పాస్ ఉన్నా.. నో ఎంట్రీ
సాక్షి, విజయవాడ :
ఒక వైపు ట్రాఫిక్ ఆంక్షలు... మరో వైపు అన్ని చోట్ల దారి మళ్ళింపులు... ఇంకో వైపు ఇతర జిల్లాల నుంచి బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు వెరసి సామాన్యులతో పాటు అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్యూటీ పాస్‌లు ఉన్నప్పటికీ, ఉన్నతస్థాయి అధికారులు అయినప్పటికీS ఇతర జిల్లాల పోలీసులకు ప్రాధాన్యం తెలియకపోవటంతో రోజు ఏదో ఒక చోట గందరగోళం నెలకొంటోంది.
కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఈవో సూర్య కుమారి వాహనాన్ని కొండ కింద నిలిపివేసి అనుమతి లేదనడంతో ఆమె కొండపైకి నడిచివెళ్ళారు. నగర కమిషనర్ వీరపాండియన్ వాహనాన్ని , పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ బి. రాజశేఖర్ వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడంతో సమస్య తలలెత్తింది. కృష్ణా పుష్కరాలకు కోసం రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు, కర్ణాటక, ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో నగరంలో పనిచేసే ఎక్కువ మంది కానిస్టేబుల్స్‌ను కమిషనరేట్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో విధులకు కేటాయించారు. నగరంలో వారధి నుంచి కృష్ణలంక వరకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు, వారధి నుంచి బెంజ్ సర్కిల్ ఆటో నగర్, రామవరప్పాడు తదితర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర పోలీసులు ఉన్నారు. అలాగే కర్ణాటక , ఒడిస్సా రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులు నో ట్రాఫిక్ జోన్ వద్ద ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడే సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఎవరు వీఐపీనో, ఎవరు కాదో బయటి ప్రాంత పోలీసులకు తెలియడం లేదు. ప్రతి వాహనాన్ని ఆపడమే తమ డ్యూటీగా భావిస్తున్నారు. మేం ఫలానా అని చెబుతున్నా వినడం లేదు. కొందరు పోలీసులు మరీ అత్యుత్సాహంగా పాస్‌లు ఉన్న కార్లు, ఇతర వాహనాలను కూడా అడ్డుకుంటున్నారు.
ముఖ్యమంత్రికి ఫిర్యాదులు
కొందరు ప్రముఖులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇదే విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మొదలుకొని డీజీపీ నండూరి సాంబశివరావు, చివరకు మంత్రులు, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి పోలీసు ఆంక్షల విషయాన్ని తీసుకెళ్ళారు. డీజీపీ, హోంమంత్రి మాట్లాడుతూ ఆంక్షలు సడలించామని ప్రకటించినా అవేవీ ఆచరణలోకి రాలేదు. ఈక్రమంలో ఐఏఎస్ అధికారులు పోలీసుల తీరుపై నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఐఏఎస్‌లకు కలెక్టర్ పేరిట జారీచేసిన పాస్‌లు అనుమతించకపోవడంతో కలెక్టరు బాబు, సీపీ సవాంగ్‌తో మాట్లాడారు.