నేరుగా వచ్చి ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, గుంటూరు:‘గుంటూరు నుంచి 12.05 గంటల ప్రాంతంలో తెనాలి స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి అప్పటి వరకూ ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ పక్కన నిలబడిన యువతి ఒక్కసారిగా ట్రాక్ పైకి వచ్చేసింది. ఆమెను తప్పుకోమని అరుస్తూ ఎమర్జెన్సీ బ్రేక్ వేశా. అయితే అప్పటికే రైలు ఇంజన్ ఆమెకు తగిలింది. స్పృహ తప్పి పడిపోయిన ఆమెను ప్రయాణికుల సహకారంతో ట్రైన్ ఎక్కించుకుని తెనాలి స్టేషన్లో స్టేషన్ మాస్టర్‌కు అప్పగించా’నని జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ విజయ్‌రామ్ జీఆర్పీ పోలీసులకు అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ మాస్టర్ దగ్గర ఉన్న పుస్తకంలో కూడా ప్రమాదానికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు.
సోషల్ మీడియా ట్రోలింగ్‌లకు గీతాంజలి ఈ నెల ఏడున రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేయడం ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలుగుదేశం సోషల్ మీడియాలోనూ, అఫిషియల్ మీడియాలో కూడా ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేలా కామెంట్స్ పెడుతున్నారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకు తోసేసి పరారు అయ్యారంటూ ఒక వీడియోలో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా చూపిస్తూ మార్ఫింగ్ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిని ఎడిట్ చేసి బయటకు వదిలినట్లుగా పోలీసుల విచారణలో స్పష్టం అయ్యింది.
ఈ వీడియోను సర్క్యులేట్ చేసింది ఎవరు? అనేదానిపై కూడా విచారణ జరుపుతున్నారు. చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేవిధంగానే తెలుగుదేశం సోషల్‌మీడియాలో బురదజల్లుతోంది. లోకోపైలెట్ ఇచ్చిన స్టేట్మెంట్తో అసలు ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం లేదని, ఆమె ఒక్కతే వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్పష్టం అవుతోది. అయినా తెలుగుదేశం చేస్తున్న తప్పుడు ఆరోç³ణల నేపథ్యంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తెనాలి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసుబృందం బుధవారం సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ చుట్టుపక్కల వారిని విచారించింది.
దగ్గరలో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఆరా తీసింది. సోషల్‌మీడియా ట్రోలింగ్‌ల నేపథ్యంలో మృతి చెందినట్లు ఆమెకుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో ట్రోలింగ్‌కు పాల్పడిన హ్యాండిల్స్‌ను గుర్తించి బాధ్యులను అదుపులోకి తీసుకునే దిశగా పోలీసు బృందాలు తమ విచారణ వేగవంతం చేశాయి. ఒక బీసీ మహిళను వేధించి ఆత్మహత్యకు పురికొల్పడమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా ట్రోల్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీలోనే కొందరు తప్పు పడుతున్నారు.
నాడు రిషితేశ్వరిని ఇలాగే పొట్టన పెట్టుకున్నారు
నాడు రిషితేశ్వరి నుంచి నేటి గీతాంజలి వరకూ పచ్చమూకల వికృత చర్యలకు బలైపోయిన వారే. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఎవరిని తీసుకున్నా వారికి ముందు నుంచి మహిళలంటే చిన్నచూపే. 2015లో గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ర్యాగింగ్‌కు గురై యూనివర్సిటీ వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన యూనివర్సిటీ అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మౌనం వహించింది.
విద్యార్థిని మృతికి కారణమైన అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. బాబురావుతోపాటు అప్పుడు యూనివర్సిటీ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలని, రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బలహీన వర్గాల విద్యార్థినికి న్యాయం చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వప్రయత్నించకపోగా న్యాయం కోసం ఉద్యమిస్తున్న వారిని అడ్డుకుంది. రిషితేశ్వరి మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్యమం చేస్తున్నాయనే కారణంతో ప్రభుత్వం, యూనివర్సిటీ ఉన్నతాధికారులు యూనివర్సిటీ విద్యార్థి సంఘాలను నిషేధించారు.
యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాల బోర్డులను సైతం తొలగించారు. ఉద్యమాన్ని అణిచేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. విద్యార్థిని ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను రక్షించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అప్పట్లో ప్రజాసంఘాలు బహిరంగంగానే ఆరోపణలు చేశాయి. విచారణ కమిటీల పేరుతో కాలయాపన చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్యపై కథనాలు రాస్తున్నారనే అక్కసుతో కొందరు మీడియా ప్రతినిథులపై కేసులు నమోదు చేస్తామని కూడా బెదిరించారు.
రాష్ట్రంలో బలహీన వర్గాల మహిళల ప్రాణాలకు రక్షణ లేదని రిషితేశ్వరి మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం వీడాలని అప్పట్లో ఎమ్మెల్యే ఆర్కే రోజాతోపాటు పలువురు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఆప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. బాబురావుపై చర్యలు తీసుకుందే తప్ప చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బుద్ధి మార్చుకోలేదు.