అని బెదిరించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మార్గదర్శి బాధితుల సంఘం వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు మాట్లాడుతూ..‘మార్గదర్శి అనైతికంగా వ్యవహరిస్తోంది. కస్టమర్ల ఆస్తులు కొల్లగొడుతున్నారు. 43 చిట్లలో కేవలం నాకు వచ్చింది 8వేలు మాత్రమే. ఒక్కో చిట్‌కి 210 రూపాయలు ఇచ్చారు. నెలకు 40 నుండి 50 లక్షల ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన పరిస్థితికి తీసుకెళ్లారు. చిట్ డిఫాల్ట్ అయితే ఆస్తులు అమ్ముకుంటారని మాకు తెలియదు. కోర్టుకు వెళ్తారనే భయంతో అప్పులు చేసి చిట్లు కట్టాము. కాల్ మనీ గుండాల్లా మా ఇంటికి వచ్చి కూర్చునే వారు. ఇంట్లోని బంగారం అమ్ముకున్నాం. డిఫాల్ట్ అయితే ఇంత దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారని మాకు తెలియదు’ అని కామెంట్స్ చేశారు. మార్గదర్శి బాధితుల సంఘం సెక్రటరీ అన్నపూర్ణ దేవి మాట్లాడుతూ..‘చిట్ కట్టలేని స్థితికి తీసుకెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళ టార్గెట్ కోసం ఎక్కువ చిట్లు కట్టేలా ఒప్పించారు. ఎంత కట్టినా డిఫాల్ట్ ఉందంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా కాపురాన్ని నాశనం చేశారు. మా ఇంటిని అటాచ్ చేశారు. ఆర్ధిక స్థోమత లేనివారిని కూడా చిట్లలో ఇరికిస్తున్నారు’ అని అన్నారు. -
అందరినీ ఆదుకుంటాం
సాక్షి, ముంబై: ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. బాధితులందరికి వెంటనే ఆర్థిక సాయం ప్రకటించి, దాన్ని అమలు చేయడంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ముంపునకు గురైన గ్రామాల్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం పర్యటించారు. చిప్లూన్‌లో వరదకు గురైన ప్రాంతాలను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, వ్యాపారస్తులతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం తరఫున చేయాల్సిన సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సింధుదుర్గ్, రత్నగిరి, రాయ్‌గఢ్, సాతారా, సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లో జరిగిన నష్టంపై పంచనామా నిర్వహించి ఎంత మేర నష్టం వాటిల్లిందో అంచనా వేస్తామన్నారు. ఈ విషయానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, రీజినల్ కమిషనర్లకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక రాగానే బాధితులు అందరికి ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే, ఆలోపు తాత్కాలికంగా తక్షణమే కొంత ఆర్థిక సాయం చేసేలా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ‘అనేక చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. పంటలు, తోటలకు అపార నష్టం జరిగింది. బాధితులు అందరికీ సాధ్యమైనంత త్వరగా ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేస్తాం’అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే వరద బాధితులు అందరికీ బియ్యం, గోధుమలు, కిరోసిన్, ఇతర వంట సామగ్రి, దుస్తులు పంపిణీచేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. కేవలం పబ్లిసిటీ కోసం ఆదరా బాదరగా ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి కూడా ఎంత మేర సాయం కోరాలా అనేది త్వరలో నిశ్చయిస్తామన్నారు. సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నామని చెప్పారు. గతంలో వరద, ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో అనేక సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. కానీ, ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని పేర్కొన్నారు. అందుకు అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపామని చెప్పారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా అందరికీ ఆర్థిక సాయం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. కరోనా వల్ల ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం ఉంటుందని తెలిపారు. రక్షణ బలగాలకు చెందిన కొన్ని బృందాలను పంపి కేంద్రం సాయం చేసిందన్నారు. సోమవారం తాను పశ్చిమ మహారాష్ట్రలో పర్యటిస్తానని, జరిగిన నష్టంపై నివేదిక తయారుచేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, అంతకుముందు చిప్లూన్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని స్థానికులు అడ్డుకున్నారు. వర్షాల వల్ల తాము ఎదుర్కొంటున్న నరకయాతనను వారు ముఖ్యమంత్రికి వివరించారు. తమకు తక్షణమే సాయం అందించాలని వేడుకున్నారు. -
వీడిన జల ‘చెర’
సాక్షి, హైదరాబాద్/పాపన్నపేట: మెదక్ జిల్లా ఏడుపాయలలో మంజీర నదిలో చిక్కుకున్న 24 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. వీరిని రక్షించడానికి సీఎం కేసీఆర్ చూపిన చొరవ ఫలిం చింది. సీఎం విజ్ఞప్తి మేరకు ఎయిర్‌ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్‌తో కూలీ లంతా ఒడ్డుకు చేరుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్.. ఏడుపాయల్లోనే మకాం వేసి ప్రభుత్వ అధికారులు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో మాట్లాడుతూ, బాధిత కూలీలకు సెల్‌ఫోన్ ద్వారా ధైర్యం చెబుతూ మొత్తం పరిస్థితిని పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం 8.45 గంటలకు ఆపరేషన్ ప్రారంభించిన ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు 50 నిమిషాల్లో 24 మంది బాధితులను జల‘చెర’ నుంచి విడిపించి స్వేచ్ఛను ప్రసాదించాయి. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 24 మంది కూలీలు పొట్టకూటి కోసం నెల రోజుల కిందట మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ప్రాంతానికి వచ్చారు. మంజీర పాయల మధ్య టేకుల బొడ్డెపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణంలో కూలీ పనులు చేసుకుంటూ.. అక్కడే రేకుల షెడ్డు వేసుకుని నివసిస్తున్నారు. అయితే భారీ వర్షాలకు మంజీర వరదగా మారి ఘనపురం ప్రాజెక్టు నుంచి పొంగిపొర్లుతూ టేకుల బొడ్డెను చుట్టుముట్టింది. దీంతో కూలీలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బాధితులను రక్షించేందుకు శనివారం జాతీయ విపత్తుల సహాయక సిబ్బంది రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శనివారం విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చింది. దీంతో కేసీఆర్ అక్కడికి ప్రభుత్వ హెలికాప్టర్ పంపడానికి ప్రయత్నించారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ అయితే తప్ప మనుషులను లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని తేలింది. దీంతో కేసీఆర్ ఎయిర్‌ఫోర్స్ అధికారులతో మాట్లాడి.. హెలికాప్టర్లను పంపించారు. కూలీలను సురక్షితంగా బయటకు తేవడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 50 నిమిషాల్లోనే..: కూలీలను రక్షించేందుకు వైమానిక దళం శనివారం రెండు సార్లు ప్రయత్నించగా భారీ వర్షం, మేఘాలు, ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యం కాలేదు. అయితే ఆదివారం మరోమారు ఆపరేషన్ చేపట్టి.. 50 నిమిషాల్లోగా పని పూర్తి చేశాయి. రెండు హెలికాప్టర్లు ఉదయం 7.45 గంటలకు టేకులబొడ్డెపై ల్యాండ్ అయ్యాయి. 4 విడతలుగా రెండేసి హెలికాప్టర్లు ఒక్కోసారి ముగ్గురు బాధితులను ఏడుపాయల వైపు తీసుకొచ్చాయి. బాధితులంతా సురక్షితంగా ఇవతలి వైపునకు చేరగానే డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అల్పాహారం అందజేశారు. అనంతరం వైద్య పరీక్షలు జరిపించారు. ఆపై వారికి ఏడుపాయల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాధితులంతా తమ స్వస్థలాలకు వెళ్తామని చెప్పడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.