Vijayawada Police Commissionerate
-
పవన్ కల్యాణ్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
సాక్షి, కృష్ణా: వాలంటీర్లనుద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రం భగ్గుమంటోంది. ఇప్పటికే పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా.. డీజీపీకి సైతం ఫిర్యాదు వెళ్లింది. ఇక ఇప్పుడు వైస్సార్సీపీ లీగల్ సెల్ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బుధవారం పలువురు వాలంటీర్లతో కలిసి వైఎస్సార్సీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు విజయవాడ సీపీలో పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ను పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. సాక్షితో న్యాయవాదులు.. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కరోనాలో మరింత ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతోంది. పవన్ కల్యాణ్ మాటలతో సభ్యసమాజంలో అలజడి రేగుతోంది. కానీ, ఆ మాటల్ని వాలంటీర్లు పట్టించుకోవద్దు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అసలు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి పవన్ కల్యాణ్‌కు ఏ నిఘా సంస్థ చెప్పిందో వెల్లడించాలి. వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది. ఇదీ చదవండి: పవన్‌ను చీల్చిచెండాడిన పోసాని -
కనకదుర్గ ఫ్లైవోవర్‌పై భారీ వాహనాల నిషేధం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కనకదుర్గ ఫ్లైవోవర్‌పై పగటి వేళల్లో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే.. చిన్నకార్లు, ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సిలెండర్ల వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. అక్టోబర్ 16న కనకదుర్గ ఫ్లైవోవర్ ప్రారంభమైన విషయం విదితమే. ప్రైవేటు బస్సులు స్వాతి సెంటర్ మీదుగా కొండ తిరిగి రావాల్సిందేనని, రాత్రి 11 గంటల తరువాత లారీలు భారీ వాహనాలను అనుమతిస్తామని అధికారులు వివరించారు. -
నీతో ఎందుకు కనెక్ట్ అయ్యానో తెలియదు!
‘హలో.. మీ ఇంటికి రావచ్చా? ప్రాబ్లం ఏమిటో చెప్పండి.. మళ్లీ ఫోన్ చేయనుగా.. ఒక్క అరగంట.. మీరు మనస్ఫూర్తిగా చెబితే వస్తా.. నాకు 2005లో పెళ్లి అయిన తర్వాత నేను ఎవరి దగ్గరకు రాలే.. నీతో ఎందుకు కనెక్ట్ అయ్యానో నాకు తెలియదు. అలా జరిగిపోయింది. ఇన్ని సార్లు అడుగుతున్నా.. బతిమాలుతున్నా.. ఏమంటారు.. హలో రావచ్చా...’ ఒక కాల్‌మనీ ఆగంతకుడు ఓ మహిళను తన లైంగిక కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేస్తూ ఇటీవల ఫోన్లో సంభాషించిన తీరు ఇది.. విజయవాడ నగరవాసులను కాటేస్తున్న ‘కాల్ నాగుల’ దందాలపై నాలుగేళ్ల క్రితమే ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చినా.. అప్పటి ప్రభుత్వం, పోలీసు అధికారులు నిర్లిప్తత కారణంగా నేటికీ వారు రెచ్చిపోతూనే ఉన్నారు. అప్పుడు కేవలం కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై దృష్టి పెట్టిన పోలీసులు.. కలుగులో దాక్కున్న చాలా ఎలుకలను వదిలేయడంతో ఇప్పుడా కాలాంతకులు మళ్లీ మహిళలను చెరపట్టే స్థాయికి చేరుకున్నారు. సాక్షి, అమరావతి : కాల్‌మనీ రాకెట్ పుట్ట పగులుతోంది. విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో మొరపెట్టుకుంటున్న బాధితుల వ్యథలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో అనేక మంది కమిషనరేట్ తలుపు తడుతున్నారు. గత రెండు నెల రోజుల్లో పోలీసు కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో కాల్‌మనీ కేసులు వెలుగు చూస్తున్నాయి. అప్పు ఇచ్చిన సొమ్ముకు అధిక వడ్డీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండటం.. తమ కోరికలు తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో బాధితులు వెలుగులోకి వస్తున్నారు. పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని వేడుకుంటున్నారు. నగరంలో ఇలాంటి కేసులు నిత్యం వందలాదిగా బయటపడుతుంటే అతి కొద్ది కేసులు మాత్రమే పోలీసుల వరకు వస్తున్నాయి. పేదలను పీల్చేస్తున్న పిశాచాలు.. కానూరుకు చెందిన ఓ మహిళ కుటుంబ అవసరాల నిమిత్తం స్థానికుడైన వంగర సుబ్రహ్మణ్యం వద్ద రూ.10.లక్షల అప్పు తీసుకుంది. ఆమెపైనే కన్నేసిన సుబ్రహ్మణ్యం.. ఇచ్చిన అప్పునకు బదులుగా కోరిక తీర్చమని ఒత్తిడి చేశాడు. కొడుకును కనిస్తేనే ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బంగారం తిరిగిస్తానని బెదిరించాడు. ఇది తట్టుకోలేక ఆమె పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. చివరకు సుబ్రహ్మణ్యంపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బాడవపేటకు చెందిన వెంకటరమణ అనే మహిళ కూడా తన కుటుంబ అవసరాల కోసం రెబ్బా శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద రూ.3ల వడ్డీకి రూ.50వేలు అప్పు తీసుకుంది. 5 నెలల తర్వాత అసలు, వడ్డీ చెల్లించినా సదరు మహిళ ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, చెక్కు ఇవ్వలేదు. అదేమంటే అసలు వడ్డీనే చెల్లించలేదని, రూ.15ల వడ్డీకి అప్పు ఇచ్చానని బెదిరించాడు. ఇంట్లో ఉన్న టీవీని సైతం తీసుకుపోయాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. రామవరప్పాడుకు చెందిన వడ్డీ వ్యాపారి బొప్పన చంద్రశేఖర్ తన వద్ద అప్పు తీసుకున్న చాగంటి ప్రసాద్‌కు చెందిన భవనంపై కన్నేశాడు. చాగంటి ప్రసాద్ తీసుకున్న అప్పునకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించేశాడు. అయితే ఇంకా చెల్లించాలని చెప్పి రామవరప్పాడులో ఉన్న ఇతని భవనాన్ని తన పేరున రాయించుకునేందుకు చంద్రశేఖరరావు పావులు కదుపుతున్నాడని ప్రసాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులను ఒత్తిడికి గురిచేస్తున్న పోలీసులు..! కాల్‌మనీ వ్యాపారుల వల్ల ఇబ్బందులు పడిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే.. భరోసా ఇవ్వాల్సింది పోయి వడ్డీ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు వారాల క్రితం వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ మహిళ జంగా రవి అనే వడ్డీ వ్యాపారి ‘తన కోరిక తీర్చాలని.. ఇంటికి రావచ్చా..’ అంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఈ నెల 16వ తేదీన ‘స్పందన’ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ ఎదుట ఫిర్యాదు చేసింది. ఈ కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ అప్పగించారు. విచారించిన పోలీసులు 2వ పట్టణ పోలీసులకు కేసు కట్టమని ఆదేశించారు. 22వ తేదీన 2వ పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ 345(ఏ), 506 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు కట్టారు. మరుసటి రోజు బాధితురాలిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి నుంచి రోజూ ఎస్ఐ ఆమెకు ఫోన్ చేసి నిందితుడి వివరాలు అడగడం.. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పడం పరిపాటిగా మారింది. చివరకు నిందితుడు కోర్టులో లొంగిపోయి ఈనెల 26న బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. అయినా ఎస్ఐ బాధితురాలితో నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని బుకాయిస్తున్నారు. బెయిల్ పొందిన తరువాత కోర్టు నుంచి సమాచారం వస్తుంది. దానిని కూడా దాచిపెట్టి బాధితురాలిని పోలీసులు మభ్యపెట్టడం గమనార్హం. -
బెజవాడ ట్రాఫిక్‌కు విముక్తి!
బెజవాడ నగరంలో పద్మవ్యూహంలా మారిన ట్రాఫిక్‌కు విముక్తి లభించబోతోంది. ఇరుకు రోడ్లు, వెల్లువెత్తుతున్న వాహనాల రద్దీతో విజయవాడ ట్రాఫిక్ రోజురోజుకూ నరకంలా మారింది. ప్రధానమైన జంక్షన్లలో నిత్యం ట్రాఫిక్‌తో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని ఛేదించడానికి నగర పోలీసులు నిత్యం నానా తంటాలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పోలీసు అధికారులు సాంకేతిక సాయం తీసుకోబోతున్నారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) ప్రాజెక్ట్ ద్వారా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేయబోతున్నారు. సాక్షి, అమరావతి : విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాత సిగ్నలింగ్ వ్యవస్థ బదులు ప్రయోగాత్మకంగా 17 కూడళ్లలో ఏటీసీఎస్ (అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్) ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో దాదాపు 180 కూడళ్లు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తొలి దశలో ప్రకాశం బ్యారేజీ నుంచి బెంజి సర్కిల్ వరకు వారధి నుంచి ఎయిర్‌పోర్టు వరకు వినాయక టెంపుల్, గద్ద బొమ్మ, ప్రకాశం విగ్రహం, ఓల్డ్ బస్టాండ్, బందర్ లాకులు, గోల్డెన్ పెవిలియన్, రాఘవయ్య పార్క్, రాజ్‌భవన్, స్టేట్ గెస్ట్ హౌస్, డీసీపీ బంగ్లా, ఆర్టీఏ సర్కిల్‌తోపాటు బాలాజీ నగర్, స్క్రూ బ్రిడ్జి, బెంజి సర్కిల్, రామవరప్పాడు రింగ్ రోడ్, న్యూ ఆటోనగర్ కూడళ్లను ఏటీసీఎస్‌కు అనుసంధానం చేస్తారు. ఆయా కూడళ్లలో వాహన చోదకులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు తక్కువ సమయంలో నలువైపులా వాహనాలు వేగంగా వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు. సమీకృత ఇంటెలిజెంట్ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా అన్ని సిగ్నళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారు. ఇవి కేంద్రీకృత నియంత్రిత విధానం ద్వారా పని చేస్తాయి. వీటికి ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి వాహనాలను లెక్కించి, వాటిని వర్గీకరించి సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి పంపిస్తాయి. వాహనాల రద్దీని బట్టి సిగ్నల్ పడుతుంది. ఎక్కువ వాహనాలు ఉండే మార్గంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి అధిక సమయం ఆకుపచ్చ లైట్ వస్తుంది. సిగ్నలింగ్ వ్యవస్థ అంతా సౌరశక్తితో పని చేస్తుంది. ఇక నిరీక్షణ ఉండదు!.. పోలీస్ కంట్రోల్ రూం నుంచి బెంజి సర్కిల్ వరకు దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. పాత పద్ధతిలో సిగ్నల్స్ ఒకదానితో మరొకటి సంబంధం లేదు. దీనివల్ల ఈ కొద్ది దూరానికే ఒక్కొక్క సిగ్నల్ వద్ద చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోంది. కొత్త వ్యవస్థ వస్తే ఎక్కడా ఆగాల్సిన పని లేదు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక ట్యాగ్లు బిగిస్తారు. ఈ వాహనాలు వచ్చే సమయంలో ఆ మార్గంలో అకుపచ్చ లైట్లు వెలుగుతాయి. సిగ్నళ్ల స్తంభాలకు బిగించిన కెమెరాలు వాహనాల నెంబరు ప్లేట్లను గుర్తిస్తాయి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే నేరుగా చలానా జారీ అవుతుంది. వీటికి సెన్సార్లు ఉంటాయి. అలాగే ముఖ్యమైన కూడళ్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉంటుంది. ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. వీటిపై ట్రాఫిక్ నిబంధనలు, ముఖ్యమైన సూచనలు, వాతావరణం, తదితర వివరాలు వస్తుంటాయి. అత్యవసర వాహనాలకు గ్రీన్ సిగ్నల్.. ఈవీపీ (ఎమర్జెన్సీ వెహికల్ ప్రయార్టీ) : ఇప్పటి వరకు అత్యవసర సమయాలు, అంబులెన్స్‌లు వెళ్లేటప్పుడు, వీవీఐపీల రాకపోకల సమయంలో మాన్యువల్ విధానాన్ని ట్రాఫిక్ పోలీసులు పాటించేవారు. ఆయా వాహనాల రాకపోకల సమయాల సమాచారం తెలియగానే... ట్రాఫిక్ కానిస్టేబుల్ టైమర్లను నిలిపిసేవారు. ఆ తర్వాత మాన్యువల్ పద్ధతిలో రాకపోకలను నియంత్రించేవారు. ఈవీపీ పద్ధతిలో ఇకపై మాన్యువల్ విధానం అవసరం ఉండబోదు. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్స్ వస్తున్న సమయంలో ఆ మార్గంలో ఆకుపచ్చ లైట్లు వెలుగుతాయి. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యకు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమే సరైన పరిష్కారం. ఈ ప్రాజెక్టు పూ ర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్రజలకు ఎం తో మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు సా కారం కావడానికి చాలా కష్టపడ్డాం. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఏటీసీ ఎస్ సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేస్తాం. – సీహెచ్ ద్వారకా తిరుమలరావు, పోలీసు కమిషనరు, విజయవాడ -
నిర్లక్ష్య‘భటులు’..!
సాక్షి, అమరావతి బ్యూరో : కొద్ది రోజుల కిందట విజయవాడ, కుమ్మరి వీధిలోని ఓ ఇంట్లో 120 కాసులకు పైగా బంగారాన్ని దొంగలు కాజేశారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా శనివారం రాత్రి ఇస్లాంపేటలోని ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో ముగ్గురు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. రాత్రి 10 గంటల సమయంలోనే నిత్యం రద్దీగా ఉండే పంజా సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం కలిగించింది. ఈ రెండు ఘటనలు విజయవాడ కమిషనరేట్‌లోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనివే కావడం గమనార్హం. నిఘా వైఫల్యం.. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమన్న ఆరోపణలు వస్తుండగా.. ఈ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డే లేదన్న వాదనా బలంగా వినిపిస్తోంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపేట పోలీస్ స్టేషన్లో సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున అక్రమంగా గుట్కా, కోడి పందెలు, క్రికెట్ బెట్టింగ్‌లు, పేకాట శిబిరాలను నిర్వహిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నా పోలీసులు దాడులు చేసిన సందర్భాలు కనిపించవు. కేవలం టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి చేసి ఆ స్టేషన్లో అప్పగిస్తేనే కేసులు నమోదు చేసే పరిస్థితి. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో వరుస దొంగతనాలు చేస్తూ దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యహరిస్తున్న అక్కడి సిబ్బంది, అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. కొరవడిన నిఘా.. కొత్తపేట స్టేషన్ పరిధిలో ఓ సీఐతో పాటు నలుగురు ఎస్ఐలు బా«ధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు సీనియర్ కాగా మిగిలిన ముగ్గురు ఎస్ఐలు కొత్తగా వచ్చిన వారు. దీంతో కొత్త వారందరూ స్టేషన్‌లోని కేసుల విచారణకే పరిమితం అవుతున్నారు. వాస్తవానికి ఎస్‌ఐలందరికీ స్టేషన్‌ని ప్రాంతాల వారీగా విభజించి పరిధులు కేటాయించారు. కేసుల విరాచణతో పాటు ఎస్ఐలు వారికి కేటాయించిన పరిధిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలి. కానీ ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితి లేని వైనం. మరో వైపున స్టేషన్ పరిధిలో ఆకతాయిలు, మద్యం బాబుల గోడవలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. అసలు నిందితులను వదిలేసి ఫిర్యాదీదారులని వేధింపులకు గురిచేస్తున్న సందర్భాలున్నాయి. దాడులన్నీ టాస్క్‌ఫోర్స్ సిబ్బందివే.. స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన పేకాట, అక్రమ మద్యం విక్రయదారులపై జరిగిన దాడులన్ని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఖాతాలోకే చేరుతున్నాయి. వాస్తవానికి రెండేళ్ల కాలంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ నెయ్యి, కోడి పందెలు, పేకాట శిబిరాలు, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై స్టేషన్ అధికారులు సరైన నిఘా పెట్టకపోవడంతో వాళ్లు యథావిధిగా తమ కార్యకలపాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంతా తానైన ‘షాడో సీఐ’! కాగా, స్టేషన్లో షాడో సీఐగా పేరుగాంచిన ఓ ఎస్ఐ స్టేషన్ పరిధిలోని అక్రమార్కుల నుంచి ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు స్టేషన్లో ప్రచారం జరుగుతుంది. తనకు అడ్డుగా ఉన్నారనే కారణంగా కొంత మంది సిబ్బందిని తన పలుకుబడి ఉపయోగించి ఇతర స్టేషన్లకు బదిలీ చేయించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఐజీగా రమణకుమార్.. డీఐజీగా కాంతిరాణా
సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్ కమిషరేట్ పరిధిలోని ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జాయింట్ పోలీస్ కమిషనర్ బీవీ రమణకుమార్‌కు ఐజీ హోదా లభించింది. డీసీపీ కాంతిరాణా టాటాకు డీఐజీగా పదోన్నతి కల్పించింది. సూపర్‌టైమ్ స్కేల్ ఐపీఎస్ అధికారులుగా వారికి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఐజీ హోదాతో రమణకుమార్ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. ఆయన గతంలో నెల్లూరు ఎస్పీగా, సీఐడీ ఎస్పీగా, టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆయన్ను ఐజీ హోదా కల్పించింది. ఆయన త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. విజయవాడ డీసీపీ కాంతిరాణా టాటాకు డీఐజీగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కాంతిరాణా 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గతంలో వరంగల్, ఖమ్మంలో ఓఎస్డీగా, హైదరాబాద్‌లోని మాదాపూర్ డీసీపీగా చేశారు. అనంతరం కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. విజయవాడ పోలీస్ కమిషరేట్‌ను అదనపు డీజీ స్థాయికి పెంచిన ఎస్పీ స్థాయి అధికారులను డీసీపీలుగా కేటాయించారు. దీంతో కాంతిరాణా టాటా విజయవాడ డీసీపీగా నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం ప్రస్తుతం డీఐజీగా పదోన్నతి కల్పించింది. -
అయ్యో..! అతివ
రాజధాని నగరంలో మహిళల భద్రత ప్రశ్నార్థకమే విజయవాడలో హడలెత్తిస్తున్న మహిళలపై నేరాలు 2016లో అమాంతంగా పెరిగిన కేసుల సంఖ్య ‘శాంతిభద్రతలు... ప్రత్యేకించి మహిళల భద్రత విషయంలో అత్యంత కఠినంగా ఉంటాం. అమరావతి ప్రాంతాన్ని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ విజయవాడలో మహిళల భద్రత గాలిలో దీపంలా మారింది. మహిళలకు ఏమాత్రం రక్షణలేని, దాడులు పెరుగుతున్న నగరంగా విజయవాడ రూపాంతరం చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్న వాస్తవం. – సాక్షి, అమరావతిబ్యూరో సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. మహిళా హత్యలు, వరకట్న హత్యలు, వేధింపులు, ఆత్మహత్య చేసుకునేలా వేధింపులు, లైంగికదాడులు... ఇలా అన్ని రకాల కేసులు పెరుగుతున్నాయి. 2015 కంటే 2016లో నగర పరిధిలో మహిళలపై దాడులు, వేధింపుల కేసులు బాగా పెరిగాయి. 2015లో మొత్తం 464 కేసులు నమోదయ్యాయి. 2016లో ఏకంగా 760 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న వాస్తవం. అంటే నేరాలు 63 శాతం అధికమయ్యాయి. ► 2015లో ఒక్క వరకట్న హత్య కూడా లేదు. 2016లో ఐదు వరకట్న హత్యలు జరిగాయి. ► మహిళలపై వివిధ రకాల వేధింపుల కేసులు 2015లో 175 నమోదయ్యాయి. 2016లో ఏకంగా 411 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ► కమిషరేట్ పరిధిలో మహిళలపై లైంగిక దాడులు అమాంతం పెరుగుతున్నాయి. 2015లో నగరంలో లైంగికదాడులు కేసులు 53 నమోదయ్యాయి. 2016లో 70 నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. ► మహిళలను అపహరించిన కేసులు 2015లో 21 నమోదయ్యాయి. 2016లో 26 కేసులు నమోదు కావడం గమనార్హం. ► మహిళలపై దాడులకు పాల్పడి వారి గౌరవానికి భంగం కలిగిస్తున్న కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. 2015లో ఇలాంటి కేసులు 156 నమోదయ్యాయి. 2016లో 198 కేసులు నమోదు కావడం మహిళలపై పెరుగుతున్న దాడులకు నిదర్శనం. ► 2015లోనూ, 2016లోనూ నగర పరిధిలో వరకట్న వేధింపుల వల్ల ఆత్మహత్యలు 10 చొప్పున నమోదయ్యాయి. ► ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకు గురిచేసిన కేసులు కూడా 2015లో 25 ఉండగా, 2016లో 24 నమోదయ్యాయి. లైంగికదాడులను అరికట్టలేరా! మహిళలపై నేరాల్లో లైంగికదాడులు, వేధింపులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత నగరంలో లైంగికదాడు లు అధికం కావడం విస్మయకర వాస్తవం. ► 2012లో 47, 2013లో 40 లైంగిక దాడులు జరిగాయి. 2014 నుంచి పెరుగుతూ వస్తున్నాయి. 2014లో 61, 2015లో 53 కేసులు నమోదయ్యాయి. 2016లో ఏకంగా 70 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టో...! ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అధికార యంత్రాంగం అంతా విజయవాడలోనే కేంద్రీకృతమై ఉంది. కానీ రాజధానికి తగ్గట్లుగా రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయ లేదు. కేవలం వీఐపీల భద్రత, హంగు ఆర్భాటాలకే పోలీసు వ్యవస్థను వాడుకుంటు న్నారు. దాంతో సామాన్యులకు ప్రత్యేకించి మహిళల రక్షణపై దృష్టిసారించలేకపోతు న్నామని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం. సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిన తరువాత కూడా... మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించిన కేసులను ఏకపక్షంగా నమోదు చేయొద్దని 2014లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. మొదట ఇరువర్గాలతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి వచ్చిన ఫిర్యాదులను యథాతథంగా కేసులుగా నమోదు చేయడం లేదు. ఇరువర్గాలతో సంప్రదించి వీలైనంతవరకు రాజీ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య తగ్గుతుందని అంతా భావించారు. కానీ 2014 తరువాత విజయవాడలో మహిళలపై దాడులు, వేధింపుల కేసులు మాత్రం అమాంతంగా పెరుగుతూనే ఉన్నాయి. అంటే నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. -
లా అండ్ ఆర్డర్... విభజన షురూ
ఇద్దరు డీసీపీల నియామకం ఒక్కొక్కరికి మూడు జోన్ల కేటాయింపు కొత్త డీసీపీలు రెండు రోజుల్లో రాక విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో పని విభజన మొదలైంది. ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ముగ్గురు అధికారుల్ని ప్రభుత్వం కమిషనరేట్‌కు కేటాయించింది. ఈ క్రమంలో కమిషనరేట్ అప్‌గ్రేడ్ అయిన తర్వాత మొదటిసారిగా పోస్టులన్నీ భర్తీ చేశారు. లా ఆండ్ ఆర్డర్ విభాగానికి ఇద్దరు డీసీపీలను ప్రభుత్వం కేటాయించింది. ట్రాఫిక్‌కు మరో డీసీపీని నియమించింది. నూతనంగా కేటాయించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు మరో రెండు రోజుల్లో విధుల్లో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో కమిషనరేట్ ఉన్నతాధికారులు లా ఆండ్ ఆర్డర్ విభజన ప్రక్రియపై దృష్టి సారించి ప్రాథమికంగా పూర్తి చేశారు. ప్రస్తుతం విభాగాలు ఇలా... కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లతో కలిపి ఐదు పోలీస్ సబ్ డివిజన్లు, వీటి పరిధిలో 20 పోలీస్ స్టేషన్లు, ఇవి కాకుండా ట్రాఫిక్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, మహిళా పోలీస్ స్టేషన్ ఇలా అనేక విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ ఇప్పటి వరకు ఏసీపీ పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్, పరిపాలన విభాగానికి మాత్రమే డీసీపీలు ఉండేవారు. లా అండ్ ఆర్డర్ విభాగం గత రెండు నెలలుగా ఖాళీగా ఉంది. గతంలో లా అండ్ ఆర్డర్ డీసీపీగా ఉన్న కాళిదాసు రంగారావును విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించటంతో ఆ స్థానం భర్తీ కాకుండా ఉండటంతో పరిపాలన విభాగం డీసీపీ అశోక్ కుమార్ దానిని కూడా ఇప్పటి వరకు పర్యవేక్షించారు. కమిషనరేట్‌లో అదనపు డీజీ క్యాడర్లో ఉన్న కమిషనర్ పోస్టుతో పాటు ఐజీ క్యాడర్లో అదనపు కమిషనర్ పోస్టు, డీఐజీ క్యాడర్లో జాయింట్ కమిషనర్ పోస్టులతో పాటు నాలుగు డీసీపీ పోస్టులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ముగ్గురు డీసీపీలతో కలిపి అన్ని పోస్టులూ భర్తీ అయినట్టే. ఇక అదనపు కమిషనర్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. గతంలో ఈ పోస్టులో మహేష్ చంద్ర లడ్హా కొద్ది రోజులు పనిచేసి బదిలీపై వెళ్లిపోయారు. లా అండ్ ఆర్డర్‌కు ఇక ఇద్దరు డీసీపీలు... లా అండ్ ఆర్డర్‌కు ఇప్పటి వరకు ఒక్కరే డీసీపీగా కొనసాగుతూ వచ్చారు. దీనిని తాజాగా రెండుగా విభజించారు. కమిషనరేట్ పరిధిలో ఈస్ట్, వెస్ట్. సౌత్, నార్త్, సెంట్రల్ జోన్లతో పాటు, సీసీఎస్ (క్రైం) ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ డీసీపీ-1గా డాక్టర్ కొయ్య ప్రవీణ్‌ను, డీసీపీ-2గా జి.పాల్‌రాజును నియమించారు. డీసీపీ-1 పరిధిలోకి మూడు జోన్లు, డీసీపీ-2 పరిధిలోకి సీసీఎస్‌తో కలిపి మూడు జోన్లు కేటాయించనున్నారు. జోన్ల పరిధి, సరిహద్దును పరిగణనలోకి తీసుకొని వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు కమిషనరేట్ పరిధిలోని ప్రత్యేక టాస్క్లకూ డీసీపీలనే ఎక్కువగా వినియోగించనున్నారు. ట్రాఫిక్ విభాగాన్ని ఏడీసీపీ నాగరాజు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ విభాగానికి డీసీపీగా క్రాంతి రతన్ టాటాను నియమించారు. ట్రాఫిక్ స్టేషన్లు పరిమితంగా ఉండటం, ఒక్కరే డీసీపీ కావటంతో ఎలాంటి విభజన లేకుండా ఈ విభాగాన్ని రతన్ టాటాకు అప్పగించనున్నారు. -
కాపు నేతలపై నిఘా
ముద్రగడను అదుపులోకి తీసుకోవటంతో అప్రమత్తం విజయవాడ : కాపు నేతలపై పోలీసు శాఖ నిఘా పెరిగింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జిల్లాలో ఉన్న ముఖ్య నేతల కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కిర్లంపూడిలో ముద్రగడ అరెస్ట్, తుని ఘటనలో కొందరిని అరెస్ట్ చేయటంతో మళ్లీ కాపు ఉద్యమ అలజడి రేగింది. ఈ క్రమంలో ముద్రగడకు సంఘీభావంగా ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా అనే కోణంలో దృష్టి సారించిన పోలీసులు నేతల కదలికలను పరిశీలిస్తున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలో, వివిధ రాజకీయ పార్టీల్లో కీలక నేతలుగా ఉన్న కాపు నేతలు, వారి అనుచరగణంపైనా నిఘా ఉంచారు. విజయవాడ రాజధాని నగరం కావటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలోని పరిస్థితిపై పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అధికారులతో చర్చించారు. కాపు సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉన్న కృష్ణలంక, రాణిగారి తోట, భవానీపురం హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాలతో పాటు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల వద్ద పోలీసులు ఎక్కువగా దృష్టిసారించారు. మరోవైపు అధికార పార్టీలో ఉన్న కాపు నేతలు ప్రభుత్వ చర్యల్ని సమర్ధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారి కార్యాలయాల వద్ద ఇంటెలిజెన్స్ నిఘా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి నగరంలో పోలీసులు కీలక ప్రాంతాల్లో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తుని ఘటనలో జిల్లాకు చెందినవారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సీఐడీ కొంతకాలంగా దర్యాపు సాగిస్తోంది. -
పేరుకి పెద్దే.. సెటిల్మెంట్ల గద్దె
పశ్చిమలో పొలిటికల్ పోలీస్ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో విధులు రాజకీయ సిఫార్సులతోనే కేసుల నమోదు తోటి సీఐకే న్యాయం చేయలేని అధికారి ఒకరు ఇద్దరు నేతల ముద్దుల సీఐ మరొకరు గుట్కా మామూళ్ల కారణంగానే మరొక సీఐ బదిలీ విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల అవినీతి, విధినిర్వహణలో అలసత్వం పెరిగిపోయింది. అధికార పార్టీ కనుసన్నల్లో విధులు నిర్వహిస్తూ రాజకీయ సిఫార్సులు ఉంటేనే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రైవేటు సెటిల్మెంట్లు, భూ వివాదాలు, ఇసుక రాకెట్‌ను ఆదాయవనరులుగా మార్చుకుని జేబులు నింపుకొంటున్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఓ స్టేషన్ సీఐ టీడీపీకి చెందిన కార్పొరేటర్‌తో కలిసి యథేచ్ఛగా సెటిల్మెంట్లు చేయగా, మరో సీఐ తోటి సీఐ ఆస్తి ఆక్రమణకు గురైనా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరుగురు సీఐలను పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇటీవల సరెండర్ చేసిన నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని వెస్ట్, సెంట్రల్, ఈస్ట్ జోన్లలోని స్టేషన్ల బాగోతంపై నేటి నుంచి వరుస కథనాలు... విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అధిక ప్రాధాన్యం ఉన్న జోన్ వెస్ట్‌జోన్. రాష్ట్రంలోనే అతి పెద్ద రెండో దేవస్థానంగా పేరుగాంచిన కనకదుర్గమ్మ ఆలయం, దేశంలోనే ఖ్యాతి గాంచిన ఎన్టీటీపీఎస్, పెద్ద సంఖ్యలో ఆయల్ కార్పొరేషన్లు ఈ జోన్ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ సైబర్ నేరాలు, చీటింగ్ కేసులు, కాల్‌మనీ -సెక్స్ రాకెట్ కేసులు, హత్యలు తక్కువ. సివిల్ సెటిల్మెంట్లు, వ్యాపారుల మధ్య వివాదాలు, ఆత్మహత్య కేసులు అధికం. కొద్ది నెలల్లో ప్రారంభంకానున్న కృష్ణా పుష్కరాలకు కీలకంగా ఉండే పశ్చిమ జోన్లో పోలీసులపై అధికారపార్టీ పెత్తనం అధికమైంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పొలీస్ స్టేషన్ల వ్యవహారాలు నడుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైసర్గికంగా పెద్దది. విజయవాడ వన్‌టౌన్, టూటౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లు ఈజోన్ పరిధిలో ఉన్నాయి. వీటిలో ఒక్కొక స్టేషన్లో ఒక్కొక్క రకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రతి కేసులో తీవ్రస్థాయిలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉండటంతో తోటి పోలీసుల వ్యక్తిగత కేసుల్లో కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఆరుగురు సీఐలను సీపీ గౌతమ్‌సవాంగ్ ఏలూరు రేంజ్‌కు సరెండర్ చేశారు. వారి పనితీరు బాగోలేకపోవడం, అవినీతి ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వారి స్థానంలో నియమించేందుకుసమర్థుల కోసం సీపీ అన్వేషిస్తున్నారని సమాచారం. ఈక్రమంలో స్టేషన్ల వారీగా ఆయన దృష్టిసారించారు. పశ్చిమ జోన్లో ఒక్కొక్క సీఐది ఒక్కో తీరు. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ముద్దుల సీఐ కొండ దిగువ ప్రాంతంలో ఉన్న ఒక అధికారి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ముద్దుల సీఐగా పేరుపొందారు. స్టేషన్లో ఏపని జరగాలన్నా ఆ ఇద్దరి నేతల్లో ఒకరి సిఫార్సు తప్పనిసరి. ఏ ఇబ్బందీ లేకుండా నాలుగు రూపాయలు సంపాదించడమే అతని లక్ష్యమన్న విమర్శలు ఉన్నాయి. ఏడాదిన్నరగా ఆ సీఐ అక్కడే కొనసాగుతుండటంతో ఎక్కువ పరిచయాలు పెరిగి, బాగా సంపాదిస్తున్నారనే ఆరోపణ ఉంది. సెటిల్మెంట్ల అడ్డా కొండ వెనుక వైపు ఉన్న మరో స్టేషన్ అక్రమాలు, మామూళ్లకు అడ్డగా మారిందనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా గుట్కా సిండికేట్ల నుంచి నెలనెలా రూ.లక్షల్లో వసూలు చేస్తున్న స్టేషన్‌గా పేరు గాంచింది. అధికార పార్టీ అమాత్యునితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి సిఫార్సుకు ఒక చోటా నేతను పంపుతుంటారు. ఆ చోటా నేతలు నిత్యం ఇక్కడ పంచాయితీలు చేస్తూ కనిపిస్తారు. ఇక్కడ ఫిర్యాదు కన్నా సెటిల్మెంట్లే ఎక్కువ. తోటి సీఐకే న్యాయం చేయలేని అధికారి కమిషనరేట్‌లో పరిధిలో ఒక సీఐ ఇంటిని కొందరు ఆక్రమించారు. వారు ఖాళీ చేయకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారని బాధిత సీఐ ఒకరు వెస్ట్ జోన్‌లోని సంబంధిత స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఆ స్టేషన్లో న్యాయం జరగలేదు. కారణం అధికారపార్టీ సిఫార్సులతో నిత్యం బిజీగా ఉంటూ నాలుగు రూపాయలు వెనకేసుకోవడం ఇక్కడ వారికి అలవాటు. ఆయన సమర్థుడు కారని పోలీసుల్లో ప్రచారం ఉన్నా రాజకీయ పరిచయాలతో ఆ పోస్టులో కొనసాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. హడావుడి ఎక్కువగా.... కమిషనరేట్ పరిధిలోని మరో స్టేషన్ అధికారి బాగా హడావుడిగా ఉంటారు. స్థానికంగా అమాత్యుని కనుసన్నల్లో ఉంటూ ముగ్గరు చోటా నేతల సిఫార్సులతో కేసులు నడిపిస్తుంటారు. గంజాయి కేసుల్లో ప్రతిభ చూపిన సదరు అధికారి మిగితా విషయాల్లో అంతసీరియస్గా ఉండరనేది పోలీసుల అభిప్రాయం. -
విజయవాడ పోలీసు కమిషనరేట్ అప్‌గ్రేడ్
హైదరాబాద్: విజయవాడ నగరం పోలీసు కమిషనరేట్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ కమిషనరేట్‌కు కమిషనర్‌గా డీఐజీ స్థాయి అధికారిని నియమించేవారు. తాజా మార్పుచేర్పులతో అదనపు డీజీ స్థాయికి పెంచి, ప్రస్తుతం ప్రత్యేక భద్రతా బలగం (ఎస్పీఎఫ్) డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. దీంతో సహా మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.