పాత ఫ్యాక్టరీపై పచ్చని స్వర్గం
కాలుష్యం తెస్తున్న సమస్యలకు నగరాలు ఠారెత్తి పోతున్నాయి. ఒక్కటొక్కటిగానైనా పచ్చదనంవైపు అడుగులేస్తున్నాయి. మొన్న చైనాలోని నాన్‌జింగ్ నగరం పొగ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఓ భారీ భవంతిని పచ్చటి అడవిగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తే... ఆ తరువాత ఇటలీ... స్విట్జర్లాండ్‌లలోనూ ఇలాంటి పచ్చటి భవనాలకు అంకురార్పణ జరిగింది. తాజాగా ఫొటోలో కనిపిస్తున్న విధంగా భారీ ‘పచ్చ’ భవనాన్ని కట్టేందుకు సంకల్పించింది బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరం.
అయితే దీనికో ప్రత్యేకత ఉంది. మిగిలినవి సాధారణ భవనాల్లో చెట్లు పెంచే ప్రయత్నాలు చేస్తూంటే.. బ్రస్సెల్స్‌లో ఒక పాత ఫ్యాక్టరీపై పూర్తిగా వాడిపారేసిన వస్తువులు, పదార్థాలతో ఎత్తైన పచ్చ నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఒకప్పుడు నౌకాశ్రయంగా ఆ తరువాత గోడౌన్‌గా ఉపయోగపడిన ఈ భవనంపై కొన్నేళ్ల క్రితం వరకూ టూర్ అండ్ ట్యాక్సీ సెంటర్‌గా ఉపయోగపడింది. తరువాతి కాలంలో దీన్ని వాడటం మానేశారు. ఖాళీగా ఉన్న ఈ భవనంపై దాదాపు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 300 అడుగుల ఎత్తైన నిర్మాణం ఏర్పాటవుతోంది. ఇందులో కొంత భాగం పూర్తిగా సోలార్ ప్యానెల్స్‌తో కప్పి ఉంచారు. నిర్మాణంలో భాగంగా నాటే మొక్కల ద్వారా ఏడాదికి దాదాపు 175 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో చేరకుండా అడ్డుకోవచ్చునని అంచనా.
విన్సెంట్ కాల్‌బోట్ అర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేసి ఈ నిర్మాణంలో 750 అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. ప్రతి అపార్ట్‌మెంట్ బాల్కనీలో చిన్నపాటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ భవనం పక్కనే ఓ భారీ గ్రీన్‌హౌస్‌ను ఏర్పాటు చేసి అక్కడే కాయగూరలు, పండ్లు పండించేందుకూ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీంతోపాటు పక్కనే ఉన్న చిన్నపాటి సరస్సును చిత్తడినేలగా అభివృద్ధి చేసి, జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని విన్సెంట్ కాల్‌బోట్ అంటోంది. ప్రస్తుతానికి ఈ భవన నిర్మాణం ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూసే స్థితిలో ఉంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్