నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 67 పరుగుల లీడ్‌తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్‌కుమార్ వైశాఖ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు.
కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్..
ఈ మ్యాచ్‌లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్‌కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్‌ను దెబ్బకొట్టారు.