నీతో ఎందుకు కనెక్ట్‌ అయ్యానో తెలియదు! | Call Money Racket Issue Raised At Vijayawada Police Commissionerate | Sakshi
Sakshi News home page

మళ్లీ.. మళ్లీ కాల్‌

Published Tue, Oct 1 2019 11:51 AM | Last Updated on Tue, Oct 1 2019 1:02 PM

Call Money Racket Issue Raised At Vijayawada Police Commissionerate - Sakshi

‘హలో.. మీ ఇంటికి రావచ్చా? ప్రాబ్లం ఏమిటో చెప్పండి.. మళ్లీ ఫోన్‌ చేయనుగా.. ఒక్క అరగంట.. మీరు మనస్ఫూర్తిగా చెబితే వస్తా.. నాకు 2005లో పెళ్లి అయిన తర్వాత నేను ఎవరి దగ్గరకు రాలే.. నీతో ఎందుకు కనెక్ట్‌ అయ్యానో నాకు తెలియదు. అలా జరిగిపోయింది. ఇన్ని సార్లు అడుగుతున్నా.. బతిమాలుతున్నా.. ఏమంటారు.. హలో రావచ్చా...’   ఒక కాల్‌మనీ ఆగంతకుడు ఓ మహిళను తన లైంగిక కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేస్తూ ఇటీవల ఫోన్లో సంభాషించిన తీరు ఇది.. విజయవాడ నగరవాసులను కాటేస్తున్న ‘కాల్‌ నాగుల’ దందాలపై నాలుగేళ్ల క్రితమే ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చినా.. అప్పటి ప్రభుత్వం, పోలీసు అధికారులు నిర్లిప్తత కారణంగా నేటికీ వారు రెచ్చిపోతూనే ఉన్నారు. అప్పుడు కేవలం కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై దృష్టి పెట్టిన పోలీసులు.. కలుగులో దాక్కున్న చాలా ఎలుకలను వదిలేయడంతో ఇప్పుడా కాలాంతకులు మళ్లీ మహిళలను  చెరపట్టే స్థాయికి చేరుకున్నారు. 

సాక్షి, అమరావతి : కాల్‌మనీ రాకెట్‌ పుట్ట పగులుతోంది. విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో మొరపెట్టుకుంటున్న బాధితుల వ్యథలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో అనేక మంది కమిషనరేట్‌ తలుపు తడుతున్నారు. గత రెండు నెల రోజుల్లో పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పదుల సంఖ్యలో కాల్‌మనీ కేసులు వెలుగు చూస్తున్నాయి. అప్పు ఇచ్చిన సొమ్ముకు అధిక వడ్డీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండటం.. తమ కోరికలు తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో బాధితులు వెలుగులోకి వస్తున్నారు. పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని వేడుకుంటున్నారు. నగరంలో ఇలాంటి కేసులు నిత్యం వందలాదిగా బయటపడుతుంటే అతి కొద్ది కేసులు మాత్రమే పోలీసుల వరకు వస్తున్నాయి.

పేదలను పీల్చేస్తున్న పిశాచాలు.. 
కానూరుకు చెందిన ఓ మహిళ కుటుంబ అవసరాల నిమిత్తం స్థానికుడైన వంగర సుబ్రహ్మణ్యం వద్ద రూ.10.లక్షల అప్పు తీసుకుంది. ఆమెపైనే కన్నేసిన సుబ్రహ్మణ్యం.. ఇచ్చిన అప్పునకు బదులుగా కోరిక తీర్చమని ఒత్తిడి చేశాడు. కొడుకును కనిస్తేనే ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బంగారం తిరిగిస్తానని బెదిరించాడు. ఇది తట్టుకోలేక ఆమె పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును కలిసి ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. చివరకు సుబ్రహ్మణ్యంపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

బాడవపేటకు చెందిన వెంకటరమణ అనే మహిళ కూడా తన కుటుంబ అవసరాల కోసం రెబ్బా శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద రూ.3ల వడ్డీకి రూ.50వేలు అప్పు తీసుకుంది. 5 నెలల తర్వాత అసలు, వడ్డీ చెల్లించినా సదరు మహిళ ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, చెక్కు ఇవ్వలేదు. అదేమంటే అసలు వడ్డీనే చెల్లించలేదని, రూ.15ల వడ్డీకి అప్పు ఇచ్చానని బెదిరించాడు. ఇంట్లో ఉన్న టీవీని సైతం తీసుకుపోయాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. 

రామవరప్పాడుకు చెందిన వడ్డీ వ్యాపారి బొప్పన చంద్రశేఖర్‌ తన వద్ద అప్పు తీసుకున్న చాగంటి ప్రసాద్‌కు చెందిన భవనంపై కన్నేశాడు. చాగంటి ప్రసాద్‌ తీసుకున్న అప్పునకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించేశాడు. అయితే ఇంకా చెల్లించాలని చెప్పి రామవరప్పాడులో ఉన్న ఇతని భవనాన్ని తన పేరున రాయించుకునేందుకు చంద్రశేఖరరావు పావులు కదుపుతున్నాడని ప్రసాద్‌ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. 

బాధితులను ఒత్తిడికి గురిచేస్తున్న పోలీసులు..!
కాల్‌మనీ వ్యాపారుల వల్ల ఇబ్బందులు పడిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే.. భరోసా ఇవ్వాల్సింది పోయి వడ్డీ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు వారాల క్రితం వైఎస్సార్‌ కాలనీకి చెందిన ఓ మహిళ జంగా రవి అనే వడ్డీ వ్యాపారి ‘తన కోరిక తీర్చాలని.. ఇంటికి రావచ్చా..’ అంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఈ నెల 16వ తేదీన ‘స్పందన’ కార్యక్రమంలో పోలీసు కమిషనర్‌ ఎదుట ఫిర్యాదు చేసింది. ఈ కేసును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సీపీ అప్పగించారు. విచారించిన పోలీసులు 2వ పట్టణ పోలీసులకు కేసు కట్టమని ఆదేశించారు. 22వ తేదీన 2వ పట్టణ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ 345(ఏ), 506 ఐపీఎస్‌ సెక్షన్ల కింద కేసు కట్టారు. మరుసటి రోజు  బాధితురాలిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి నుంచి రోజూ ఎస్‌ఐ ఆమెకు ఫోన్‌ చేసి నిందితుడి వివరాలు అడగడం.. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పడం పరిపాటిగా మారింది. చివరకు నిందితుడు కోర్టులో లొంగిపోయి ఈనెల 26న బెయిల్‌ కూడా తెచ్చుకున్నాడు. అయినా ఎస్‌ఐ బాధితురాలితో నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని బుకాయిస్తున్నారు. బెయిల్‌ పొందిన తరువాత కోర్టు నుంచి సమాచారం వస్తుంది. దానిని కూడా దాచిపెట్టి బాధితురాలిని పోలీసులు మభ్యపెట్టడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement