సాక్షి, విజయవాడ: చిట్‌ఫండ్స్ పేరిట రామోజీరావు మోసాల నేపథ్యంలో మార్గదర్శి బాధితుల సంక్షేమ సంఘం ఏర్పాటైంది. ఈ మేరకు సంక్షేమ సంఘాన్ని బాధితులు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలో బాధితులు.. ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్, కార్యదర్శులను ఎన్నుకున్నారు. అనంతరం, మీడియా ముందు రామోజీ మోసాలను బాధితులు ఎండగట్టారు. ఆధారాలతో మార్గదర్శి మోసాలను బాధితులు బయటపెట్టారు.
ఈ సందర్భంగా మార్గదర్శి బాధితుల సంఘం ప్రెసిడెంట్ ముష్టి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘మార్గదర్శిలో నేను మోసపోయాక గళం విప్పడం ప్రారంభించాను. పేద, మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. షూరిటీస్ నెపంతో డబ్బు ఎగ్గొడుతున్నారు. చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నారు. మార్గదర్శి ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియట్లేదు. కర్నూలులో ఒక వ్యక్తికి మార్గదర్శి బెదిరింపుల కారణంగా పక్షవాతం వచ్చింది. మార్గదర్శిపై పోరాడుతున్న నాపైన కూడా కేసులు పెడుతున్నారు. నేను కోర్టుకు వెళ్తానంటే నువు బ్రాహ్మణుడివి ఏమీ చేయలేవు అని బెదిరించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. మార్గదర్శి బాధితుల సంఘం వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు మాట్లాడుతూ..‘మార్గదర్శి అనైతికంగా వ్యవహరిస్తోంది. కస్టమర్ల ఆస్తులు కొల్లగొడుతున్నారు. 43 చిట్లలో కేవలం నాకు వచ్చింది 8వేలు మాత్రమే. ఒక్కో చిట్‌కి 210 రూపాయలు ఇచ్చారు. నెలకు 40 నుండి 50 లక్షల ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాల్సిన పరిస్థితికి తీసుకెళ్లారు. చిట్ డిఫాల్ట్ అయితే ఆస్తులు అమ్ముకుంటారని మాకు తెలియదు. కోర్టుకు వెళ్తారనే భయంతో అప్పులు చేసి చిట్‌లు కట్టాము. కాల్ మనీ గుండాల్లా మా ఇంటికి వచ్చి కూర్చునే వారు. ఇంట్లోని బంగారం అమ్ముకున్నాం. డిఫాల్ట్ అయితే ఇంత దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారని మాకు తెలియదు’ అని కామెంట్స్ చేశారు.
మార్గదర్శి బాధితుల సంఘం సెక్రటరీ అన్నపూర్ణ దేవి మాట్లాడుతూ..‘చిట్ కట్టలేని స్థితికి తీసుకెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళ టార్గెట్ కోసం ఎక్కువ చిట్‌లు కట్టేలా ఒప్పించారు. ఎంత కట్టినా డిఫాల్ట్ ఉందంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా కాపురాన్ని నాశనం చేశారు. మా ఇంటిని అటాచ్ చేశారు. ఆర్ధిక స్థోమత లేనివారిని కూడా చిట్‌లలో ఇరికిస్తున్నారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment