ఫ్యాన్సీ నంబర్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్
మీ వాహనానికి మూడు తొమ్మిదులు గానీ, ఒకే ఒకటి గానీ... ఇలాంటి ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకుంటున్నారా? అయితే మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. ఎందుకంటే, వాటి కోసం ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. అయితే ఇదంతా ఆంధ్రప్రదేశ్లోనో, తెలంగాణలోనో మాత్రం కాదు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ముందుగా లక్నో, అలీగఢ్, ముజఫర్నగర్, అలహాబాద్.. ఈ నాలుగు నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
కాన్పూర్లో ఇప్పటికే దీనికింద పలువురు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ నాలుగు నగరాల్లో జూన్ 2 నుంచి రిజస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని యూపీ రవాణా కమిషనర్ రజనీష్ గుప్తా తెలిపారు. ఆన్లైన్లో నిర్ధారిత ఫీజు చెల్లిస్తే, జిల్లా రవాణా అధికారులు ఈ ఫ్యాన్సీ నంబర్లు కేటాయిస్తారు. ఇందులో వీఐపీ, బాగా ఆకర్షణీయం, ముఖ్యం, ఆకర్షణీయం... ఇలా నాలుగు విభాగాలుగా చేశారు.