సాక్షి, విజయవాడ : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (దుర్గగుడి) ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అవినీతిని విజిలెన్స్ ఇప్పటికే పలుమార్లు వెలుగులోకి తెచ్చింది. ఇంకోవైపు అమ్మవారి మూలనిధి తరిగిపోతోంది. తాజాగా ఆలయంలో జరిగిన తాంత్రిక పూజలు వెలుగుచూడటంతో భక్తులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
మూలధనం నేలచూపులు
ఒకప్పుడు ఆలయానికి వచ్చిన అధికారులు అమ్మవారి మూలధనం పెంచేందుకు, భక్తులు అధిక సంఖ్యలో అమ్మని దర్శించుకునేలా కృషి చేసేవారు. మూడేళ్లుగా ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆలయంలో అభివృద్ధి పేరుతో నిధులు ఖర్చు చేయడం మినహా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. మరో వైపు అమ్మవారి మూలధనం తరిగిపోతోంది. అభివృద్ధిపేరుతో ఇంద్రకీలాద్రిపై ఉన్న పరిపాలన, అన్నదాన భవనాలను కూల్చివేశారు. భవానీ మండపాలను తొలగించారు. కొండదిగువున భూములు తీసుకునేందుకు అమ్మవారి డిపాజిట్లు వినియోగించడంతో మూలధనం తరగిపోయింది.
ఒక్కప్పుడు రూ.120 కోట్లు వరకు ఉన్న మూలధనం ఇప్పుడు కేవలం రూ.40 కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను తీస్తే తప్ప సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరో వైపు దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటూ ఉండటంతో విరాళాలు ఇచ్చే దాతలు కరువయ్యారు. భక్తులకు సౌకర్యాలు కోసం నిర్మించిన ఇంద్రకీలాద్రి గెస్ట్ హౌస్‌ను కార్యాలయంగా మార్చడం, సీతానగరంలో కాటేజీని దేవాదాయశాఖకు ఇవ్వడంతో భక్తులకు కనీసం సౌకర్యాలు కరువయ్యాయి. రూ.20 కోట్లు ఖర్చు చేసిన సీసీ రెడ్డి చారిటీస్‌లో నిర్మించిన కాటేజీలు ఐదారు వందల మందికి మాత్రమే సరిపోతాయి.
తాంత్రిక పూజలు వెలుగులోకి..
అమ్మవారి సన్నిధిలో తాంత్రిక పూజలు చేయడం దేవాలయం ప్రతిష్ట మాత్రం మసకబారింది. ప్రభుత్వంలోని ఒక కీలకవ్యక్తి కోసం, నిన్నమొన్నటి వరకూ ఆలయ ఈఓగా బాధ్యతలు నిర్వర్తించిన సూర్యకుమారి ఆదేశాలతోనే పూజలు చేశామని ఆర్చకులు చెబుతున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అర్ధరాత్రి పూట పూజలు చేయడాన్ని అర్చకులు విభేదించాలి. అయితే దేవస్థానంలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన కొంతమంది అధికారులు ఉన్నతాధికారులు చెప్పిన విధంగా శాస్త్రాలనే మార్చివేస్తూవారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు సీనియర్ అర్చకులు ఆగమశాస్త్రానానికి విరుద్ధంగా చేయొద్దని చెప్పినా.. వారిని పక్కన పెట్టేస్తున్నారనే తప్ప వారి సూచనలను పరిగణలోకి తీసుకోవడం లేదు. గత అనేక దశాబ్దాలుగా దేవాలయంలో లేని అనేక పూజలను ఐదారేళ్లలో ప్రవేశపెట్టారు. దీనికి కొంతమంది అర్చకుల వత్తాసు ఉంది. ఈ క్రమంలోనే తాంత్రిక పూజలు జరిగాయి. భవిష్యత్తులోనైనా ఆగమశాస్త్రానికి విరుద్ధంగా దేవాలయంలో ఏ కార్యాక్రమాలు నిర్వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
అవినీతిపై విజిలెన్స్ డేగకన్ను
దుర్గమ్మసన్నిధిలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ ఇప్పటికే పలుమార్లు నివేదికలు ఇచ్చింది. ఇటీవల ఇచ్చిన నివేదికల్లో గత రెండేళ్లలో జరిగిన అవినీతిపై ఎండగట్టింది. అకౌంటింగ్ విభాగంలో జవాబు లేనితనం నుంచి, ఇంజినీరింగ్‌లో క్యూలైన్లు ఏర్పాటుకు నిధులు దుర్వినియోగం, అన్నదానంలో భక్తులు సంఖ్య ఎక్కువగా చూపించడం, అన్నదానికి కొనుగోలుచేసే సరుకుల్లో అవకతవకులు, లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీలో కూలీల సంఖ్యను ఎక్కువ చూపిం చడం, ప్రసాదాలు దెబ్బతినండం తదితర అంశాలను విజిలెన్స్ అధికారులు కడిగిపారేశారు. ఇప్పుడు దేవస్థానం అధికారులు వాటికి వివరణ ఇచ్చుకునే పనిలో ఉన్నారు. కొత్తగా వచ్చే అధికారులైనా ఆలయ ప్రతిష్టను పెంచేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment