volleyball match
-
వాలీబాల్ ఫైనల్లో భారత్
కఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల వాలీబాల్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 27–25, 25–19, 21–25, 25–21తో శ్రీలంకపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో పాకిస్తాన్ 25–15, 25–21, 26–24తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దీంతో దాయాది దేశాలైన భారత్, పాక్‌ల మధ్య వాలీబాల్ టైటిల్ పోరు జరగనుంది. మహిళల విభాగంలోనూ డిఫెండింగ్ చాంపియన్ అయిన భారత్ తుదిపోరులో నేపాల్‌తో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు మంగళవారం జరుగుతాయి. సెమీస్‌లో మహిళల జట్టు మాల్దీవులపై నెగ్గగా, శ్రీలంకపై నేపాల్ గెలిచింది. పలు క్రీడాంశాల్లో పోటీలు మొదలైనప్పటికీ ఆరం¿ోత్సవ వేడుకలు మాత్రం ఆదివారం లాంఛనంగా జరిగాయి. నేపాల్ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ క్రీడలను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నేపాలీ సంప్రదాయ శైలీలో అట్టహాసంగా వేడుకల్ని నిర్వహించారు. -
మళ్లీ ఓడిన బ్లాక్ హాక్స్
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ జట్టు వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. కాలికట్ హీరోస్తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ 11–15, 11–15, 7–15, 15–12, 15–11తో ఓడిపోయింది. ఈ లీగ్‌లో కాలికట్ హీరోస్కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. బ్లాక్ హాక్స్ జట్టు స్పైక్‌లో 27 పాయింట్లు, బ్లాకింగ్‌లో ఆరు పాయింట్లు, సర్వీస్‌లో నాలుగు పాయింట్లు సాధించింది. కాలికట్ జట్టు స్పైక్‌లో 36 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. అజిత్ లాల్ 19 పాయింట్లు, జెరోమ్ వినీత్ 12 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో చెన్నై స్పార్టన్స్ ఆడుతుంది. -
హైదరాబాద్ ఓటమి
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ జట్టుకు వరుసగా రెండో పరా జయం ఎదురైంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ 15–12, 11–15, 12–15, 10–15, 15–14తో కొచ్చి బ్లూ స్పైకర్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. హైదరాబాద్ స్పైక్ షాట్ల ద్వారా 43 పాయింట్లు రాబట్టగా... ఐదుసార్లు మాత్రమే ప్రత్యర్థి స్పైక్‌లను ‘బ్లాకింగ్’ చేయగలిగింది. హైదరాబాద్ ప్లేయర్ అశ్వల్ రాయ్ 15 పాయింట్లు సాధించి మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలువడం విశేషం. నేడు జరిగే మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో కాలికట్ హీరోస్ తలపడుతుంది. -
మహిళలకు నో ఎంట్రీ
టెహరాన్: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళుతూ సత్తా నిరూపించుకోవడం కనిపిస్తూనే ఉంది... అయితే కొన్ని దేశాల్లో మాత్రం వారిని వృత్తిపరంగా ఎదగనీయడం కాదు కదా కనీసం వినోదాన్ని కూడా ఆస్వాదించేందుకు వీల్లేకుండా చేస్తున్నారు. తాజాగా ఇరాన్లో జరిగిన ఉదంతాన్ని గమనిస్తే ఇదంతా నిజమేననిపిస్తుంది. శుక్రవారం ఇక్కడ అమెరికా, ఇరాన్ జట్ల మధ్య వాలీబాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు అందరితోపాటు పరిమిత సంఖ్యలో మహిళలను కూడా ఆహ్వానించారు. ఇందులో ఎక్కువగా ఆటగాళ్ల కుటుంబసభ్యులే ఉన్నారు. అయితే తీరా మ్యాచ్ ఆరంభ సమయానికి సీన్ మారింది. పురుషులు ఆడే మ్యాచ్‌ను తిలకించేందుకు మహిళలకు అనుమతి ఇచ్చారనే విషయం తెలిసిన అక్కడి మత సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వెనక్కి తగ్గిన నిర్వాహకులు వారిని లోనికి అనుమతించలేదు. మహిళా జర్నలిస్టులను సైతం లోనికి పంపకపోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళన జరిపారు. అటు సోషల్ మీడియాలోనూ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.