తూర్పు పోలీస్ జోన్ తీరు ఇదీ.
గ్రామాలవారీగా పేకాట శిబిరాలకు కాసుల వాన
ప్రతి స్టేషన్‌లోనూ నెలకు రూ. లక్షల్లో వసూళ్లు
అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే..
విజయవాడ : గుట్కా, లిక్కర్ సిండికేట్ల నుంచి నెలనెలా లక్షల్లో మామూళ్లు, గ్రామాల వారీగా వీరి కనుసన్నల్లో అధికార పార్టీ ముసుగులో పేకాట శిబిరాలు, ఇక కాల్‌మనీ కేసులు వస్తే అదనంగా బోనస్ ఆదాయం.. ఇదీ విజ యవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తూర్పు పోలీస్ జోన్‌లో ఉన్న స్టేషన్ల పరిస్థితి. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అతి పెద్ద జోన్ ఇది. వారం క్రితం వరకు ఏడు పోలీస్ స్టేషన్లు, సీఐలు ఉండేవారు.
జోన్ల పునర్విభజనతో ఇప్పుడు మూడు స్టేషన్లుగా మారి ముగ్గురు సీఐలు ఉన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండడం ఈ జోన్‌కు కలిసొచ్చే అంశం. దీంతో అక్కడి పోలీ సులు అధికార పార్టీ పేరుతో హడావుడి చేస్తూ.. అడ్డగోలు పంచాయితీలు సాగిస్తూ భారీగా కాసులు కొల్లగొడుతున్నారు. ఫిర్యాదు వస్తే చాలు దాన్ని కాసులుగా ఎలా మలుచుకోవాలో బాగా తెలిసిన సిద్ధహస్తులు అక్కడి అధికారులు. తూర్పు జోన్‌లో కంకిపాడు, గన్నవరం, ఉయ్యూరు సర్కిళ్లు ఉన్నాయి.
అరెస్ట్‌లపై నిషేధం
కమిషనరేట్ పరిధిలోని ఓ సీఐకు నెలకు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయం వస్తుందని సమాచారం. వారంలో ఒకటి, రెండు గుట్కా రాకెట్ కేసులు పట్టుకుంటారు. ఎఫ్‌ఐఆర్ నమోదవుతుంది కానీ గుట్కా విక్రేతల అరెస్ట్‌లుండవు. ఇక్కడి స్టేషన్లలో గుట్కాలపై కాదు గుట్కా కేసులపై నిషేధం ఉందనేది పోలీసు వర్గాల్లో ఉన్న ప్రచారం. అవినీతి తారస్థాయికి చేరడంతో ఈ స్టేషన్ సీఐను గత వారం బదిలీ చేశారు. గొడవర్రు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మద్దూరు, చోడవరం, రొయ్యూరు, నెప్పల్లిల్లో భారీగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నాడు.
రోజూ రూ.లక్షల్లో ఆడతారు. ఈ క్రమంలో సదరు పేకాట నిర్వాహకుడితో సీఐకి మంచి పరిచయాలు ఉండడంతో అతడు నెలవారీ రూ. లక్షకు పోలీసులనుసెట్ చేసుకున్నాడు. గడిచిన నాలుగు నెలల్లో ఇక్కడ పేకాట భారీ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. లిక్కర్ సిం డికేట్ నుంచి నెలకు రూ.లక్ష మామూళ్లు వస్తాయని తెలిసింది. రెండు నెలల కిందట ఇద్దరు విద్యార్థులు ప్రేమ నేపథ్యంలో ఇంటి నుంచి పారిపోయారు. సీఐ పారిపోయిన విద్యార్థుల స్నేహితులను స్టేషన్‌కు తీసుకువచ్చి రెండు రోజులు హడావుడి చేశారు. చివరకు కేసును రాజీచేసి రూ.4 లక్షలు నొక్కేశారు. ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.
కాల్ మనీలో వాటాలు
మరో సర్కిల్‌లోని పోలీసులు పూర్తిగా అధికార పార్టీ ఎమ్మెల్యే ముసుగులో ఉంటారు. ప్రతి పనికి ఎమ్మెల్యే సిఫారసు ఉండాలి. ఆయన చెబితే ఎలాంటి కేసు అయినా సెటిల్ చేస్తారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కేసు వస్తే జాగ్రత్తగా పరిశీలించి డబ్బు దండుకుంటారు. బుద్ధవరం, అల్లాపురం, కేసరపల్లి గ్రామాల్లో అధికార పార్టీ నేతల ముసగులో పేకాట శిబి రాలు నిర్వహిస్తున్నారు. శిబిరాల నుంచి నెల వారీ రూ. క్షపైనే సీఐకి వాటా అందుతున్నట్లు ఆరోపణలున్నాయి.
మూడు నెలల కిందట కాల్‌మనీ కేసుల హడావుడి సమయంలో సర్కిల్ పరిధిలో సుమారు 20 మంది కాల్‌మనీ వ్యాపారులను స్టేషన్‌కు రప్పించి నలుగురిపై మాత్రమే కేసులు కట్టారు. వారి నుంచి నామమాత్రంగా స్టేషన్ ఖర్చుల పేరుతో వసూలు చేశారు. మిగిలిన వారి వద్ద రూ.20 వేల నుంచి రూ.50 వేల లోపు వసూలుచేసినట్లు ఆరోపణలున్నాయి. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో భారీగా దండుకుంటారు.
మేడమ్ పవర్‌ఫుల్..
ఇక్కడ సారే కాదు మేడమ్ కూడా పవర్‌ఫుల్లే అనే పేరుంది. కొన్ని కేసుల్ని మేడమ్ ప్రత్యేకంగా డీల్ చేసి సెటిల్ చేస్తుంటారనే ప్రచారం పోలీసు వర్గాల్లో జరుగుతోంది. సార్ స్టేషన్ పరిధిలోని నెలావారీ మామూళ్లతో పాటు కేసుల్ని డీల్ చేస్తుంటే మేడమ్ వారి బంధువులు, ఇతర సిఫారసులతో వచ్చిన కేసుల్ని సార్ దృష్టికి తీసుకెళ్లి సెటిల్ చేస్తారు. ముఖ్యం గా ఎమ్మెల్యేకు సదరు సీఐ అత్యంత సన్నిహితులు కావడం కలిసొచ్చే అంశం.
స్టేషన్ పరి ధిలో గండిగుంట, చినఓగిరాల, ముద్దునూరు, కాటూరు, ఆకునూరులో ఇళ్లలోనే పేకాట శిబి రాలు పోలీసుల కనుసన్నల్లో సాగుతున్నాయి. వీరి నుంచి నెలకు రూ.లక్ష మామూళ్లు ముడతాయని వినికిడి. వీటి వసూళ్లకు ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రత్యేకంగా విధుల్లో ఉంటారు. లిక్కర్ సిండికేట్ నుంచి నెలకు రూ.లక్ష మామూలు వస్తుందట. గతంలో సదరు సీఐ బదిలీకి రంగం సిద్ధంవగా స్థానిక ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి రావడంతో వాయిదా పడింది.