పశ్చిమలో పొలిటికల్ పోలీస్
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో విధులు
రాజకీయ సిఫార్సులతోనే కేసుల నమోదు
తోటి సీఐకే న్యాయం చేయలేని అధికారి ఒకరు
ఇద్దరు నేతల ముద్దుల సీఐ మరొకరు
గుట్కా మామూళ్ల కారణంగానే మరొక సీఐ బదిలీ
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల అవినీతి, విధినిర్వహణలో అలసత్వం పెరిగిపోయింది. అధికార పార్టీ కనుసన్నల్లో విధులు నిర్వహిస్తూ రాజకీయ సిఫార్సులు ఉంటేనే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రైవేటు సెటిల్‌మెంట్లు, భూ వివాదాలు, ఇసుక రాకెట్‌ను ఆదాయవనరులుగా మార్చుకుని జేబులు నింపుకొంటున్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఓ స్టేషన్ సీఐ టీడీపీకి చెందిన కార్పొరేటర్‌తో కలిసి యథేచ్ఛగా సెటిల్‌మెంట్లు చేయగా, మరో సీఐ తోటి సీఐ ఆస్తి ఆక్రమణకు గురైనా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరుగురు సీఐలను పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇటీవల సరెండర్ చేసిన నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని వెస్ట్, సెంట్రల్, ఈస్ట్ జోన్లలోని స్టేషన్ల బాగోతంపై నేటి నుంచి వరుస కథనాలు...
విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అధిక ప్రాధాన్యం ఉన్న జోన్ వెస్ట్‌జోన్. రాష్ట్రంలోనే అతి పెద్ద రెండో దేవస్థానంగా పేరుగాంచిన కనకదుర్గమ్మ ఆలయం, దేశంలోనే ఖ్యాతి గాంచిన ఎన్‌టీటీపీఎస్, పెద్ద సంఖ్యలో ఆయల్ కార్పొరేషన్లు ఈ జోన్ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ సైబర్ నేరాలు, చీటింగ్ కేసులు, కాల్‌మనీ -సెక్స్ రాకెట్ కేసులు, హత్యలు తక్కువ.
సివిల్ సెటిల్‌మెంట్లు, వ్యాపారుల మధ్య వివాదాలు, ఆత్మహత్య కేసులు అధికం. కొద్ది నెలల్లో ప్రారంభంకానున్న కృష్ణా పుష్కరాలకు కీలకంగా ఉండే పశ్చిమ జోన్‌లో పోలీసులపై అధికారపార్టీ పెత్తనం అధికమైంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పొలీస్ స్టేషన్ల వ్యవహారాలు నడుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైసర్గికంగా పెద్దది. విజయవాడ వన్‌టౌన్, టూటౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లు ఈజోన్ పరిధిలో ఉన్నాయి. వీటిలో ఒక్కొక స్టేషన్‌లో ఒక్కొక్క రకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రతి కేసులో తీవ్రస్థాయిలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉండటంతో తోటి పోలీసుల వ్యక్తిగత కేసుల్లో కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి.
ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఆరుగురు సీఐలను సీపీ గౌతమ్‌సవాంగ్ ఏలూరు రేంజ్‌కు సరెండర్ చేశారు. వారి పనితీరు బాగోలేకపోవడం, అవినీతి ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వారి స్థానంలో నియమించేందుకుసమర్థుల కోసం సీపీ అన్వేషిస్తున్నారని సమాచారం. ఈక్రమంలో స్టేషన్ల వారీగా ఆయన దృష్టిసారించారు. పశ్చిమ జోన్‌లో ఒక్కొక్క సీఐది ఒక్కో తీరు.
అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ముద్దుల సీఐ
కొండ దిగువ ప్రాంతంలో ఉన్న ఒక అధికారి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ముద్దుల సీఐగా పేరుపొందారు. స్టేషన్‌లో ఏపని జరగాలన్నా ఆ ఇద్దరి నేతల్లో ఒకరి సిఫార్సు తప్పనిసరి. ఏ ఇబ్బందీ లేకుండా నాలుగు రూపాయలు సంపాదించడమే అతని లక్ష్యమన్న విమర్శలు ఉన్నాయి. ఏడాదిన్నరగా ఆ సీఐ అక్కడే కొనసాగుతుండటంతో ఎక్కువ పరిచయాలు పెరిగి, బాగా సంపాదిస్తున్నారనే ఆరోపణ ఉంది.
సెటిల్‌మెంట్ల అడ్డా
కొండ వెనుక వైపు ఉన్న మరో స్టేషన్ అక్రమాలు, మామూళ్లకు అడ్డగా మారిందనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా గుట్కా సిండికేట్ల నుంచి నెలనెలా రూ.లక్షల్లో వసూలు చేస్తున్న స్టేషన్‌గా పేరు గాంచింది. అధికార పార్టీ అమాత్యునితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి సిఫార్సుకు ఒక చోటా నేతను పంపుతుంటారు. ఆ చోటా నేతలు నిత్యం ఇక్కడ పంచాయితీలు చేస్తూ కనిపిస్తారు. ఇక్కడ ఫిర్యాదు కన్నా సెటిల్‌మెంట్లే ఎక్కువ.
తోటి సీఐకే న్యాయం చేయలేని అధికారి
కమిషనరేట్‌లో పరిధిలో ఒక సీఐ ఇంటిని కొందరు ఆక్రమించారు. వారు ఖాళీ చేయకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారని బాధిత సీఐ ఒకరు వెస్ట్ జోన్‌లోని సంబంధిత స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఆ స్టేషన్‌లో న్యాయం జరగలేదు. కారణం అధికారపార్టీ సిఫార్సులతో నిత్యం బిజీగా ఉంటూ నాలుగు రూపాయలు వెనకేసుకోవడం ఇక్కడ వారికి అలవాటు. ఆయన సమర్థుడు కారని పోలీసుల్లో ప్రచారం ఉన్నా రాజకీయ పరిచయాలతో ఆ పోస్టులో కొనసాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
హడావుడి ఎక్కువగా....
కమిషనరేట్ పరిధిలోని మరో స్టేషన్ అధికారి బాగా హడావుడిగా ఉంటారు. స్థానికంగా అమాత్యుని కనుసన్నల్లో ఉంటూ ముగ్గరు చోటా నేతల సిఫార్సులతో కేసులు నడిపిస్తుంటారు. గంజాయి కేసుల్లో ప్రతిభ చూపిన సదరు అధికారి మిగితా విషయాల్లో అంతసీరియస్‌గా ఉండరనేది పోలీసుల అభిప్రాయం.