video sharing
-
వరల్డ్ టాప్ యూట్యూబ్ ఛానెల్ మనదే.. ఏదో తెలుసా?
యూట్యూబ్! వీడియో విభాగంలో ఓ సెన్సేషన్. 2005 ప్రారంభమై ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతోంది. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో గేమ్‌ఛేంజర్‌గా మారిన యూట్యూబ్ లక్షలాది కంటెంట్ క్రియేటర్లకు ఆదాయ వనరుగా మారింది. వారి ఎదుగుదలకూ తోడ్పడుతోంది. సబ్స్క్రైబర్లు, లైక్స్, వ్యూస్ ఆధారంగా డిజిటల్ వరల్డ్‌లో ఏ యూట్యూబ్ ఛానల్ అగ్రస్థానంలో ఉందో గుర్తించవచ్చు. అయితే ఎప్పటిలాగే తొలి టాప్‌టెన్ యూట్యూబ్ ఛానల్స్ వివరాల్ని ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ప్రపంచంలో మిగిలిన దేశాల యూట్యూబ్ ఛానల్స్‌తో పోలిస్తే భారత్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్స్ యూజర్లను ఆకట్టుకోవడంతో సబ్‌స్క్రైబర్ లాయల్టీ పరంగా అగ్రస్థానాన్ని సంపాదించాయి. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం..భారత్‌లోని మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ టీ సిరీస్ అగస్థానాన్ని సంపాదించుకుంది. శ్రోతల్ని ఆకట్టుకునే సంగీతంతో పాటు, ఎంటర్టైన్మెంట్ను అందించడంతో ప్రపంచంలో అత్యధికంగా సబ్స్క్రయిబ్ చేసుకున్న టాప్ 10 యూట్యూబ్ ఛానెల్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టీ సిరీస్ తర్వాత మిగిలిన ఛానల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబ్ ఛానెల్స్ జాబితా ప్రకారం.. టీ-సిరీస్: ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్ 257 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. భారతదేశంలోని అతిపెద్ద మ్యూజిక్ లేబుల్, మూవీ స్టూడియో యాజమాన్యంలో వారి ఛానెల్లో మ్యూజిక్ వీడియోలు, సినిమాలు, ట్రైలర్లతో సహా ఇతర ఎంటర్ టైన్మెంట్ వీడియోల్ని ఇందులో వీక్షించవచ్చు. మిస్టర్ బీస్ట్: జిమ్మీ డొనాల్డ్సన్ అమెరికన్ యూట్యూబర్. మిస్టర్బీస్ట్గా ప్రసిద్ధి చెందారు. సాహసాలూ, వింత స్టంట్లూ చేస్తూ నడుపుతున్న ఈ ఛానల్‌కు సబ్స్క్రైబర్ల సంఖ్య సుమారు 232 మిలియన్లకు పైగా.. ఆదాయం వందల కోట్లే కోకోమెలన్ : ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్ 3డీ యానిమేటెడ్ నర్సరీ రైమ్‌లు, పిల్లల పాటల వీడియో కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ఛానెల్‌కు 170 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సెట్ ఇండియా (సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్): భారతదేశంలో సెట్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఉంది. హిందీలో కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ఛానెల్‌కు 167 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కిడ్స్ డయానా షో: ఆన్లైన్లో కిడ్స్ డయానా షో అని పిలువబడే ఎవా డయానా కిడిస్యుక్. ఆమె, అమె కుటుంబ సభ్యులు కలిసి ఈ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. 118 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ప్యూడైపీ : స్వీడిష్ యూట్యూబర్ ఫెలిక్స్ కెజెల్బర్గ్ నిర్వహించే ప్యూడైపీ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్‌లలో ఒకటి. ఇందులో 111 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉండగా.. 4,747 వీడియోల్ని అప్లోడ్ చేశారు. లైక్ నాస్త్య: ది లైక్ నాస్త్య యూట్యూబ్ ఛానెల్ అనేది నాస్త్య అనే యువతి, ఆమె కుటుంబ సభ్యులతో పిల్లలకు ఎంటర్టైన్మెంట్ వీడియోల్ని అందిస్తుంటుంది. దీనికి 112 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వ్లాడ్ అండ్ నికి: ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్ ఇద్దరు అన్నదమ్ములు నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 108 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. జీ మ్యూజిక్ కంపెనీ: ప్రధానంగా హిందీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఆఫర్లతో, జీ మ్యూజిక్ కంపెనీ యూట్యూబ్ ఛానెల్ 104 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్: డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ ఛానెల్‌కు 99 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, 73 వేల వీడియోలు ఉన్నాయి. ఇందులో రెజ్లింగ్ వీడియోల్ని వీక్షించవచ్చు. -
పిల్లల ఫొటోల్ని షేర్ చేయకండి
గువాహటి: సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం చిన్నారుల ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై అస్సాం పోలీసులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ)తో రూపొందించిన చిన్నారుల చిత్రా లను వాడుకున్నారు. ‘పిల్లలు సోషల్ మీడియా ట్రోఫీలు కాదు, నెటిజన్ల దృష్టిలో పడేందుకు చిన్నారుల గోప్యతతో వ్యాపారం చేయకండి, మీ చిన్నారుల కథ చెప్పే అవకాశం వారికే ఇవ్వండి, లైక్స్ పాతబడిపోతాయి కానీ, డిజిటల్ మరకలు శాశ్వతం’వంటి సందేశాలను జత చేశారు. ఇటీవలి కాలంలో ఫ్యామిలీ వ్లాగర్లు ప్రచారం కోసం చిన్నారులను కూడా వాడుకోవడం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో తాము ఎలా కనిపిస్తామో తెలియని చిన్నారులను ప్రచారం కోసం ఉపయోగించుకోవడం ఎన్నో విధాలుగా నష్టం తెస్తుందని పోలీసులు చెబుతున్నారు. తమ పిల్లల చిత్రాలను షేర్ చేయడం హానికరం కాదని తల్లిదండ్రులు మొదట్లో భావించవచ్చు. కానీ, పిల్లలను గురించి అవసరం లేకున్నా ఎక్కువ మందికి తెలియడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చర్య పిల్లల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడంతోపాటు, వారి మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అస్సాం పోలీసుల ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది అద్భుతం, నేటి తల్లిదండ్రులకు ఇలాంటి సందేశాలు ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. అస్సాం పోలీసులు ఇటీవల సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ సినిమాలతో ప్రభావితమైన సైబర్ నేరగాళ్ల కృత్రిమ మేధ చిత్రాలను ట్వీట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. -
వాటి జోలికెళ్తే.. ఐదేళ్లు జైలుకే..!
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి దారితీస్తున్న చైల్డ్ పోర్నోగ్రఫీ జోలికి వెళ్తే జైలుకు వెళ్లడం ఖాయం. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి వీడియోలు, ఫొటోలను పోస్టు చేసినా, షేర్ చేసినా, చివరికి వీక్షించినా కూడా నేరమే. ఐదేళ్ల పాటు ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఇంటర్నెట్తోపాటు సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ)’పనిచేస్తోంది. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి వీడియోలు, ఫొటోల (చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్డ్ మెటీరియల్– సీఎస్ఏఎం)ను, వాటి గురించి సెర్చ్ చేస్తున్నవారు, వీక్షిస్తున్నవారిని కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వారు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం హైదరాబాద్‌లో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. మైనర్లకు సంబంధించిన అసభ్య, అశ్లీల చిత్రాలన్నీ చైల్డ్ పోర్నోగ్రఫీ కిందికి వస్తాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, సాహిత్యం తదితరాలను సీఎస్ఏఎంగా పరిగణిస్తారు. ఎన్‌సీఎంఈసీ ఆధ్వర్యంలో.. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ 1984 జూన్ 13న ఎన్‌సీఎంఈసీ ఏర్పాటు చేసింది. వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్‌సీఎంఈసీ చర్యలు ముమ్మరమయ్యాయి. ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ వేగంగా పెరుగుతోందని ఎన్‌సీఎంఈసీ గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే ప్రతి 40 సెకన్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్ అవుతోందని అంచనా వేసింది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. 2021లో భారత్ నుంచే 25 వేలకుపైగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇంటర్నెట్లో అప్లోడ్ అయ్యాయి. ఆధునిక టెక్నాలజీతో పటిష్ట నిఘా.. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్వేర్లు వాడుతూ ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కంటెంట్‌ను, సెర్చింగ్‌ను గుర్తించడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ గురించి సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా.. వారు వినియోగించిన కంప్యూటర్/ల్యాప్‌టాప్/ఫోన్ల ఐపీ అడ్రస్‌లను సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఈ వివరాలను ఎన్‌సీఎంఈసీ క్రోడీకరించి ఆయా దేశాలకు చెందిన నోడల్ ఏజెన్సీలకు అందిస్తుంది. మనదేశంలో జాతీయస్థాయిలో హోంశాఖ అధీనంలోని ఎన్సీఆర్బీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దీనికి అందిన వివరాలను రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తుంది. రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులు ఈ వివరాలను సంబంధిత బాధ్యులు నివసించే ప్రాంత సైబర్ క్రైమ్ పోలీసులకు పంపిస్తారు. వారు కేసులు నమోదు చేసి, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి.. అరెస్టు చేయడం/ నోటీసులివ్వడం వంటి చర్యలు చేపడతారు. స్మార్ట్ఫోన్లతో పెరిగి.. కోవిడ్‌తో విజృంభించి.. విస్తృతమైన ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పోర్న్సైట్లను చూసే అవకాశం పెరగడంతో చాలా మంది బానిసగా మారుతున్నారు. కోవిడ్ లాక్డౌన్, ఆ తర్వాతి సమయంలో ఈ ధోరణి మరింత పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి దేశంలో 2018లో 44 కేసులు, 2019లో 103 కేసులు నమోదుకాగా.. 2020 నాటికి ఈ సంఖ్య 738కి, 2021లో 969కి పెరగడం గమనార్హం. జరుగుతున్న ఉదంతాల్లో కనీసం ఒక శాతం కూడా పోలీసు రికార్డుల్లోకి ఎక్కి కేసులుగా మారట్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశాల్లో సర్వర్ల కారణంగా.. అశ్లీల వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. కానీ వాటి నిర్వాహకులు వెబ్సైట్ పేరులో స్వల్ప మార్పులు చేసి మరో వెబ్‌సైట్‌గా అందుబాటులోకి తెస్తున్నారు. వాటిపై ఫిర్యాదులు వచ్చి చర్యలు తీసుకునేవరకు ఇంటర్నెట్లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే. వాటిపై ఫిర్యాదులు వచ్చినా నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండటం లేదు. బాగా చదువుకున్నవారూ నిందితుల్లో.. చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలపై గత ఏడాది హైదరాబాద్‌లో 23 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో విద్యాధికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. పోలీసులు నిందితులతోపాటు కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక ఈ కేసుల్లో ఇటీవల నోటీసులు అందుకున్న వారిలో వ్యాపారులు, చిరుద్యోగులు కూడా ఉన్నారు. అన్నిరకాలా నష్టం పోర్నోగ్రఫీకి బానిస అవుతున్నవారు అన్నిరకాలా నష్టపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇంటర్నెట్లో ఉండే పోర్న్ మెటీరియల్‌తో పాటే వైరస్లు ఉంటాయని.. ఆయా వెబ్సైట్ల ద్వారా వైరస్‌లను పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటారని వివరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్‌కార్డులు, ఇతర వివరాలూ హ్యాకర్లకు చేరి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నేరం నిరూపితమైతే ఐదేళ్ల జైలు చైల్డ్ పోర్నోగ్రఫీ అత్యంత హేయమైన నేరం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. దీనికోసం ఎవరు సెర్చ్ చేసినా, వీడియోలు, ఫొటోలను చూసినా నేరమే. దీన్ని బ్రౌజ్ చేసిన వారి సమాచారం ఎప్పటికప్పుడు మాకు అందుతుంది. వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 67–బీ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తాం. ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ వేస్తాం. కోర్టులో నేరం నిరూపితమైతే మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా ఐదేళ్లు, రెండోసారి అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఒకవేళ బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే.. పోక్సో యాక్ట్ కింద కూడా కేసులు నమోదవుతాయి. దోషిగా తేలితే జీవిత ఖైదు పడే ఆస్కారం ఉంది. –గజరావ్ భూపాల్, సంయుక్త పోలీసు కమిషనర్, సీసీఎస్, హైదరాబాద్ -
బుల్లితెర క్వీన్ ఏక్తా కపూర్ మరో ప్రయోగం
ముంబై: వీడియో షేరింగ్ సోషల్ మీడియా సంస్థ రోపోసో తాజాగా ఎంటర్టైన్మెంట్ రంగ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్ అధినేత ఏక్తా కపూర్‌తో చేతులు కలిపింది. ‘ఈకే’ బ్రాండ్ పేరిట గృహాలంకరణ, గృహోపకరణాలను ఆవిష్కరించింది. స్థానిక కళాకారులకు ఊతమిచ్చేందుకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఇది తోడ్పడగలదని ఏక్తా కపూర్ తెలిపారు. మొబైల్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ కంపెనీ ఇన్మొబీలో భాగమైన గ్లాన్స్కి రోపోసో అనుబంధ సంస్థగా ఉంది. కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్, గ్లాన్స్ మధ్య జాయింట్ వెంచర్ సంస్థ అయిన గ్లాన్స్ కలెక్టివ్ ’ఈకే’ బ్రాండ్ కింద మొట్టమొదటి కలెక్షన్ అందిస్తోందని ఇన్‌మొబి సీఈవో నవీన్ తివారీ తెలిపారు. ఈ కేటలాగ్‌లో కుషన్ కవర్లు, వాల్ ఆర్ట్ మొదలైన ఉత్పత్తులు గ్లాన్స్, రోపోసో ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ధరలు రూ.299 నుంచి ప్రారంభమవుతాయి -
దయచేసి మొక్కుతున్నా.. ఆలోచించండి: ఆర్పీ కంటతడి
ప్రస్తుతం దేశం వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు కరోనా మరణాలు రెట్టింపు అవుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉండటంతో సమయానికి వైద్యం అందక సొంతవారి కళ్లముందే ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోన్ని రాజకీయ నాయకుల అవలంభిస్తున్న తీరు, కార్పోరేట్ హాస్పిట్లా వారి దోపిడిపై మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, సింగర్ ఆర్పీ పట్నాయక్ అగ్రహం వ్యక్తం చేశారు. కొందరి నిర్ణక్ష్యం వల్లే అమాయకులైన ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టుకుంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రతి ఒక్కరి కదిలిస్తోంది. ‘అందరికీ నమస్కారం.. నేను మీ ఆర్పీ పట్నాయక్.. చాలా బాధగా ఉంది.. ఒకప్పుడు మనం వుహాన్‌ను చూసినట్టు.. ప్రస్తుతం ప్రపంచం మన దేశాన్ని చూస్తోంది. చాలా మాట్లాడాలని ఉంది.. ఎంత వరకు మాట్లాడాలో తెలియడం లేదు.. కానీ ఇప్పుడు ఇది అవసరం.. మా అమ్మకు బెడ్ దొరకలేదని హాస్పిటల్ సిబ్బంది మీద దాడి చేశారు కొంతమంది. బెడ్స్ లేనప్పుడు వారు ఇవ్వలేరు కదా?.. అమ్మ చనిపోయినప్పుడు వారికి కోపం రావడం తప్పు లేదు కానీ అదే సమయంలో.. కోవిడ్ రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోన్న సిబ్బంది మీద దాడి చేయడం వల్ల మిగతా వాళ్లు బాధలు పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ‘కరోనా లెక్కలన్నీ కూడా సరైనవి కావు. అసలైన లెక్కలు శశ్మానంలో కనిపిస్తుంటాయి. శవాలు కూడా క్యూలో ఉంటున్నాయి. ఆక్సిజన్ కోసం ఎంతో మంది హాస్పిటల్లో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలక్షన్స్ ముఖ్యం, ఫలితాలు ముఖ్యం.. గెలిచింది.. ఓడింది.. నైతిక విజయం.. అది ముఖ్యం అని అనుకునే ధౌర్భాగ్యపు రాజకీయ నాయకులు ఉన్నారు చూడండి. ఎందుకయ్యా మీరు.. ఇంత మంది శవాల మీద ఆడుకుంటున్నారు. అసలు మీరు మనుషులేనా.. ఎన్నికలు అయ్యాయి కదా వాటి మీద మీరు పెట్టిన శ్రద్ద కనీసం ఒక్క శాతమైన ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద పెట్టండి.. దయచేసి మొక్కుతున్నా.. కనీసం ఉన్న వాళ్లను ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నం చేయండి’ ఆయన అభ్యర్థించారు. View this post on Instagram A post shared by Rp Patnaik (@rp.patnaik) -
టిక్‌టాక్ శాశ్వతంగా బంద్
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ అయిన టిక్‌టాక్‌ను భారత్ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను ప్రమోట్ చేస్తున్న చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్.. భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2,000 పైచిలుకు ఉద్యోగులను తీసివేయనుంది. ఈ ఉద్యోగులకు మూడు నెలల వేతనంతోపాటు కంపెనీలో పనిచేసిన కాలాన్నిబట్టి మరో నెల పారితోషికం ఇవ్వనున్నారు. టిక్‌టాక్ గ్లోబల్ ఇంటెరిమ్ హెడ్ వనెస్సా పప్పాస్, గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ బ్లేక్ చండ్లీ సంయుక్తంగా భారత్‌లోని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్స్‌లో ఈ విషయాలను వెల్లడించారు. -
టిక్‌టాక్ బ్యాన్ : ‘రీల్స్’ వచ్చేసిందట!
సాక్షి, న్యూఢిల్లీ : టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేధం తర్వాత దేశీయంగా అదే తరహా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోటీ పెరిగింది. టిక్‌టాక్‌కు భారత మార్కెట్లో ఉన్ నక్రేజ్ను సొమ్ము చేసుకునేందుకు దిగ్గజ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఈ రేసులోకి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన ఇన్స్టాగ్రామ్ కూడా చేరిపోయింది .టిక్‌టాక్‌పై నిషేధంతో దాని యూజర్లందరూ చింగారి, రోపోసో ప్లాట్‌ఫామ్‌లవైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ఇన్‌స్టా వేగం పెంచింది. టిక్‌టాక్ లాంటి ఫీచర్లతో ఇన్స్టాగ్రామ్ తన 15 సెకన్ల చిన్న వీడియో ఫీచర్ ‘రీల్స్’ ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. టిక్‌టాక్ మాదిరిగానే, రీల్స్ వినియోగదారులను ఆడియో క్లిప్‌లతో 15-సెకన్ల వీడియోలను, స్టోరీలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది యూజర్లకు రీల్స్ కు సంబంధించిన అప్డేట్స్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే రీల్స్‌ను నవీకరిస్తున్నామని ధృవీకరించిన ఫేస్బుక్ నిర్దిష్ట వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. (టిక్‌టాక్ బ్యాన్.. దూసుకుపోతున్న చింగారీ) గత ఏడాది బ్రెజిల్ లో లాంచ్ చేసిన ఈ యాప్‌ను ఆ తరువాత ఫ్రాన్స్, జర్మనీ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా టిక్‌టాక్‌ను పోలిన తన లాస్సో యాప్‌ను జూలై 10 నుంచి మూసివేస్తున్నట్లు ఫేస్బుక్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో జనం చస్తుంటే... చాలా మంది ఆకలితో అలమటిస్తుంటే సెలబ్రిటీలు వంటావార్పుల వీడియోలతో లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లు షేర్ చేయడాన్ని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్రంగా తప్పుబట్టింది. ట్విట్టర్ వేదికగా ఆమె ‘మన వంట వీడియోలు, రుచుల ఫొటోల పోస్టింగ్ పూర్తయ్యిందా లేదా’ అని ఘాటుగా స్పందించింది. ‘ఒక్కసారి ఆలోచిం చండి... మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ ఉన్న జనంలో వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది మంది ఒక పూట తిండి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో అలాంటి వీడియోలు షేర్ చేయడమేంటి’ అని సానియా అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారం ప్రధాని మోదీ 49 మంది భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాను జయించేందుకు వారి సూచనలు, సలహాలు కోరిన సంగతి తెలిసిందే. -
అశ్లీల చిత్రాల వీక్షణ: రాజకీయ నేతల విచారణ!
సాక్షి, చెన్నై : ఇంటర్నెట్లో అశ్లీల చిత్రాలు చూస్తున్న రాజకీయ నేతలు సహా 30 మంది వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంటర్నెట్లో బాలబాలికల లైంగిక వీడియోల డౌన్లోడ్, షేర్ చేయడం, అశ్లీల వీడియోలను చూడడంలో తమిళనాడు ప్రథమస్థానంలో ఉన్నట్లు అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి ఇటీవల సమాచారం అందింది. దీనిని రాష్ట్ర పోలీసులకు పంపిన కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలకు నిరోధించే విభాగం అడిషనల్ డీజీపీ రవి కొన్ని రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి వీక్షించే వారి ఐపీ అడ్రస్సులు తమ వద్ద ఉన్నాయని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో సెల్ ఫోన్లలో అశ్లీల చిత్రాలను, వీడియోలను వీక్షించే వారి మధ్య కలకలం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో తిరుచ్చిలో బాలికల అసభ్య వీడియోలను డౌన్లోడ్ చేసి స్నేహితులకు షేర్ చేసిన నేరానికి తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్ అనే యువకుడిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి పాలకరై ఖాజాపేట కొత్త వీధికి చెందిన ఇతను ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. క్రిష్టోఫర్ ఐపీ అడ్రస్ ఆధారంగా తిరుచ్చి కంటోన్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి పోలీసు కమిషనర్ వరదరాజు ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కమిషనర్ మణికంఠన్, ఇన్స్పెక్టర్ ఆనంద వేదవల్లి... క్రిష్టోఫర్ వద్ద తీవ్ర విచారణ జరిపి అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. క్రిష్టోఫర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు. చదవండి: అశ్లీల వీడియోల షేరింగ్ వ్యక్తి అరెస్టు కాగా గత నాలుగేళ్లుగా క్రిష్టోఫర్ ఈ పనులకు పాల్పడుతున్నట్లు సమాచారం. అతని వద్ద నుంచి 150 ఫేస్బుక్, వాట్సాప్, ఇంటర్నెట్ స్నేహితులు టచ్‌లో వున్నట్లు తెలిసింది. 42 ఏళ్ల క్రిష్టోఫర్ ఈ వీడియోలను వీక్షించడంతో మానసిక రోగిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అతడి ఫోన్, మెమెరీ కార్డులను చెన్నైలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దీనికి సంబంధించిన నివేదిక అందగానే విచారణ తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. కిష్ట్రోఫర్ 150 మంది స్నేహితుల జాబితాలను తిరుచ్చి – చెన్నై, చెంగల్పట్టు, కోవై జిల్లాల పోలీసులకు తిరుచ్చి పోలీసులు పంపారు. ఈ జిల్లాలోని స్నేహితుల వద్ద విచారణ జరుగుతోంది. తిరుచ్చిలో రాజకీయ ప్రముఖులు, స్నేహితులు సహా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం క్రిష్టోఫర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక రాష్ట్రంలో అశ్లీల వీడియోలను చూసే వారిని పోక్సో చట్టంలో అరెస్టు చేయడం ఇదే ప్రప్రథమం. -
అశ్లీల వీడియోల షేరింగ్ వ్యక్తి అరెస్టు
సాక్షి, చెన్నై: పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలను ఆన్లైన్ మెసెంజర్ గ్రూప్ పేరిట వందలాది మందికి షేరింగ్ చేస్తూ వచ్చిన తిరుచ్చికి చెందిన వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో దిశా ఘటన తరువాత తమిళ పోలీసులు మహిళలు, యువతులు, బాలికలకు రక్షణ మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతూ అశ్లీల వీడియోలను వీక్షించే వారిని, వాటిని డౌన్లోడ్ చేసే వారు, షేరింగ్ చేసే వాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెడుతామన్న హెచ్చరికలు సైతం జారీ చేశారు. పదే పదే తమకు పట్టుబడితే ఏడేళ్లు జైలు శిక్ష తప్పదని ప్రకటించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్ అల్ఫోన్స్ రాజా(40) తొలుత ఆదవన్....ఆదవన్ పేరిట ఓ మెసెంజర్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని అశ్లీల వీడియోలను వందలాది మందికి షేరింగ్ చేస్తూ వస్తుండడాన్ని సైబర్‌క్రైం వర్గాలు పసిగట్టాయి. అదే సమయంలో రాజాపేట న్యూవీధికి చెందిన ముత్తు పాండి సైతం అల్ఫోన్స్ రాజాపై ఫిర్యాదు చేశాడు. అత్యధికంగా పిల్లల అశ్లీల వీడియోలు షేరింగ్‌లో తనకు వస్తున్నట్టుగా ముత్తు పాండి ఫిర్యాదు చేయడంతో సైబ్రర్ క్రైం వర్గాలు రంగంలోకి దిగాయి. ఐపీ అడ్రస్సు ఆధారంగా అల్ఫోన్స్ రాజా ఫోన్ నంబర్, అడ్రస్సును కనిపెట్టారు. గురువారం వేకువజామున అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు పూర్తి వివరాల్ని సేకరించే పనిలో పడ్డారు. -
ట్విట్టర్ నుంచి ఆప్షన్ తొలగింపు
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఖాతాదారులకు అందించే సేవల నుంచి మరో ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. వైన్ ఆప్షన్‌ను త్వరలో తొలగించేందుకు నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆప్షన్ ద్వారా షార్ట్ ఫామ్ వీడియో షేరింగ్ సర్వీసును అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాతాదారులు ఈ వైన్ ఆప్షన్‌తో వీడియోలను షేర్, డౌన్లోడ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. ట్విట్టర్ ఖాతాదారులకు వైన్ ఆప్షన్ ద్వారా విలువైన సేవలను అందిస్తోందని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక కారణాలు, పని భారంతో పాటు ప్రధాన పొటీదారులైన ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ నుంచి పోటీని తట్టుకోలేక ఇప్పటికే 9 శాతం ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ట్విట్టర్‌ను విక్రయించడానికి సన్నద్ధమైన కొనుగోలు చేసేందుకు ఏ కంపెనీ కూడా ముందుకు రాని విషయం తెలిసిందే. -
టాప్ వీడియో షేరింగ్ సైట్ గా ఫేస్ బుక్!
న్యూయార్క్: వీడియో షేరింగ్ లో ప్రపంచ నెంబర్-1గా ఉన్న యూ ట్యూబ్ ను ఫేస్ బుక్ తలదన్నే రోజు దగ్గర్లోనే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది పాటు 20 వేల ఫేస్ బుక్ పేజీలు,1.8 లక్షల పోస్టులను పరిశీలించి మరీ వీరు జోస్యం చెబుతున్నారు. ' కంటెంట్ మార్కెట్ చేసేవారు నేరుగా తమ వీడియోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తున్నారు.దీంతో ఫేస్ బుక్ అధిక సంఖ్యలో యూజర్లను నిలబెట్టుకోగలుగుతోంది.యూజర్లు ఫేస్ బుక్ ను విడిచి వెళ్లకుండా అలానే ఉండేందుకు ఇది తోడ్పడుతోంది'అని సోషల్ బేకర్స్ అనే సోషల్ మీడియా విశ్లేషణ కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది. ఇదిలా ఉండగా రోజూ 100 కోట్ల(బిలియన్) వీడియోలను అప్ లోడ్ చేస్తున్నట్లు గత సెప్టెంబర్ లో ఫేస్ బుక్ ప్రకటించడం కూడా ఇందుకు బలం చేకూర్చుతోంది.