vihicles
-
పాతబండిపై ఇక కొత్త బాదుడు!
హైదరాబాద్: పాత బండ్లపై కొత్త బాదుడుకు రంగం సిద్ధమవుతోంది. పదిహేనేళ్లు దాటిన వాహనాలను మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకొంటే భారీగా హరితపన్ను చెల్లించాల్సిందే. దీనికిగాను అధికారులు త్వరలో విధివిధానాలను ఖరారు చేయనున్నారు. వాహనాల జీవితకాల పన్నులో ఇది మూడోవంతు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు, కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్రం ప్రత్యేక పాలసీని తెచ్చింది. స్వచ్ఛందంగా వదులుకొనేవారికి కొత్త వాహనాలపై రాయితీ ఇస్తూనే పాతవాటిని పునరుద్ధరించుకొనేవారికి భారీగా వడ్డించనున్నారు. మొదటి దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను స్క్రాప్ చేస్తారు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు. రెండోదశలో రవాణా, వ్యక్తిగత వాహనాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఏడాదికోసారి హరితపన్ను చెల్లించి రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్లో 2006 నుంచే హరితపన్ను పాత వాహనాలపై గ్రేటర్లో 2006 నుంచే హరితపన్ను వసూలు చేస్తున్నారు. వాహనాల రద్దీని, కాలుష్యాన్ని తగ్గించేందుకు భూరేలాల్ కమిటీ సిఫారసుల మేరకు రవాణాశాఖ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు రూ. 250–350 వరకు గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి చాలా మంది బండ్లను పునరుద్ధరించుకుంటున్నారు. అయితే ఇది వ్యక్తిగత వాహనాల జీవితకాల పన్నులో మూడోవంతు వరకు విధించడం వల్ల వాహన ధరల శ్రేణికి అనుగుణంగా కనిష్టంగా రూ. 6 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో గ్రీన్‌ట్యాక్స్ విధానాన్నే కేంద్రం దేశమంతా అమలు చేయాలనుకుంటోంది. గ్రేటర్లో 14 లక్షలపైనే... జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 60 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి. ఏటా సుమారు 2 లక్షల వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. వ్యక్తిగత వాహనాలు విస్ఫోటన స్థాయికి చేరుకోగా, ప్రజారవాణా వాహనాల వినియోగం తగ్గుముఖం పడుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సుమారు 23 లక్షల మేర కాలం చెల్లిన వాహనాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలో 14 లక్షల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
వాహన విస్ఫోటం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వాహన విస్ఫోటం దిశగా సాగుతోంది. గత ఐదేళ్లలో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతూ ప్రస్తుతం గరిష్టస్థాయికి చేరుకుంది. తాజాగా రవాణా శాఖ ప్రభుత్వానికి సమర్పించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 1,37,47,534 వాహనాలున్నాయి.15 ఏళ్ల కింద రాష్ట్రంలో వాహనాల సంఖ్య కంటే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం లో 83 లక్షల కుటుంబాలు ఉండగా, వాహనాలు 1.37 కోట్లకు చేరాయి. ఈ సంఖ్య మరింత వేగంగా పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 9 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి చేరుతున్నాయి. కోవిడ్ వల్ల గత ఏడాది నుంచి ఆ సంఖ్య కొంత తగ్గగా, వచ్చే సంవత్సరం ఏకంగా 12 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపైకి వస్తాయని అంచనా. ఐదేళ్ల కిందట కోటి..సరిగ్గా ఐదేళ్ల కిందట రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటి మార్కును చేరింది. ఇప్పుడా సంఖ్య కోటిన్నరకు చేరువవుతోంది. మరో నాలుగేళ్లలో 2 కోట్లను మించుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం వాహనాల్లో బైక్‌ల వాటా ఏకంగా 74.25 శాతం. ప్రస్తుతం రాష్ట్రంలో 1.02 కోట్ల బైక్‌లు ఉన్నాయి. గతంలో గ్రామాల్లో ప్రతి ఇంట్లో సైకిల్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని బైక్ ఆక్రమించింది. హైదరాబాద్ సహా పట్టణాల్లో కచ్చితంగా ఇంటింటా బైక్ ఉండాల్సిందే. గతంలో పండ్లు, పూలు విక్రయించేవారు సైకిళ్లను వినియోగించేవారు. రెండేళ్ల నుంచి వారు మోపెడ్లను వినియోగించటం ప్రారంభించారు. కొన్ని మోపెడ్ తయారీ సంస్థలు వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నాయి. నెలకు 55 వేల బైక్‌లు.. ప్రతినెలా సగటున 55 వేల నుంచి 60 వేల వరకు బైక్‌లు అమ్ముడవుతున్నాయి. ఇక కార్ల కొనుగోలు కూడా బాగానే పెరిగింది. మధ్యతరగతి వారు ప్రస్తుతం కారును అవసరంగా భావించే పరిస్థితి వచ్చింది. లోన్ పద్ధతిలో కార్లను విక్రయిస్తున్నారు. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కార్ల తయారీ సంస్థలు తక్కువ ధరలో వచ్చే కార్ల మోడళ్లను పెద్ద సంఖ్యలో పవేశపెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యక్తిగత కార్ల సంఖ్య 17 లక్షలకు చేరువైంది. ప్రస్తుతం ప్రతి నెలా 12 వేల నుంచి 16 వేల వరకు కార్లు అమ్ముడవుతున్నాయి. కోవిడ్ కాలంలోనూ అదే తీరు.. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో చాలాకుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. కానీ వాహనాలు కొనే విషయంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. కరోనా వల్ల ఇతరులతో కలసి ప్రయాణించేందుకు భయపడ్డ జనం.. సొంత వాహనం ఉండాలన్న అభిప్రాయంతో వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపారు. లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్న 2 నెలలు కాకుండా.. మిగతా నెలల్లో వాహనాల కొనుగోలు భారీగానే సాగింది. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు కోవిడ్ భయం ఎక్కువగానే ఉంది. ఆ 7 నెలల్లో రాష్ట్రంలో 4,39,188 ద్విచక్రవాహనాలు అమ్ముడుపోయాయి. ఏడాది ముందు ఇదే సమయంలో 4.6 లక్షలు అమ్ముడయ్యాయి. 2019 నవంబర్‌లో రాష్ట్రంలో 72 వేల ద్విచక్రవాహనాలు అమ్ముడుపోగా, గత నవంబర్‌లో 75 వేలు విక్రయమయ్యాయి. 2019 డిసెంబర్లో 52 వేలు అమ్ముడైతే, గత డిసెంబరులో 53 వేలు అమ్ముడయ్యాయి. ఇక ఆ 7 నెలల్లో రాష్ట్రంలో 89,345 కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ సంఖ్య 89,837గా ఉంది. 2019 నవంబర్‌లో 12,045 కార్లు అమ్ముడుకాగా, గత నవంబర్‌లో 13,852 అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్లో 17,135 అమ్మితే, 2020 డిసెంబర్లో 17,506 విక్రయమయ్యాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 2019 సంవత్సరంతో పోలిస్తే ఎక్కువే వాహనాలు అమ్ముడవటం విశేషం. ఈ మూడు నెలల్లో సగటున నెలకు 75 వేల బైక్‌లు అమ్ముడు కాగా, కార్లు 18 వేల చొప్పున అమ్ముడయ్యాయి. ఉధృతంగా సెకండ్‌హ్యాండ్ వాహనాల విక్రయం.. సెకండ్‌హ్యాండ్ వాహనాల అమ్మకాలు గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. కోవిడ్ సమయంలో అల్పాదాయ వర్గాలు సెకండ్ హ్యాండ్ వాహనాల వైపు దృష్టి సారించారు. 2019లో జూలై నుంచి డిసెంబర్ వరకు 1.1 లక్షల బైక్‌లు చేతులు మారగా, 2020లో ఏకంగా 1,51,877 అమ్ముడయ్యాయి. కార్ల విషయంలో ఆ సంఖ్య 77 వేలు, 99,807గా ఉండటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో వాహనాల సంఖ్య ఇలా.. ద్విచక్ర వాహనాలు: 1,02,12,380 వ్యక్తిగత కార్లు: 16,69,490 మోటార్ క్యాబ్: 1,15,857 సరుకు రవాణా వాహనాలు: 5,45,653 ట్రాక్టర్, ట్రెయిలర్స్: 5,94,677 ఆటో రిక్షా: 4,41,135 స్టేజీ క్యారేజీ వాహనాలు: 18,462 విద్యాసంస్థల బస్సులు: 27,883 మ్యాక్సీ క్యాబ్: 31,070 కాంట్రాక్ట్ క్యారేజీ వాహనాలు: 9,063 ప్రైవేటు సర్వీస్ వెహికిల్స్: 2,942 ఈ–రిక్షా కార్ట్: 208 ఇతర వాహనాలు: 78,714 -
రాజీవ్‌నగర్‌లో పోలీసుల తనిఖీలు
సత్తుపల్లి : శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు సత్తుపల్లిలోని రాజీవ్‌నగర్‌ను ఒక్కసారిగా పోలీసులు చక్రబంధంలో బంధించారు. ఉదయం 7.30 గంటల వరకు 488 ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఒక్కసారిగా పోలీసులు వచ్చేసరికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఒక్కొక్క ఇంటిలోకి వెళ్లి ఆధార్ కార్డులను, వాహన ధ్రువపత్రాలను పరిశీలించారు. కొన్ని ఇళ్ళలోని సూట్ కేసులు, బట్టల మూటలను తెరిపించి మరీ తనిఖీ చేశారు. రాజీవ్‌నగర్ మొత్తం రెండు గంటల్లో జల్లెడ పట్టారు. ఒకరి వద్ద రెండు ఆధార్ కార్డులు ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో.. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాలతో రాజీవ్‌నగర్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్ తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. డివిజన్లోని సత్తుపల్లి పట్టణ, రూరల్ సీఐలు ఎం.వెంకటనర్సయ్య, మడతా రమేష్ గౌడ్, ఎస్ఐలు నరేష్‌బాబు, వెంకన్న, నాగరాజు, నరేష్, పవన్‌కుమార్, ఎక్సైజ్ ఎస్ఐ చంద్రశేఖర్‌లతోపాటు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. వాహనాల స్వాధీనం.. కార్డన్ సెర్చ్‌లో అప్పటికప్పుడు సరైన ధ్రువపత్రాలు చూపించని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 44 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. వీటిలో ఇన్సురెన్స్, లైసెన్స్, ఆర్సీ బుక్ లేని వాహనాలున్నాయి. అయితే సరైన పత్రాలు పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తే వాహనాలను తిరిగి వహనదాలకే ఇచ్చేస్తామని కల్లూరు ఎసీపీ బల్లా రాజేష్ స్పష్టం చేశారు. -
65 లక్షల టయోటా కార్ల రీకాల్
టోక్యో: జపాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ 'టయోటా' 6.5 మిలియన్ వాహనాలను వెనక్కి తీసుకుంటోంది. ఆ సంస్థ వాహనాల తయారీలో చిన్న సాంకేతిక లోపం తలెత్తడంతో అగ్ని ప్రమాదం బారినపడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ ప్రక్కగా ఏర్పాటు చేసిన పవర్ విండో మాస్టర్ స్విచ్‌లో సమస్యలు గుర్తించినట్లు టయోటా కంపెనీ తెలిపింది. మాస్టర్ స్విచ్ మెల్ట్ అయి మంటలు వ్యాపించే ప్రమాదం ఉన్నందున వాహనాలను వాపసు తీసుకుంటున్నట్లు టయోటా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ తరహాలో ఎలాంటి ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి రాకున్నా.. ముందు జాగ్రత్త చర్యగా వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్లు టయోటా తెలిపింది. ఇటీవలి కాలంలో టయోటా వాహనాల 'ఎయిర్ బ్యాగ్'లలో సమస్యలు తలెత్తడంతో 10 మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వెనక్కి తీసుకుంటున్న వాహనాలు 2005 నుండి 2010 మధ్య కాలంలో విక్రయించిన యారిస్, కొరోల్లా, కామ్రి లతో పాటు ఆర్ఏవీ4 తరహా మోడల్ వాహనాలు ఉన్నాయి. ఈ మోడల్ వాహనాలను ఎక్కువగా ఉత్తర అమెరికా, బ్రిటన్‌లో విక్రయించినట్లు టయోటా తెలిపింది.