అశ్లీల సందేశాలు
పంపిస్తున్న సీఈఓ అరెస్ట్
బెంగళూరు, న్యూస్‌లైన్ : మహిళా ఉద్యోగినికి అశ్లీల సందేశాలు, బూతు ఎస్ఎంఎస్లు పంపిస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీ సీఈఓని స్థానిక కమర్షియల్ స్ట్రీట్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... భారత ఆర్మీలో 25 సంవత్సరాలు పనిచేసి 2006లో కల్నల్ హోదాలో ఉద్యోగ విరమణ పొందిన విజయ్బాత్రా(60), బెంగళూరులోని వెరిఫ్యాక్ట్ సర్వీసెస్ కంపెనీ సీఈఓగా 2011 నుంచి పనిచేస్తున్నారు. ఇదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతి(29)పై కన్నేసిన అతను నిత్యం వేధించేవాడు.
ఆమె మొబైల్‌కు అసభ్య ఎస్ఎంఎస్లు, అశ్లీల దృశ్యాలు పంపించేవాడు. సహనం కోల్పోయిన యువతి ఈ విషయంపై విజయ్బాత్రాను నిలదీసింది. అప్పటి నుంచి ఆమెకు మరింత వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫలితం లేకపోవడంతో ఉద్యోగం మానివేసి, మరో కంపెనీలో చేరింది. కంపెనీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మానివేయడంతో రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా యాజమాన్యం జాప్యం చేస్తూ వచ్చింది.
విజయ్ బాత్రా వేధింపుల వల్లనే తాను ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగం మానివేశానని, తనకు న్యాయం చేయాలని యాజమాన్యంను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయ్బాత్రాను అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేశారు. అయితే తన భార్యకు సందేశాలు పంపించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు పొరపాటుగా ఆమెకు వెళ్లాయని విచారణలో విజయ్బాత్రా పేర్కొన్నట్లు సమాచారం. సంఘటనకు సంబంధించి వాస్తవాలు కూపీ లాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.