visweswar eddy
-
ఆయకట్టుకు నీరెక్కడ బాబూ?
వజ్రకరూరు: హంద్రీ–నీవా మొదటి దశ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకుండానే జలహారతులంటూ ఆర్భాటాలకు పోతే ఎలా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఆయకట్టుకు సాగునీటిని అందించే విషయంపై రైతులకు స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఈ జిల్లాలో కాలు పెట్టాలని సూచించారు. మండలంలోని వెంకటాంపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం ఆయన పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. కాలనీలోని ప్రతి ఇంటికీ విశ్వ వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావం వల్ల పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అంతులేని వివక్ష చూపుతున్నారన్నారు. కనీసం రెండు తడులైనా నీళ్లు ఇచ్చి ఉంటే కోట్ల రూపాయల విలువైన పంట చేతికి వచ్చి ఉండేదని అన్నారు. పంట నష్టాలకు ప్రభుత్వమే కారణమని తెలిపారు. హంద్రీ–నీవా పనులు పూర్తి చేయడంలోనూ సీఎం వివక్ష కనబరుస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తితో రూ. 6వేల కోట్ల వ్యయాన్ని రూ. 12 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో హంద్రీ–నీవాకు రూ. 5,500 కోట్లు కేటాయించి, 90 శాతం పనులు పూర్తి చేయించారని గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఇదే ప్రాజెక్ట్‌కు శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. అంతేకాక 40 టీఎంసీ ప్రాజెక్ట్‌ని ఐదు టీఎంసీలకు కుదించేందుకు కారకులయ్యారని విమర్శించారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటే కృష్ణ జలాలపై ఇప్పటిలా మిగులు జలాలు కాకుండా జిల్లా రైతులకు సంపూర్ణ హక్కు ఉండేదని పేర్కొన్నారు. 10 శాతం పనులు చేయలేక.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌లోని 90 శాతం పనులు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అంతటితో ఆగకుండా జీవో 22ని అమలు చేయడం ద్వారా హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థని రద్దు చేశారని తెలిపారు. ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతులే సొంత ఖర్చుతో పైప్‌లు ఏర్పాటు చేసుకుని పంట పొలాలకు నీటిని మళ్లించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రైతులపై చిత్తశుద్ధి లేని సీఎం రైతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే విమర్శించారు. మొదటి దశ పనులు 2012లోనే పూర్తి చేసుకున్న హంద్రీ–నీవా ఆయకట్టుకు నేటికీ చుక్క నీటిని సీఎం అందించలేకపోయారని గుర్తు చేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసం బుక్కపట్నం, ధర్మవరం చెరువుల వద్ద జలహారుతులు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉరవకొండ నియోజకర్గంలో 80వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. -
ఏపీ బడ్జెట్ అంకెల గారడీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి అవాస్తవాలతో కూడుకున్నదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత బడ్జెట్‌పై చర్చలో మాట్లాడుతూ.. 'ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలను ముందుకుతీసుకెళ్లేది కాదు. విభజన తర్వాతి పరిస్థితిలో ఈ బడ్జెట్ రాష్ట్రానికి గుదిబండగా మారే ప్రమాదముంది. ఆర్థిక వ్యూహం రాష్ట్రానికి ప్రమాదం తెచ్చేలా ఉంది. రాష్ట్ర అప్పులు వచ్చే సంవత్సరంనాటికి 1,96,000 కోట్లకు చేరుతాయని అంటున్నారు. బడ్జెట్ 20 శాతం పెరిగినా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అన్నింటికీ నిధులు తగ్గించేశారు' అని చెప్పారు. ఈ బడ్జెట్ అంకెల గారడీ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 'మనం 11 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధించామని చెబుతున్నారు. చంద్రబాబు అవినీతి, అన్యాయాలు, దోపిడీ వల్ల పంట విస్తీర్ణం తగ్గిపోయింది. వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి వచ్చిన పాపాన పోలేదు. వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి బాగా పెరిగితేనే జీఎస్డీపీ పెరుగుతుంది. ఆ రెండు రంగాలూ కుంటుపడినా కూడా జీఎస్డీపీ పెరిగిందనడం పూర్తిగా తప్పు. ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయిన ముఖ్యమంత్రి అవాస్తవాలు చెబుతూ మభ్యపెడుతున్నారు' అని చెప్పారు.