అమెరికాపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికా నమ్మదగిన దేశంకాదని ఇరాన్ ప్రముఖ నేత అయతుల్లా అలీ ఖామ్నేయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే, సౌదీ అరేబియా ఎన్నో తీవ్రమైన నేరాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అణుఒప్పందానికి సంబంధించి గతంలో చేసుకున్న ఒప్పందాలను పూర్తి చేయడంలో అమెరికా విఫలమైందని అన్నారు. మాటల్లో చెప్పినన్ని చేతల్లో చూపించలేకపోయిందని విమర్శించారు. అందువల్లే ఇక అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు.
ఇరాన్ తో ఇతర దేశాలకు ఉన్న సంబంధాలను బద్ధలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందని, అమెరికా ఇరాన్ కు వ్యతిరేకంగా తయారైందని ఆరోపించారు. అలాగే, యెమెన్ లోని అమాయక ప్రజలపై బాంబులు వేస్తూ సౌదీ అరేబియా తీవ్ర నేరానికి పాల్పడుతోందని అక్కడి పాఠశాలలు, వైద్యాలయాలు ధ్వంసం చేస్తూ వారికి తీరని నష్టం తీసుకొస్తుందని విమర్శించారు. ఇదంతా కూడా అమెరికా కనుసన్నల్లోనే అని చెప్పారు.