కలెక్టర్ సుడిగాలి పర్యటన
సాక్షి, ఏలూరు : తుపాను ప్రభావిత ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. దెబ్బతిన్న పంట నష్టాలను సమగ్రంగా అంచనా వేసేందుకు నిపుణులతోకూడిన బృందాన్ని పంపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ను కోరారు. నరసాపురం మండలం వేములదీవి, సారవ, లక్ష్మణేశ్వరం, తదితర గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటను కలెక్టర్ పరిశీలించారు. నరసాపురం మండలం పెదమైనివానిలంకలోని పునరావాస కేంద్రానికి వెళ్లి భోజన, వసతి సౌకర్యాల తీరును పరిశీలించారు. పునరావాస కేంద్రాలలో జనరేటర్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అనంతరం వేమలదీవి ఈస్ట్, గొందికొడప గ్రామాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను చూశారు.
వేములదీవి తూర్పు సబ్‌సెంటర్‌ను కలెక్టరు పరిశీలించి ప్రతీ సెంటర్లో హెల్త్ సూపర్వైజర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, సెలైన్ స్టాండ్లు, క్లోరిన్ అందుబాటులో ఉంచాలని వైద్యాధికార్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ టి.బాబూరావునాయుడు, ఆర్డీవో వసంతరావు, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రమణ, పంచాయతీ అధికారి సత్యనారాయణ, విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
మొగల్తూరు, నరసాపురం మండలాల్లో తుపాను బాధితులను ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పరామర్శించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించారు. పంటలు నష్టపోరుున రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయూన్ని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు.