అక్రమాలు ఇంకెన్నాళ్లు.. ఇకపై సాగవు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: గుట్టుచప్పుడు వ్యాపారాలు సాగించే అక్రమార్కుల కు ఇకపై గుండెదడ పట్టుకోనుంది. ఎవరు ఫిర్యాదు చేస్తారు లే అని ఇంతవరకు యథేచ్ఛగా అక్రమ లావాదేవీలు నెరిపిన వారి వ్యాపారాలు ఇక సాగవు. ఎందుకంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ప్రజాభాగస్వామ్యంతో పనిచేస్తుం ది. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం నుంచి కంది పప్పు, కిరోసిన్ తదితర సబ్సిడీ సరుకుల అక్రమ రవాణాపై విజిలె న్స్ కన్ను పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అక్రమార్కులపై దృష్టి సారించారు. ఇక నుంచి అక్రమ రవాణా చేసే సమాచారాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రజల నుంచి కోరుతోంది.
ఒక్క పౌరసరఫరాల సరుకులే కాదు, ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టి చేసే అక్రమ రవాణాపైనా దృష్టి సారించింది. సరుకుల అక్రమ రవాణా సమాచారాన్ని, అక్రమ వ్యాపారాల సమాచారాన్ని తమకు వెంటనే అందివ్వాలంటూ ఒక ఫోన్ నంబర్‌ను కూడా ప్రకటించింది. 8008203248 నంబరుకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరుతున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇక ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఆక్రమార్కుల ఆటలు కట్టించాలని నిశ్చయించింది. దీనిపై ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తోంది. జిల్లాలో ప్రతి నెలా 6లక్షల కార్డు దారులకు బియ్యం, కిరోసిన్, కింది పప్పు, పామాయిల్, పంచదార, చింతపండు, ఇతర వస్తువులు సరఫరా చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా సరుకులు సరఫరా అవుతున్నప్పటికీ వాటిని డీలర్లకు సరఫరా చేశాక అవి మళ్లీ నేరుగా వ్యాపారుల దగ్గరకే చేరుతున్నాయి. వీటిని తిరిగి మిల్లర్లకు అమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. వీటిపై పలుమార్లు విజిలెన్స్ దాడులు నిర్వహించినా నామమాత్రంగా ఉండేవి. కానీ ఈసారి ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడంతో ఈ వ్యవస్థ కఠినతరం కానుంది. విజిలెన్స్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్రమాలను అరికట్టి నిధుల లేమి నుంచి కాస్తయినా బయట పడాలని ఆశిస్తోంది. ఈ వ్యవస్థ ను పటిష్టపరిస్తే వివిధ రకాలైన వస్తువులనుంచి రావాల్సిన పన్నులు, ఇతర బకాయిలు వసూలై ప్రభుత్వ ఖజానాకు పడిన గండిని కొంతయినా పూడ్చగలమని భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి విజిలెన్స్ శాఖ ఈ జిల్లాపై దృష్టి సారించింది. దీని ప్రకారం ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు బనాయించడమే కాకుండా భారీ మొత్తంలో అపరాధ రుసుములు విధించేం దుకు సమాయత్తమవుతోంది. పన్నులు ఎగవేసే వ్యాపారా లు, ప్రభుత్వ రాబడికి నష్టం కలిగించే చర్యలకు పూనుకుంటే ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారు లు హెచ్చరిస్తున్నారు. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలతో రంగంలోకి దిగుతున్నామని ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదో రకం ఉపాధి..!
ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి సరఫరా అవుతున్న పీడీఎస్ బియ్యంలో 30 శాతం మాత్రమే సద్వినియోగమవుతున్నాయన్న లెక్కలున్నాయి. కొన్ని డిపోల నుంచి ఈ బియ్యం నేరుగా వ్యాపారుల వద్దకు వెళ్లిపోతున్నాయి. వాస్తవానికి ఈ రేషన్ బియ్యం వ్యాపారాన్నే ఉపాధిగా మలుచుకుని కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయంటే ఈ అక్రమ వ్యాపా రం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. గ్రామా ల్లో ఉన్న వ్యాపారులు మండల కేంద్రాలు, సమీప పట్టణా ల్లో ఉన్న వ్యాపారులకు ఈ బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రతి నెలా ఈ బియ్యం తినని కుటుంబాల నుంచి సేకరించి పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఆ బియ్యానికి పాలిషింగ్ చేరి బహిరంగ మార్కెట్లో అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ బియ్యాన్నే మిల్లర్లకు లెవీకి ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటిని అరికట్టే కోణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా నిఘా పెట్టడంతో పేదల బియ్యం పక్కదారి పట్టవనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్,ఇతర పరికరాలు అక్రమంగా రైల్లో రవాణా అవుతున్నాయి. వీటికి చెల్లించాల్సిన లక్షలాది రూపాయల పన్నులను ఎగ్గొడుతు వ్యాపారుల ఆటకూడా కట్టిస్తామని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు.