మహిళలకు నో ఎంట్రీ
టెహరాన్: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళుతూ సత్తా నిరూపించుకోవడం కనిపిస్తూనే ఉంది... అయితే కొన్ని దేశాల్లో మాత్రం వారిని వృత్తిపరంగా ఎదగనీయడం కాదు కదా కనీసం వినోదాన్ని కూడా ఆస్వాదించేందుకు వీల్లేకుండా చేస్తున్నారు. తాజాగా ఇరాన్‌లో జరిగిన ఉదంతాన్ని గమనిస్తే ఇదంతా నిజమేననిపిస్తుంది.
శుక్రవారం ఇక్కడ అమెరికా, ఇరాన్ జట్ల మధ్య వాలీబాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు అందరితోపాటు పరిమిత సంఖ్యలో మహిళలను కూడా ఆహ్వానించారు. ఇందులో ఎక్కువగా ఆటగాళ్ల కుటుంబసభ్యులే ఉన్నారు. అయితే తీరా మ్యాచ్ ఆరంభ సమయానికి సీన్ మారింది. పురుషులు ఆడే మ్యాచ్‌ను తిలకించేందుకు మహిళలకు అనుమతి ఇచ్చారనే విషయం తెలిసిన అక్కడి మత సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వెనక్కి తగ్గిన నిర్వాహకులు వారిని లోనికి అనుమతించలేదు.
మహిళా జర్నలిస్టులను సైతం లోనికి పంపకపోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళన జరిపారు. అటు సోషల్ మీడియాలోనూ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.