ట్యాపింగ్ వ్యవహారంలో తదుపరి చర్యలన్నీ నిలిపివేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో కాల్‌డేటా వివరాలు ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్‌టెల్‌లను ఆదేశిస్తూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్(సీఎంఎం) కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో సీఎంఎం కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలను నిలిపేసింది. ఆ మూడు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కాల్‌డేటా తాలూకూ వివరాల సీల్డ్ కవర్లను అందుకున్న వెంటనే హైకోర్టుకు పంపాలని సీఎంఎం కోర్టును ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ట్యాపింగ్ వ్యవహారంలో కాల్ డేటా వివరాలు ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్‌టెల్‌ను ఆదేశిస్తూ విజయవాడ సీఎంఎం కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా గురువారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి.. ఇదే విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులే ఈ వ్యాజ్యానికి వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యాన్ని కూడా గతంలో దాఖలైన పిటిషన్లతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.