ఆయకట్టుకు నీరెక్కడ బాబూ? | visweshwar reddy fired on ap cm chandra babu | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు నీరెక్కడ బాబూ?

Published Thu, Jan 11 2018 7:15 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

visweshwar reddy fired on ap cm chandra babu

వజ్రకరూరు: హంద్రీ–నీవా మొదటి దశ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకుండానే జలహారతులంటూ ఆర్భాటాలకు పోతే ఎలా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఆయకట్టుకు సాగునీటిని అందించే విషయంపై రైతులకు స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఈ జిల్లాలో కాలు పెట్టాలని సూచించారు.  మండలంలోని వెంకటాంపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం ఆయన పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. కాలనీలోని ప్రతి ఇంటికీ విశ్వ వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వర్షాభావం వల్ల పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అంతులేని వివక్ష చూపుతున్నారన్నారు. కనీసం రెండు తడులైనా నీళ్లు ఇచ్చి ఉంటే కోట్ల రూపాయల విలువైన పంట చేతికి వచ్చి ఉండేదని అన్నారు. పంట నష్టాలకు ప్రభుత్వమే కారణమని తెలిపారు. హంద్రీ–నీవా పనులు పూర్తి చేయడంలోనూ సీఎం వివక్ష కనబరుస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తితో రూ. 6వేల కోట్ల వ్యయాన్ని రూ. 12 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. వైఎస్సార్‌ హయాంలో హంద్రీ–నీవాకు రూ. 5,500 కోట్లు కేటాయించి, 90 శాతం పనులు పూర్తి చేయించారని గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఇదే ప్రాజెక్ట్‌కు శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. అంతేకాక 40 టీఎంసీ ప్రాజెక్ట్‌ని ఐదు టీఎంసీలకు కుదించేందుకు కారకులయ్యారని విమర్శించారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటే కృష్ణ జలాలపై ఇప్పటిలా మిగులు జలాలు కాకుండా జిల్లా రైతులకు సంపూర్ణ హక్కు ఉండేదని పేర్కొన్నారు.

10 శాతం పనులు చేయలేక..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలోనే హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌లోని 90 శాతం పనులు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అంతటితో ఆగకుండా జీవో 22ని అమలు చేయడం ద్వారా హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థని రద్దు చేశారని తెలిపారు. ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతులే సొంత ఖర్చుతో పైప్‌లు ఏర్పాటు చేసుకుని పంట పొలాలకు నీటిని మళ్లించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

రైతులపై చిత్తశుద్ధి లేని సీఎం
రైతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే విమర్శించారు. మొదటి దశ పనులు 2012లోనే పూర్తి చేసుకున్న హంద్రీ–నీవా ఆయకట్టుకు నేటికీ చుక్క నీటిని సీఎం అందించలేకపోయారని గుర్తు చేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసం బుక్కపట్నం, ధర్మవరం చెరువుల వద్ద జలహారుతులు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉరవకొండ నియోజకర్గంలో 80వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement