Vijayawada Central Assembly Constituency
-
ఏసీబీ కోర్టులో నేడు స్కిల్ కేసు విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది. అప్రూవర్‌గా మారిన ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. షా పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్కిల్ స్కామ్ లో ఏ-2 ముద్దాయి మాజీ లక్ష్మీ నారాయణ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లక్ష్మీనారాయణ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అప్రూవర్‌గా మారతానని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. కౌంటర్ పేరుతో చంద్రబాబు న్యాయవాదులు పలుమార్లు సమయం కోరారు. కేసులో కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ చంద్రబాబు తరపున న్యాయవాదులు ఇవ్వాలని కోరారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపున న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై ఈ నెల 22న ఏసీబీ కోర్టులో విచారణ జరిపగా, కౌంటర్ వేయడానికి సమయమివ్వాలని చంద్రబాబు న్యాయవాదులు కోరారు. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల కుట్రలకు పాల్పడుతున్నారు. -
లోకేష్ ‘రెడ్ బుక్’ బెదిరింపులు.. నేడు ఏసీబీ కోర్టులో విచారణ
సాక్షి, విజయవాడ: నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్లతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్.. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని, రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయస్ధానానికి దురుద్దేశాలు ఆపాదించారు. రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగాన్ని బెదిరిస్తూ భయోత్పాతానికి గురి చేశారు. వీడియోలతో సహా ఏసీబీ కోర్టులో గత నెలలో సీఐడీ పిటిషన్ వేసింది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో నోటీసులు పంపినా లోకేష్ అందుకోలేదు. చివరగా ఏసీబీ కోర్టు నుంచే లోకేష్‌కి నోటీసులు అందాయి. స్వయంగా హాజరు లేదా న్యాయవాది ద్వారా విచారణకి రావాలని గత వారం కోర్టు ఆదేశించింది. ఈ నెల 22న జరిగిన విచారణలో లోకేష్ న్యాయవాదులు రెండు వారాల సమయం కోరారు. ఒక వారమే సమయమిచ్చిన న్యాయస్ధానం.. నేడు విచారణ జరపనుంది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు యువగళం ముగింపు సమయంలో లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించిందని, రిమాండ్ విధించడం తప్పంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థను కించపరిచేలా ఉన్నాయని.. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల్ని తప్పుబట్టేలా ఉన్నాయని.. అన్నింటికి మించి కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మెమోలో సీఐడీ పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్.. తదితర కేసులలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారు. అయితే.. ఆ సమయంలో తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను నారా లోకేష్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు అధికారులు 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారు? వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశా. మా ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తా’ అంటూ లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది సాక్ష్యులను బెదిరించి.. కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించడమే అవుతుందని సీఐడీ ఏసీబీ కోర్టు పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. గతంలో లోకేష్‌కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకీ విరుద్ధంగా ఆయన మాట్లాడారని పేర్కొంది. రెడ్ బుక్ బెదిరింపుల వ్యవహారంలో కేసులో.. నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులను లోకేష్ తొలుత స్వీకరించలేదు. ఈ పరిణామంలో లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ పోస్టులో పంపాలని సీఐడీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
ఒక్క హగ్‌తో యెల్లో బ్యాచ్‌కి చెక్
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు తప్పవని.. అలాంటప్పుడు అలకలు సహజమని.. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ముందు నుంచే చెబుతున్నాయి. అయితే యెల్లో మీడియా మాత్రం ఈ అలకల్ని భూతద్ధంలో పెట్టి చూపించే యత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ్టి విజయవాడ సెంట్రల్ పరిణామాలు.. ఆ బ్యాచ్ నోళ్లు మూయించాయి. వైఎస్సార్సీపీ నుంచి తొలి గెలుపు విజయవాడ సెంట్రల్‌దే కావాలని.. వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం పిలుపు ఇచ్చారు. అంతేకాదు విజయవాడలో పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే టీడీపీ అనుకూల మీడియా చానెల్స్, పత్రికలు చాలారోజుల నుంచి వీళ్ల మధ్య ఏదో వైరం నడుస్తున్నట్లు చూపించే యత్నం చేసింది. ఒక అడుగు ముందుకేసి ఆయన పార్టీని కూడా వీడుతారంటూ ఊహాజనిత కథనాలు రాశాయి. అయితే ఆ రోతరాతలకు ఒక్క హగ్‌తో చెక్ పెట్టారు ఈ ఇద్దరూ. విజయవాడ సెంట్రల్ సింగ్ నగర్ లో వైఎస్సార్సీపీ ఇంఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి ఆఫీస్‌కు ర్యాలీ తన ఆఫీస్ నుంచి మల్లాది వచ్చారు. ఈ సందర్భంగా మల్లాదికి వెల్లంపల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. సమిష్టిగా పని చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాతామని ఈ సందర్భంగా ఈ ఇద్దరు ప్రకటించారు. -
చంద్రబాబుకి ఆ గేటు తెరిచే ఉద్దేశం లేదేమో!
సాక్షి, విజయవాడ: ‘‘గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్సార్సీపీ నేతలంతా టీడీపీలోకి వస్తారని గతంలో చంద్రబాబు అన్నారు.. మరి ఇప్పటివరకు ఎందుకు ఆ గేట్లు తెరవలేదు.. బహుశా చంద్రబాబుకి ఆ గేట్లు తెరిచే ఉద్దేశం లేదేమో!’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సెటైర్లు వేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నియోజకవర్గం మారాలంటే కొంత బాధగానే ఉంది. కానీ.. పార్టీ నిర్ణయం కోసం కట్టుబడి ఉంటా. సీఎం జగన్ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం’’ అని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ‘‘సామాజిక సమీకరణాల్లో భాగంగానే మార్పులు. వెస్ట్ నుంచి మైనారిటీ అభ్యర్థిని పెట్టాలని పార్టీ నిర్ణయించింది. వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అని వేర్వేరుగా లేవు.. అంతా వైఎస్సార్సీపీ వర్గమే. ఏ పార్టీలో చేరాలన్నది షర్మిల ఇష్టం. ఆమె ఏం మాట్లాడతారో చూడాలి’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్