గువాహటి: సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం చిన్నారుల ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై అస్సాం పోలీసులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ)తో రూపొందించిన చిన్నారుల చిత్రా లను వాడుకున్నారు. ‘పిల్లలు సోషల్ మీడియా ట్రోఫీలు కాదు, నెటిజన్ల దృష్టిలో పడేందుకు చిన్నారుల గోప్యతతో వ్యాపారం చేయకండి, మీ చిన్నారుల కథ చెప్పే అవకాశం వారికే ఇవ్వండి, లైక్స్ పాతబడిపోతాయి కానీ, డిజిటల్ మరకలు శాశ్వతం’వంటి సందేశాలను జత చేశారు. ఇటీవలి కాలంలో ఫ్యామిలీ వ్లాగర్లు ప్రచారం కోసం చిన్నారులను కూడా వాడుకోవడం ఎక్కువైపోయింది.
సోషల్ మీడియాలో తాము ఎలా కనిపిస్తామో తెలియని చిన్నారులను ప్రచారం కోసం ఉపయోగించుకోవడం ఎన్నో విధాలుగా నష్టం తెస్తుందని పోలీసులు చెబుతున్నారు. తమ పిల్లల చిత్రాలను షేర్ చేయడం హానికరం కాదని తల్లిదండ్రులు మొదట్లో భావించవచ్చు. కానీ, పిల్లలను గురించి అవసరం లేకున్నా ఎక్కువ మందికి తెలియడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చర్య పిల్లల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడంతోపాటు, వారి మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అస్సాం పోలీసుల ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది అద్భుతం, నేటి తల్లిదండ్రులకు ఇలాంటి సందేశాలు ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. అస్సాం పోలీసులు ఇటీవల సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ సినిమాలతో ప్రభావితమైన సైబర్ నేరగాళ్ల కృత్రిమ మేధ చిత్రాలను ట్వీట్ చేసి ప్రశంసలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment