Vincent Callebaut
-
కూలిన నగరంపై కొత్త పట్నం
మోసుల్ పేరు విన్నారా? అదేనండి.. ఈ మధ్య కాలంలో కరుడుకట్టిన ఉగ్రవాద మూక ఐసిస్ కబ్జా నుంచి విముక్తమైన ఇరాకీ నగరం. మూడేళ్ల ఐసిస్ దుశ్చర్యలకు ఈ నగరం కాస్తా కాంక్రీట్ దిబ్బగా మారిపోయింది. ఏదో అక్కడక్కడా ఒకట్రెండు భవనాలు మిగిలి ఉన్నాయేమో అంతే. ఎలాగూ ఐసిస్ పీడ విరగడైంది కాబట్టి.. ఈ నగరాన్ని మళ్లీ కట్టేయాలని స్థానిక ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఎలా కడితే బాగుంటుందో చెప్పమని ఈమధ్యే ఓ పోటీ పెట్టారు కూడా. ఒకసారి ఈ ఫొటోలవైపు చూడండి. మోసుల్‌ను ఇలా ఒక ఓడలా మార్చేద్దామంటున్నారు విన్సెంట్ కాలెబో అనే ఆర్కిటెక్చర్ సంస్థ డిజైనర్లు! వారి ప్రతిపాదనలు ఎలాగున్నాయంటే... ఎలాగూ అక్కడ టైగ్రిస్ నదిపై ఐదు వంతెనలు ఉన్నాయి కదా.. వాటిపైనే ఇళ్లు కట్టేద్దాం.. అత్యాధునిక హైడ్రోపోనిక్స్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తే నగర వాసులకు అవసరమైన పంటలు అక్కడికక్కడే పండించుకోవచ్చు. అవసరమైన నీటిని టైగ్రిస్ నది నుంచి తోడుకోవచ్చు. అన్ని రకాల సేంద్రియ వ్యర్థాలను కూడా రీసైకిల్ చేస్తాము కాబట్టి... పంటలకు ఎరువుల కొరత ఉండదు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వాడుకుని.. ఇస్లామిక్ సంప్రదాయ కళల స్ఫూర్తితో ఇళ్లు కట్టేద్దాం. పద్ధతిగా ఒకదానిపై ఒకటి పేర్చేసి.. అక్కడక్కడా గాలిమరలు, చిమ్నీలు ఏర్పాటు చేస్తే అడుగున ఉన్న టైగ్రిస్ నది నీటి ఆవిరి కారణంగా ఇళ్లల్లో ఉన్నవారందరికీ చల్లటిగాలి తగులుతూ ఉంటుంది. దీంతోపాటు ఇళ్లపైకప్పులపై వేసే సోలార్‌ప్యానెల్స్‌తో వేడినీటిని ఇవ్వొచ్చు. ఇక ఈ పచ్చటి నగరంలో వాడేసిన నీరు కూడా వృథా పోకుండా రీసైకిల్ చేసి మళ్లీ నదిలోకి వదిలేస్తే హోరున జారిపడే జలపాతాలూ అక్కడికక్కడే సృష్టించవచ్చు.... ఇలా ఉన్నాయి విన్సెంట్ కాలెబో ఆలోచనలు. ఇవన్నీ వాస్తవరూపం దాలుస్తాయా? ఎడారి రాజ్యంలో.. ఉగ్రవాద చర్యలతో సర్వనాశనమై పోయిన నగరంలో మళ్లీ పచ్చదనం అనే ఆశ చిగురిస్తుందా? చిగురిస్తే అద్భుతమే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాలుష్యాన్ని మింగేసే ట్విస్టింగ్ టవర్స్
తైపీ : ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ వృద్ధి చెందుతోన్న నగర జనాభాతో పాటూ కాలుష్యం కూడా అదే రీతిలో పెరుగుతోంది. జనాభా పెరుగుతుంది కానీ, భూమి పెరగదు. అందుకే ప్రత్యామ్నాయాల కోసం మనిషి అన్వేషణ మొదలైంది. అదే వర్టికల్ ఫార్మింగ్. అంటే అద్దాల మేడల్లో వ్యవసాయం చేయడం. వర్టికల్ ఫార్మింగ్ పద్దతిలో ఇప్పటికే చాలా దేశాల్లో భవంతులు నిర్మిస్తున్నారు. వర్టికల్ ఫార్మింగ్‌తో పాటూ భవంతి పైభాగం నుంచి కింది భాగం వరకు ఏకంగా 90 డిగ్రీలు తిరిగేలా తైవాన్‌లో ఓ భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఈ కాలుష్యాన్ని మింగేసే ట్విస్టింగ్ టవర్స్‌ను .. తావో జు యిన్ యువాన్ టవర్ లేదా అగోరా గార్డెన్‌గా పిలుస్తారు. తైపీలోని క్సిన్ యి జిల్లాలో 20 అంతస్తుల్లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అగోరా గార్డెన్ ముఖభాగం, పైకప్పు, బాల్కనీల్లో దాదాపు 23,000 చెట్లు, మొక్కలు, పొదలను పెంచడానికి అనువుగా నిర్మిస్తున్నారు. న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో ఉన్న మొత్తం చెట్లకు ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. భవంతి మధ్యలో 40 లగ్జరీ సముదాయాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్లు ఏడాదికి దాదాపు 130 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ను శోషించుకోగలవని నిపుణులు అంచనా వేశారు. 130 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించడమంటే 27 కార్లను ఏడాది పాటు తిప్పడం ఆపేసినట్లు అవుతుందట. అగోరా గార్డెన్ విశిష్టతలు: ► 455, 694 చదరపు అడుగుల విస్తీర్ణంతో భవంతి అడుగు నుంచి టాప్ ఫ్లోర్‌కు 90 డిగ్రీల కోణం వరకు తిరిగేలా నిర్మాణలను చేపట్టారు. ► బాల్కనీలోనే కాకుండా టవర్స్ లోపలి భాగంలో కూడా మొక్కలను పెంచే అవకాశం ఉంది. గ్లాస్ ఫ్లోరింగ్ పక్కనే చెట్లు ఉండి.. ప్రకృతితో మమైకమైన అనుభూతిని ఈ భవంతి కలిగిస్తుంది. ► ప్రతి యూనిట్లో ఓ లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, ఫ్యామిలీ రూమ్, కిచెన్, ప్రత్యేక బెడ్ రూమ్‌లు ఉంటాయి. ► ఇక డాబా పైకి వచ్చి చూస్తే సుందరమైన తైపీ నగరం దర్శనమిస్తుంది. ►ఈ నిర్మాణంలోపలే ఓ విశాలమైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ► కాలుష్య నివారణకు ప్రాధాన్యతనిస్తూ మొక్కలను పెంచడానికి అనువుగా నిర్మాణాలు చేపట్టే ప్రముఖ బెల్జియన్ ఆర్కిటెక్ట్ కల్లెబట్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు చేపట్టారు. 2013లో ప్రారంభమైన ఈ భవంతి టాప్ ఫ్లోర్ గత జూలైలో పూర్తయింది. మొక్కలు పెంచితే కింద చూపించిన విధంగా ఈ కాంక్రీటు నిర్మాణం పచ్చగా మారనుంది. -
పాత ఫ్యాక్టరీపై పచ్చని స్వర్గం
కాలుష్యం తెస్తున్న సమస్యలకు నగరాలు ఠారెత్తి పోతున్నాయి. ఒక్కటొక్కటిగానైనా పచ్చదనంవైపు అడుగులేస్తున్నాయి. మొన్న చైనాలోని నాన్జింగ్ నగరం పొగ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఓ భారీ భవంతిని పచ్చటి అడవిగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తే... ఆ తరువాత ఇటలీ... స్విట్జర్లాండ్‌లలోనూ ఇలాంటి పచ్చటి భవనాలకు అంకురార్పణ జరిగింది. తాజాగా ఫొటోలో కనిపిస్తున్న విధంగా భారీ ‘పచ్చ’ భవనాన్ని కట్టేందుకు సంకల్పించింది బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరం. అయితే దీనికో ప్రత్యేకత ఉంది. మిగిలినవి సాధారణ భవనాల్లో చెట్లు పెంచే ప్రయత్నాలు చేస్తూంటే.. బ్రస్సెల్స్‌లో ఒక పాత ఫ్యాక్టరీపై పూర్తిగా వాడిపారేసిన వస్తువులు, పదార్థాలతో ఎత్తైన పచ్చ నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఒకప్పుడు నౌకాశ్రయంగా ఆ తరువాత గోడౌన్‌గా ఉపయోగపడిన ఈ భవనంపై కొన్నేళ్ల క్రితం వరకూ టూర్ అండ్ ట్యాక్సీ సెంటర్‌గా ఉపయోగపడింది. తరువాతి కాలంలో దీన్ని వాడటం మానేశారు. ఖాళీగా ఉన్న ఈ భవనంపై దాదాపు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 300 అడుగుల ఎత్తైన నిర్మాణం ఏర్పాటవుతోంది. ఇందులో కొంత భాగం పూర్తిగా సోలార్ ప్యానెల్స్‌తో కప్పి ఉంచారు. నిర్మాణంలో భాగంగా నాటే మొక్కల ద్వారా ఏడాదికి దాదాపు 175 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో చేరకుండా అడ్డుకోవచ్చునని అంచనా. విన్సెంట్ కాల్బోట్ అర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేసి ఈ నిర్మాణంలో 750 అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్ బాల్కనీలో చిన్నపాటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ భవనం పక్కనే ఓ భారీ గ్రీన్‌హౌస్‌ను ఏర్పాటు చేసి అక్కడే కాయగూరలు, పండ్లు పండించేందుకూ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీంతోపాటు పక్కనే ఉన్న చిన్నపాటి సరస్సును చిత్తడినేలగా అభివృద్ధి చేసి, జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని విన్సెంట్ కాల్బోట్ అంటోంది. ప్రస్తుతానికి ఈ భవన నిర్మాణం ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూసే స్థితిలో ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్