Vijay Chander
-
ఆయనే నాతో ఆ పాత్రలు చేయించుకున్నాడు
-
గొల్లపూడి లేని లోటు తీర్చలేనిది
సాక్షి, విజయవాడ: ప్రముఖ నటుడు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్డీసీ) చైర్మన్ టిఎస్ విజయ్ చందర్ సంతాపం తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిది అని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ, సాహిత్య, నాటక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొల్లపూడి గొప్ప వ్యక్తిత్వం గల మనిషని ఆయనను కొనియాడారు. విజయనరంలో జన్మించి, విశాఖపట్నంలో వృత్తిని ప్రారంభించి కళామతల్లి సేవలో పునీతులైన గొల్లపూడి బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. ఆయన మొదటిసారిగా స్క్రీన్‌ప్లే అందించిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రంతో తొలి నంది పురస్కారాన్ని గెలుచుకున్నారని వెల్లడించారు. తన సినీ జీవితంలో ఆరు నంది పురస్కారాలు అందుకున్నారన్నారు. దాదాపు 80 చిత్రాలకు రచయితగా, 290 చిత్రాలకు నటుడిగా గొల్లపూడి సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకమని విజయ్ చందర్ తెలిపారు. -
వైఎస్‌గారికి మరణం లేదు
‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిగారు నాకు ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇస్తానన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక నన్ను ఎఫ్డీసీ చైర్మన్‌గా నియమించి వైఎస్‌గారి మాట నిలబెట్టారు’’ అని నటుడు, ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా (ఏపీ ఎఫ్డీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన విజయచందర్ అన్నారు. హైదరా బాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ► 2003లో ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు వైఎస్‌గారిని చూడగానే ‘సార్.. ఈ సారి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. నాకు ఎఫ్డీసీ చైర్మన్ అవ్వాలని ఉంది? అన్నాను. ఆయన నవ్వి సరే అన్నారు. 2004లో సీఎం అయ్యాక మొదటిసారి నాకు ఇవ్వలేదు. 2009లో 150 సీట్లతో మళ్లీ సీఎంగా గెలిచారు. ఆయన ఆఫీసుకు వెళ్తూ నన్ను చూసి, షేక్ హ్యాండ్ ఇచ్చి, ‘ఎలా చెప్పావయ్యా 150 సీట్లు వస్తాయని?’ అన్నారు. ‘మూడు నెలల్లో నిన్ను ఎఫ్డీసీ చైర్మన్ చేస్తా’ అన్నారు. కుదర్లేదు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌గారి ద్వారా నాకు ఇప్పించారనిపిస్తోంది.. అందుకే ఆయనకు మరణం లేదనే మాట నేడు నిరూపితమైంది. ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆయన ఉంటారు. ► ‘చెన్నైలో, హైదరాబాద్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా అభివృద్ధి చెందిందో అలా మన రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేద్దాం’ అని జగన్‌గారు నాతో అన్నారు. ► తెలంగాణలో చిత్రరంగాన్ని అభివృద్ధి చేసినట్టు ఏపీలోనూ చేయాలని ఇండస్ట్రీ వారిని కోరుతున్నా. అందుకు కావాల్సిన అంశాలను ఇండస్ట్రీ పెద్దలందర్నీ అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ► తెలుగు రాష్ట్రాల్లోని ఇండస్ట్రీ పెద్దలందర్నీ కలుసుకుంటాను. సురేష్ బాబుగారు ఫోన్ చేశారు. ఏపీలో షూటింగ్‌లకు డైరెక్ట్‌గా ఎఫ్డీసీ నుంచి అనుమతులు లభించేలా చూడాలన్నారు నిర్మాత వివేక్ కూచిభొట్ల. ఆంధ్రప్రదేశ్‌లో కొంత ఫిల్మ్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చి అక్కడ స్థిరపడిపోయే వారికి మరిన్ని సదుపాయాలు కల్పిస్తాం. ఆంధ్ర ప్రదేశ్‌లో కేవలం షూటింగ్‌లు మాత్రమే కాకుండా, నిర్మాణ సంస్థలు వారి ఆఫీసులను కూడా పెట్టాలని కోరుతున్నాం. ఏపీఎఫ్డీసీ డైరెక్టర్స్ విభాగంలో తొలి సభ్యుడిగా సుజిత్‌ను ఎంపిక చేసుకున్నాం. ► మన కళామతల్లికి సేవ చేస్తున్న వారందరి ఫొటోలు, వివరాలతో విశాఖపట్నంలో ‘నందనవనం’ పేరుతో మన చరిత్ర చూపించే విధంగా ప్లాన్ చేద్దాం’ అని జగన్‌గారు అన్నారు. అందుకు ఆయనకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొత్త నిర్మాతలకు, చిన్న నిర్మాతలకు అండగా ఉంటాం. ► తెలుగు రాష్ట్రాల ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుగార్లకు హ్యాట్సాఫ్. -
కోడి రామకృష్ణ పార్దివదేహానికి విజయచందర్ నివాళులు
-
రానున్న కాలం యువతదే
లోకానికి ప్రేమను పంచిన కరుణామయుడైనా.. సబ్కా మాలిక్ ఏక్ అంటూ విశ్వసౌభ్రాతృత్వాన్ని చాటిన షిరిడిసాయినాథుడైనా.. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధపడిన టంగటూరి ప్రకాశం పంతులైనా..భక్త కబీరైనా, యోగి వేమనైనా ఇలా ఉంటారా అనే విధంగా ఆయా పాత్రలతో తెలుగు వారి మదిలో చెరగని ముద్ర వేసిన సినీ నటుడు విజయ్‌చందర్. షిరిడిసాయిబాబా 100వ పుణ్యతిథి సందర్భంగా అనంతపురంలో జరుగనున్న భారీ నగరోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సినిమాలపైనే కాకుండా వర్తమాన రాజకీయాలపైన విస్తృత అవగాహనతో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. సాక్షి: మీ కుటుంబ నేపథ్యం చెప్పండి.. విజయ్‌చందర్: మాది తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో మా పూర్వీకులు కరణాలుగా ఉండేవారు. ముఖ్యంగా 1935 ప్రాంతంలో కాకినాడ జమిందారు జానకి రామయ్యగారు మా తాతగారిని దత్తత తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండిపోయాము. తర్వాత మా చదువంతా కాకినాడలోనే నడిచింది. నాకిప్పుడు 80 ఏళ్లు. గాంధీజీ పర్యటనలు, భారత స్వాతంత్య్ర పోరాటం దగ్గరగా చూసే అవకాశం నాకు కల్గడం అదృష్టం. ప్రఖ్యాత గాయని టంగటూరి సూర్యకుమారి స్వయానా మా పిన్నిగారవుతారు. సాక్షి: సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? విజయ్‌చందర్: మేము చదువుకునే రోజుల్లో రాఘవ కళా సమితి అనే నాటక సమాజాన్ని స్థాపించుకుని నాటకాలాడేవాళ్లం. ఏడిద నాగేశ్వరరావు, కె.విశ్వనాథ్, వీబీ రాజేంద్రప్రసాద్ లాంటి దిగ్గజాలు మా సంస్థలో ఉండేవారు. అలా నేను నాటకాలలో మంచి స్థాయిలో ఉన్నప్పుడు ‘మరో ప్రపంచం’ సినిమా ద్వారా స్త్రీపాత్రతో ప్రవేశించాను. వరుసగా 6, 7 సినిమాలు హీరోగానే నటించాను. సాక్షి: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎలా మారారు ? విజయ్‌చందర్: క్యారెక్టర్ బలంగా ఉండే పాత్రలు రావడం నా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే 1978లో ‘కరుణామయుడు’ సినిమాలో క్రీస్తు పాత్ర ధరించాను. అంతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ క్రీస్తు ఇలానే ఉంటారన్న భావనలో ఉండిపోయారు. ఇతర భాషల్లో చాలా అవకాశాలొచ్చినా నాకు తెలుగంటే మహా పిచ్చి. దానికి తోడు మంచి పాత్రలు రావడంతో ఇక్కడే ఉండిపోయాను. సాక్షి: బయోపిక్స్ తీయడం ఇష్టమనుకుంటా..! విజయ్‌చందర్: ఇప్పుడిప్పుడు బయోపిక్స్‌కు చాలా ఆదరణ వస్తోంది. కానీ బయోపిక్స్ ప్రారంభమైందే నాతో అని చాలామంది అంటారు. నిజమే క్రీస్తు పాత్ర నుండి షిరిడి సాయిబాబా, భక్త కబీరు, యోగి వేమన, టంగటూరి ప్రకాశం పంతులు లాంటి జీవితాలకు అద్దం పట్టేట్టు నటించడం నాకొచ్చిన మంచి అవకాశం. ఇటీవల సావిత్రిపై వచ్చిన సినిమా కూడా చాలా బాగుంది. సాక్షి: సినిమాలపై మీ అభిప్రాయం విజయ్‌చందర్: చాలామంది సినిమాలు చెడిపోతున్నాయనే భావనతో నేను అంగీకరించను. నటీనటుల్లో కూడా అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్ ఎంత క్రమశిక్షణతో ఉండే వారో ఎంత మంచి నటులో ఇప్పటితరంలో కూడా జూనియర్ ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్, అల్లూ అర్జున్, మహేష్‌బాబు, రామ్‌చరణ్ లాంటి వారు నిబద్ధతతోనే పనిచేస్తున్నారు. అంతే స్టార్డమ్ ఉంది. మంచి చెడులు అప్పుడూ ఉన్నాయి ఇప్పుడూ ఉన్నాయి. బాహుబలి లాంటి సినిమా ఇప్పుడు కాక మరెప్పడిది. సాక్షి: రాజకీయ అరంగేట్రం గురించి.. విజయ్‌చందర్: కొత్తగా రాజకీయాల్లోకి రావడం ఏమిటండి? రాజకీయాలు పుట్టిందే మా తాతగారైన ప్రకాశం పంతులు ఇంట్లో. భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేని రోజుల్లో దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకూ 11 నెలల పాటు తాతయ్య సీఎంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం కూడా ముఖ్యమంత్రి అయ్యారు. విలువల కోసం పదవిని త్యజించిన త్యాగం ఆయనది. అప్పటి నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానే రాజకీయాలలో ఉన్నాను. సాక్షి: రాజశేఖరరెడ్డితో మీ అనుబంధం.. విజయ్‌చందర్: అదొక మధురానుభూతిగా మిగిలిపోయింది. చిన్నవయసులో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రులుగా ఉన్న సమయంలో ఒకసారి సినిమాల విషయమై వారితో కలిశాను. ప్రత్యేకంగా రాజశేఖరరెడ్డి నవ్వు నన్ను అమితంగా ఆకర్షించింది. అలా పరిచయం అయిన తర్వాత వందలసార్లు ఆయన ఇంటికి వెళ్లే సందర్భాలు వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగారు ‘తరచూ మా ఇంటికి వస్తున్నారు ఏమైనా చేయాలా’ అని. ‘వద్దు కేవలం మీ స్వచ్ఛమైన నవ్వును చూడడానికి మాత్రమే వస్తున్నాను’ అని నేను అనేవాన్ని. సాక్షి: రాజకీయాలు, సినిమాల ప్రయాణం ఏకకాలంలో సాధ్యమేనా? విజయ్‌చందర్: నా వయసుకు తగ్గట్టు నేను లేను. అంటే వృద్ధాప్య మనస్తతం నాది కాదు. పొట్టి శ్రీరాములు బయోపిక్ తీయాలని కొందరు పట్టుబట్టారు. మేమదే పనిలో ఉన్నాము. ఇక రాజకీయాలంటారా కాంగ్రెస్ ఏపీ ప్రజలకు చేసిన మోసానికి నామరూపాలు లేకుండా పోయింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే యువశక్తిని అందరూ గుర్తిస్తారు. రానున్న రోజుల్లో జరిగేది అదే. ఇక నా విషయమంటారా ధర్మాన్ని కాపాడడానికి నా వంతు కృషి చేయడమే మినహా ఇక నేను కోరుకునేదేదీ ఉండదు. సాక్షి: రాజకీయ విలువలు నాడు.. నేడు ఎలా ఉన్నాయి? విజయ్‌చందర్: అందరినీ అనలేం కానీ పూర్తి స్వార్థపరంగా మారిపోయాయి పరిస్థితులు. దేశ మాత సంకెళ్లను తెంచడానికి నాటి నాయకులు పోరాటం చేస్తే.. ఇప్పటి పరిస్థితులు చూస్తే మళ్లీ బానిస బతుకుల్లోకి వెళ్లిపోతున్నట్లు అనిపిస్తోంది. మరో స్వాతంత్య్ర ఉద్యమం తప్పదనే స్థితికి చేరుకోవడం విచారకరం. ఆ రోజుల్లో మా తాతగారు నీలం సంజీవరెడ్డినైనా, బెజవాడగోపాలరెడ్డినైనా ప్రేమతో ఏరా అని సంబోధించినా మనస్పూర్తిగా అంగీకరించేవారు. ఇప్పుడెక్కడున్నాయి విలువలు. సాక్షి: వ్యక్తిత్వంలో వైఎస్సార్‌కు ఇతరులకు ఉన్న తేడా? విజయ్‌చందర్: కొంత కాదు కొండంత. చాలామంది కరుడు కట్టిన స్వార్థంతో ఉంటే రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ప్రజల పిచ్చిలో ఉండేవారు. ఏమైనా చెప్పారు అంటే అది కచ్చితంగా చేస్తారనేది నూరు శాతం గ్యారంటీ అని ప్రజలు గట్టిగా నమ్మారు. అదే చంద్రబాబును చూడండి చెప్పింది చేస్తే ఏమవుతానో అనే భయంతో చేయకుండా ఉంటారు. సాక్షి: సమీప రాజకీయాలెలా ఉండబోతున్నాయి? విజయ్‌చందర్: యువతదే రానున్న రాజ్యం. దేశమంతటా యువ శక్తి అధికారాన్ని కైవసం చేసుకుని దేశాన్ని నడిపిస్తుంది. అదే కోవలో వైఎస్ జగన్మోహనరెడ్డి తప్పకుండా రాష్ట్రాధినేత అవుతారు. చాలామంది నమ్మరు. నేను క్రీస్తుతో, బాబాతో మాట్లాడే అను భూతి పొందుతుంటాను. వారు చెప్పినట్టే నా జీవితం నడుస్తోంది. జగన్ బాబు గురించి కూడా వారి అభిప్రా యం అదే. కుళ్లు, కుట్రలు ఛేదించుకుని ప్రజల్లో ఉన్న నాయకున్ని వెనక్కు నెట్టేయడం ఎవరి తరం కాదు. -
వైఎస్ జగన్ లాంటి నాయకుడు ఏపీకి అవసరం
-
టాలీవుడ్ పెద్దలు వివరణ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మద్దతు తెలిపినట్లు వచ్చిన వార్తలపై టాలీవుడ్ పెద్దలు వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, సినీనటుడు విజయచందర్ డిమాండ్ చేశారు. ఇటీవల సినీరంగ ప్రముఖులు సి.అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ, జెమినీ కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు అమరావతిలో చంద్రబాబును కలసి ప్రత్యేక హోదా విషయంలో సినీ పరిశ్రమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎంకు తెలిపినట్లుగా వార్తలొచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో విజయచందర్ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నిర్మాతల సమావేశంలో తాను ఇదే విషయాన్ని కేఎల్ నారాయణ దృష్టికి తెచ్చి అందరి తరఫున ఎలా హామీ ఇస్తారని ప్రశ్నించానన్నారు. తాను వ్యక్తిగతంగా బాబుకు మద్దతు తెలిపానే తప్ప మొత్తం పరిశ్రమ తరఫున కాదన్నారన్నారు. మిగతా నలుగురు తమ వివరణలు ఇచ్చి తీరాలన్నారు. -
‘వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు’
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 12న గుంటూరు జిల్లాలో అడుగుపెట్టనుందని, ఆయనను అందరూ ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు విజయచందర్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది తెలుగువారు కృషి చేశారని, రాష్ట్రాన్ని విడగొట్టి జాతిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. స్వాతంత్ర్యాన్ని సాధించి మన పూర్వీకులు మనకు ఎంతో ఇచ్చారని, కానీ మనం రేపు మన పిల్లలకు ఏం ఇవ్వగలమని ఆయన ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా తమ కష్టాల్ని చెప్పుకుంటున్నారని, వారి కష్టాల్ని చూస్తుంటే బాధగా ఉందన్నారు. జగన్ అన్ని విషయాల్లో దూసుకుపోతున్నారని, ప్రత్యేక హోదా కోసం అన్ని విధాలా కృషిచేస్తామని విజయచందర్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం బూటకపు రాజీనామాలు కాకుండా, నిజాయితీగా రాజీనామాలు చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. -
సాయి ఆశీర్వాదం
సీనియర్ నటులు విజయ్ చందర్‌కు పేరు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘సాయిబాబా మహత్యం’ ఒకటి. అందులో బాబాగా ఆయన నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. మరోసారి బాబా పాత్రలో నటిస్తూ, విజయ్ చందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ‘సాయి నీ లీలలు’ సినిమా గురువారం ప్రారంభ మైంది. ‘‘బాబా ఆశీర్వాదం వల్లే మళ్లీ ఆయన పాత్రలో నటించే అదృష్టం దక్కింది’’ అన్నారు విజయ్ చందర్. ‘‘ఈ సినిమాతో విజయ్చందర్గారు నన్ను సంగీత దర్శకుణ్ణి చేశారు. స్వరాలతో పాటు సాహిత్యం సమకూర్చే అవకాశం దక్కడం నా అదృష్టం’’ అన్నారు అనంత శ్రీరామ్. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆదిశేష గిరిరావు, మాటల రచయిత తోటపల్లి మధు పాల్గొన్నారు. -
ఉత్తర చెన్నై నేపథ్యంగా స్కెచ్
ఉత్తర చెన్నై మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా స్కెచ్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు విజయ్‌చందర్ అంటున్నారు. వీ క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో మూవింగ్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం స్కెచ్. సియాన్ విక్రమ్, మిల్కీబ్యూటీ తమన్నా తొలిసారిగా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సూరి, ఆర్కే.సురేశ్, అరుళ్దాస్, మలయాళ నటుడు హరీశ్, శ్రీమాన్, రవికిషన్,విశ్వంత్, మాలి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో ప్రియాంక్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్ఎస్.థమన్ సంగీతాన్ని, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను విజయ్‌చందర్ నిర్వహిస్తున్నారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందిస్తున్న కథా చిత్రం అని తెలిపారు. ఉత్తర చెన్నై అనగానే ఇప్పటి వరకూ చదవులేని వారు, ఆర్థికంగా ఎదగని వారి గురించే చిత్రాల్లో చూపించారన్నారు. అయితే అక్కడ విద్యాధికులు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారని చెప్పే స్టైలిష్ చిత్రంగా స్కెచ్ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. చిత్రంలో భారీ పోరాట దృశ్యాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే చెన్నైలో బ్రహ్మాండమైన సెట్ వేసి 30 రోజులకు పైగా చిత్రంలోని పలు ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం నటుడు విక్రమ్ కణవే కణవే..పుదుకణవే అనే పాటను పాడడం విశేషంగా పేర్కొన్నారు. -
సాయిబాబా మహిమలతో...
షిర్డీ సాయి మహిమలను తెలిపే కథతో శ్రీ మల్లాది వెంకటేశ్వరా ఫిలింస్ సంస్థ నిర్మించిన చిత్రం ‘సాయే దైవం’. 28 ఏళ్ల క్రితం ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’లో సాయిబాబాగా నటించిన విజయ్ చందర్ మరోసారి ఆ పాత్రలో నటించిన చిత్రం ఇది. చిత్రదర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘కొందరు భక్తులు వివరించిన సాయి మహిమలనే కథగా మార్చి ఈ సినిమా చేశాం. అద్భుతమైన ఆ మిహ మలు ప్రేక్షకులను పులకరింపజేస్తాయి. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మళ్లీ సాయి బాబా పాత్రలో నటించడం నా అదృష్టం’’ అని విజయ్‌చందర్ అన్నారు. -
మరోసారి బాబాగా...
సీనియర్ నటులు విజయ్‌చందర్ మరోసారి సాయిబాబా పాత్రలో నటిస్తున్నారు. ఆయన తొలిసారి బాబాగా నటించిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ విడుదలై ముప్పై ఏళ్లు అవుతోంది. సుదీర్ఘ విరామం తరువాత విజయ్‌చందర్ మళ్లీ బాబాగా నటిస్తున్న చిత్రం ‘సాయే దైవం’. స్వీయ దర్శకత్వంలో జి.యల్.బి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం పతాక సన్నివేశాలు హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. దర్శక-నిర్మాత మాట్లాడుతూ -‘‘బాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఏప్రిల్‌లో పాటలు, మేలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: భవాని అర్జున్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి.ఎస్. రామకృష్ణ. -
‘సత్యం వైపు మార్గం’ స్టిల్స్
-
మళ్లీ జీసెస్‌గా విజయ్ చందర్
‘కరుణామయుడు’తో వెండితెర జీసెస్ అనిపించుకున్న విజయ్ చందర్ చాలా విరామం తర్వాత జీసస్‌గా నటించిన చిత్రం ‘సత్యం వైపు మార్గం’. నాగబాబు, సూర్య, రూపారెడ్డి, సంధ్యాజనక్, శివ, జయశ్రీనాయుడు, ముఖేశ్, ప్రియాంక అగస్టయిన్, చంద్రశేఖర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. రూపారెడ్డి బసవ నిర్మాత. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ- ‘‘చక్కని స్క్రిప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. విజయచందర్ జీసెస్‌గా నటించిన ఈ చిత్రం యువతరానికి మంచి సందేశం. జీవన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. దైవాన్ని నమ్మని అమ్మాయికీ, జీసెస్‌కి మధ్య జరిగే కథ ఇదని దర్శకుడు చెప్పారు. చాలా విరామం తర్వాత జీసెస్‌గా నటించడం ఆనందంగా ఉందని విజయచందర్ అన్నారు. -
YSRCP రాష్ట్ర ప్రచార కమిటి కో ఆర్డినేటర్,విజయ్ చందర్‌తో సాక్షి వేదిక