Vikram Saini
-
పిస్తోళ్లు, గునపాలు సిద్ధం చేసుకోండి.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులు తమ దుకాణాల్లో తుపాకులు, గునపాలు, రాళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గొడవలు జరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే.. వారు వచ్చే లోపే దుకాణాలు తగలబడిపోతున్నాయని పేర్కొన్నారు. వారు మాత్రం ఎంతసేపు పనిచేస్తారని వ్యాఖ్యానించారు. విక్రమ్ సైనీ ముజఫర్‌పుర్ జిల్లా ఖాతౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాన్సఠ్లోని వాజిద్పుర్ గ్రామంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజీవ్ బాలియన్తో పాటు ఈయన కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రసంగిస్తూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 'ఒకట్రెండు రాళ్ల డబ్బాలు, 4-5 గునపాలు, రెండు పిస్తోళ్లు మీ దుకాణాల్లో ఉంచుకోండి ' అని అన్నారు. ఆపేందుకు ప్రయత్నించినా విక్రమ్ సైనీ మాట్లాడే సమయంలో స్టేజీపై ఉన్న మరో నేత ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. 'ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేది, పేపర్లు, టీవీల్లో రావాలి. నన్ను ఐదేళ్ల పాటు ఎవ్వరూ పదవి నుంచి తప్పించలేరు. ఆ తర్వాత నాకు ఏ ఆశా లేదు' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది వైరల్‌గా మారి దుమారం రేపింది. నూపుర్ శర్మకు మద్దతు తెలిపిన వ్యక్తిని ఉదయ్‌పూర్‌లో హత్య చేసిన విషయాన్ని కూడా విక్రమ్ ప్రస్తావించారు. ఆమెకు అనుకున్నది మాట్లాడే హక్కు ఉందని పేర్కొన్నారు. చదవండి: Idris Ali: శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా.. -
‘ఇక అందమైన కశ్మీరీ యువతుల్ని పెళ్లిచేసుకోవచ్చు’
లక్నో : ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో దేశమంతా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఉన్న అడ్డండకులన్నీ తొలగిపోయానని, ఇప్పుడు అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని వివాహం చేసుకోవచ్చని వ్యాఖ్యానించి కతౌలి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ దుమారం రేపాడు. ఆర్టికల్ 370 రద్దు కావడంతో ముజరాఫరాబాద్‌లో బీజేపీ జిల్లా శాఖ మంగళవారం అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సైనీ.. ‘ఆర్టికల్ 370 రద్దుతో జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు చాలా సంతోషిస్తున్నారు. అందమైన కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు. ముస్లిం యువకులే కాదు.. హిందువులందరూ, దేశ వాసులందరూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కోసం పనిచేసే బ్యాచిలర్లు ఇప్పుడు దర్జాగా కశ్మీర్‌కు వెళ్లొచ్చు. అక్కడ ప్లాట్లు, భూమి కొనుగోలు చేయొచ్చు. అందమైన యువతుల్ని వివాహం చేసుకోవచ్చు. నిబంధనల ఫలితంగా ఇంతకు ముందు అక్కడి యువతులపై అఘాయిత్యాలు జరిగేవి. ఇప్పుడు అలాంటివి ఉండవు’ అన్నారు. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కశ్మీర్ అంశంపై నరేంద్ర మోదీ సర్కార్ ఆచితూచి అడుగులేస్తున్న తరుణంలో సైనీ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెట్టేవిగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. -
‘వారి మీద బాంబులేయ్యాలి’
లక్నో : మనిషి ప్రాణం కంటే ఆవు చావుకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నేలకొన్న పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉండాలంటేనే భయంగా ఉందంటూ నటుడు నసీరుద్దిన్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం సురక్షితం కాదనే వారి మీద బాంబులు వెయ్యాంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముజఫర్ నగర్ జిల్లా ఖతౌళి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కొంత మంది దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశం వారికి సురక్షితం కాదని భావిస్తున్నారు. నాకే గనక ఓ మంత్రి పదవి ఉంటే ఇలాంటి వారందరి మీద బాంబులు వేసేవాడిని. ఒక్కరిని కూడా వదలే వాడిని కాదు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అంటూ తెలిపారు. విక్రమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. -
వాళ్ల కాళ్లు, చేతులు విరగ్గొడతాను: ఎమ్మెల్యే
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవులను అగౌరవపరిచే వాళ్లను, వాటిని చంపేవాళ్ల చేతులు, కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. యూపీ మంత్రి సురేష్ రాణా సన్మాన కార్యక్రమంలో సైనీ మాట్లాడుతూ.. 'వందేమాతరం అని చెప్పేందుకు నిరాకరించేవాళ్లను, భారత్ మాతా కీ జై అని పలికేందుకు అభ్యంతరం చెప్పేవాళ్లను, గోవును తల్లిలా చూడని వాళ్ల కాళ్లు, చేతులు విరగ్గొడతానని శపథం చేస్తున్నా. ఇలాంటి వాళ్లను చంపేస్తా' అని అన్నారు. ఇలాంటి వాళ్లను ఎదుర్కొనేందుకు యువకులు ఓ జట్టుగా ఏర్పడాలని సైనీ పేర్కొన్నారు. ముజఫర్‌నగర్ జిల్లా ఖటౌలీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యారు. 2013 ముజఫర్‌నగర్ దాడుల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో గోవధశాలలను మూసివేయించారు.