Volunteer Organization
-
ఆకలి తీర్చే.. దాతలు
సాక్షి, ఆదిలాబాద్ : సేవ చేయాలనే ఆలోచన ఉంటే చాలూ.. జేబులో చిల్లిగవ్వ లేకున్నా కొత్త ఆలోచనతో మిగులు ఆహారాన్ని పేదలకు అందిస్తున్నారు. మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల కడుపు నింపేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సత్యసాయి సేవా సమితి ముందుకొస్తున్నాయి. జానెడు పొట్ట కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంతోమంది ఎండ, వాన, చలీలో కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. మరికొంత మంది వికలాంగులు, వృద్ధులు, అనాధలు, చిన్నారులు యాచకులుగా మారుతున్నారు. అలాంటి వారికి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సేవా సమితి సభ్యులు కడుపునిండా భోజనం పెడుతున్నారు. దీంతోపాటు శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని వృథాగా పోనివ్వకుండా అక్కడి నుంచి కార్మికవాడల్లో, రైల్వేస్టేషన్, రిమ్స్ ఆస్పత్రిలో ఆకలితో ఉన్నవారికి భోజనం వడ్డిస్తున్నారు. కడుపునిండా తిన్నవారు అన్నదాత సుఖీభవ అంటూ వారిని ఆశీర్వదిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ.. మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సంఘం సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓ శుభకార్యానికి వెళ్లిన సమయంలో మిగిలిపోయిన ఆహారాన్ని పారవేసే సమయంలో ఈ సంఘం సభ్యులకు ఓ ఆలోచన తట్టింది. మిగులు ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్న పేదలకు వడ్డిస్తే కడుపునిండా భోజనం చేస్తారని.. ఇలా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. పెండ్లీలు, బర్త్‌డే పార్టీలు, చిన్నచిన్న శుభకార్యాల్లో మిగిలిపోయిన అన్నం కార్మిక వాడల్లోకి తీసుకెళ్లి వారికి భోజనం వడ్డిస్తున్నారు. ఈ సంఘంలో బాధ్యులు పస్పుల రాజు, శివగణేష్, దేవిదాస్, రామకృష్ణ, ప్రశాంత్, సంతోష్, అభికృత్, కనక నర్సింగ్, శశికళ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. శుభకార్యాల్లో మిగిలిపోయిన అన్నం వృధా కాకుండా సేవ సమితి సెల్: 7382747696 లపై సంప్రదించవచ్చు. రోగుల బంధువులకు అండగా.. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రం రోజుకు ఎంతో మందికి కడుపునిండా ఉచితంగా ఒకపూట భోజనం పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగలేని పేద ప్రజలే నిత్యం రిమ్స్‌కు చికిత్స కోసం వస్తుంటారు. అలాంటి వారు భోజనం చేయలేని పరిస్థితుల్లో వారికి కడుపునిండా భోజనం అందిస్తున్నారు. 2012 ఆగస్టు 21న శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. అన్నదానం చేయాలనుకునేవారు సెల్: 9440871776, 9705692816 సంప్రదించాలి. ఆరోగ్యానికి జొన్నరొట్టె మంచిర్యాల : రోజురోజుకు ప్రాచీన వంటకాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యాన్ని వ్యాధుల నుంచి కాపాడు కోవడానికి పలు రకాల ప్రాచీన వంటకాలను భుజిస్తున్నారు. ప్రాచీన వంటకాల్లో జొన్నరొట్టెలకు పట్టణంలో బలే గిరాకి పెరిగింది. జొన్నరొట్టె వలన శారీరానికి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందని ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క దుకాణంతో మొదలైన జొన్నరొట్టె వ్యాపారం పన్నెండు దుకాణాలుగా వెలిసాయి. ఒక్క రొట్టెకు పది రూపాయల చొప్పున అమ్మతున్నారు. నిత్యం చాల మంది జొన్నరొట్టెల కోసం ఆసక్తిని చూపుతున్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు నిత్యం జొన్నరొట్టెలు తింటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. కొంతమంది మహిళలు నిత్యం మధ్యాహ్నం వచ్చి జొన్నపిండి కలుపుకుని కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తు వేడివేడిగా కారం చెట్నితో ప్రజలకు అందిస్తు జీవనోపాధిని పొందుతున్నారు. జొన్నరొట్టెలతో ఆర్యోగానికి కలిగే మేలా చాల ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. దీంతో పట్టణంలో ప్రాచీన వంటకం జొన్నరొట్టెకు భలే గిరాకీ పెరిగింది. -
వాళ్లంతా అరవైలో ఇరవై
కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులేమో కానీ, ఆ వృద్ధుల్లో మాత్రం వయసు మీదపడినా ఉత్సాహమే ఉత్సాహం. కాటికి కాళ్లు చాపుకునే వయసులో కృష్ణా రామా అంటూ మూల కూర్చోవడం వాళ్ల పని కాదు. జీవిత చరమాంకంలో ఏం చెయ్యాలి, సమయాన్ని ఎలా గడపాలి అంటూ కుంగిపోయే జీవితం వాళ్లది కానే కాదు. సాటి పండుటాకుల్లో మనోస్థైర్యాన్ని నింపడమే వారి పని. అదే వాళ్లకు కొండంత బలం. అది చెన్నైకి చెందిన ఉధవి అనే స్వచ్ఛంద సంస్థ. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో అయిదేళ్ల క్రితమే మొదలైంది. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ వాలంటీర్లు అందరూ కూడా డెబ్బయి ఏళ్ల పైబడిన వారే. వృద్ధులైతేనే సాటి వారి కష్టాలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో సీనియర్ సిటిజన్లనే వాలంటీర్లుగా నియమించింది. ఇప్పుడు వారే ఒక సైన్యంగా మారారు. తమని తాము ఉత్తేజంగా ఉంచడమే కాదు, ఆపదలో ఉన్న తోటివారికి అండదండగా ఉంటున్నారు. సూపర్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు. అటు నుంచి ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. సన్నటి ఏడుపు, బాధిస్తున్న ఒంటరితనం, ఏం చెయ్యాలో సమయాన్ని ఎలా గడపాలో తెలీని నిస్సహాయత, ఒక్కోసారి ఆత్మహత్యవైపు ప్రేరేపించే ఆలోచనలు. కాటికి కాళ్లు చాపుకునే వయసులో అయినవాళ్లు పట్టించుకోకపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు. ఆ బాధ పంచుకోవడానికి ఒకరు కావాలి. అలాంటి ఫోన్ రాగానే 76 ఏళ్ల వయసున్న సుందర గోపాలన్ అనే వాలంటీర్ రెక్కలు కట్టుకొని ఆ బాధితుల దగ్గరకి వెళ్లిపోతారు. వాళ్లతో కబుర్లు చెబుతారు. జోకులు వేస్తారు. నవ్విస్తారు. కాసేపు అలా పార్కుకి తీసుకెళ్లి చల్లగాలిలో కలిసి వాకింగ్ చేస్తారు. డెబ్బయి ఆరేళ్ల వయసులో కూడా తాను ఎంత హాయిగా ఉన్నానో వాళ్లకి చెబుతారు. అలా ఏదో ఒక్కసారి కాదు. వారంలో రెండు, మూడు సార్లు వాళ్ల దగ్గరికి వెళ్లి వస్తుంటారు. అలా నెల రోజుల పాటు ఆ బాధితులతో టచ్‌లో ఉంటారు. మళ్లీ వారి ముఖం మీద చిరునవ్వు వచ్చేవరకు కౌన్సెలింగ్ ఇస్తారు. ‘ఒంటరితనం మనిషిని చంపేస్తుంది. నా భర్త చనిపోయినప్పుడు అదెంత బా«ధిస్తుందో నాకు తెలిసివచ్చింది.. అలాంటి బాధలో ఉన్నవారిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. జీవితం ముందుకు వెళ్లేలా వారికి అన్ని విధాలుగా సాయపడగలను‘ అని సుందర గోపాలన్ వివరించారు. వేదవల్లి శ్రీనివాస గోపాలన్. ఆమె వయసు 85. ఈ వయసులో కూడా స్వెట్టర్లు అల్లుతారు. హ్యాండ్‌బ్యాగ్స్ తయారు చేస్తారు. వాటిని ఇరుగుపొరుగు వాళ్లకి, స్నేహితులకి అమ్మి ఆ వచ్చిన డబ్బుని కష్టాల్లో ఉన్న వృద్ధులకి ఇస్తూ ఉంటారు. ‘ మా అమ్మ ఎప్పుడు చూసినా అదే పనిలో ఉంటుంది. తనని తాను కష్టపెట్టుకుంటుంది. ఆ పని వద్దన్నా వినిపించుకోదు. ఎంత ఎక్కువ మందికి సాయపడితే తనకు అంత తృప్తి అంటుంది. కానీ మాకు ఆమె ఆరోగ్యం ఏమైపోతుందోనన్న ఆందోళన ఉంటుంది‘ అని వేదవల్లి కుమార్తె కృష్ణవేణి చెప్పుకొచ్చారు. ఉధవి సంస్థ వ్యవస్థాపకురాలు సబితా రాధాకృష్ణన్, ఆమె వయసు 75 ఏళ్లు. అయినవాళ్లు ఎవరూ లేక ఒంటరితనంతో బాధపడే వృద్ధుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపడం కోసమే ఆమె ఈ సంస్థ స్థాపించారు. చిన్న చిన్న అవసరాలైనా నేనున్నానంటూ తీరుస్తారు. గుళ్లు గోపురాలు తిప్పడం, షాపింగ్‌కు తోడు వెళ్లడం, రెస్టారెంట్లకి తీసుకువెళ్లడం, బ్యాంకు పనుల్లో సాయ పడడం వంటివి చేస్తూ ఉంటారు. ‘సీనియర్ సిటిజన్ల దైనిందిన కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఒంటరితనాన్ని పోగొట్టడమే మా సంస్థ ప్రధాన ఉద్దేశం. వాలంటీర్లు అదే వయసు వారు ఉంటే వారి మధ్య వేవ్ లెంగ్త్ బాగా ఉంటుందని సీనియర్‌సిటిజన్లనే వాలంటరీర్లుగా నియమిస్తున్నాం‘ అని సబిత వెల్లడించారు. అంతేకాదు సీనియర్ సిటిజన్లు నిరంతరం పనిలో ఉంటేనే వారిలో మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వాలంటీర్‌గా పని చేస్తున్న వృద్ధుల్లో చలాకీతనం బాగా పెరిగిందని సబిత చెప్పారు. ఇలాంటి సంస్థల అవసరం ఉంది మన దేశంలో సీనియర్ సిటిజన్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో వారి సంఖ్య పెరిగిపోతోంది. మన దేశంలో 60ఏళ్లపై బడినవారు 13 కోట్ల మంది ఉన్నారు. వారిలో 63శాతం మంది దారిద్య్ర రేఖకి దిగువన నివసిస్తున్నారు. అనారోగ్యంతో మంచానపడితే చూసే దిక్కులేనివారు 62% , ఇక కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధులు 54%. మరో ఎనిమిదేళ్లలో దేశంలో వృద్ధుల సంఖ్య 17.3 కోట్లకు చేరుకోవచ్చు. ఇక 2050 నాటికి జనాభాలో 20 శాతం మంది వృద్ధులే ఉంటారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, హెల్పేజ్ ఇండియా సంస్థలు అంచనా వేశాయి. వృద్ధుల సంక్షేమం కోసమే ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 1వ తేదీని ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్‌గా ప్రకటించింది. నానాటికి పెరిగిపోతున్న వృద్ధుల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సంస్థల అవసరమూ భవిష్యత్‌లో పెరుగుతుంది. అందుకే ఉధవి సంస్థ చేస్తున్న సేవల్ని అందరూ భేష్ అంటూ కొనియాడుతున్నారు. కాలక్షేపంలో వృద్ధులు -
స్వీపర్లు కావలెను
బ్రాహ్మణ, క్షత్రియులకు ప్రాధాన్యం అహ్మదాబాద్: స్వీపర్లు కావాలంటూ స్థానిక సెయింట్ జేవియర్స్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చిన ప్రకటన వివాదాస్పదమైంది. సెయింట్ జేవియర్స్కు చెందిన ఎన్జీఓ ‘హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్’ (హెడీఆర్సీ) డెరైక్టర్ ప్రసాద్ చాకో స్వీపర్లు తదితర పారిశద్ధ్య సిబ్బంది పోస్టుల కోసం ఏప్రిల్‌లో ప్రకటన ఇచ్చారు. అందులోని ఓ క్లాజ్‌లో... బ్రాహ్మణ, క్షత్రియ, వనియా, పటేల్, జైన్, సయ్యద్, పఠాన్, సిరియన్ క్రిస్టియన్, పార్సి కులస్తులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై గత రెండు రోజులుగా ఎన్జీఓ కార్యాలయ ప్రాంగణంలో ఆందోళనలు జరుగుతున్నాయి. రాజ్‌పుత్ శౌర్య ఫౌండేషన్, యువ శక్తి సంఘటన్, సున్ని అవమి ఫోరమ్‌కు చెందిన కొందరు ఎన్జీఓ ప్రకటనను తప్పు పట్టారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కలెక్టర్‌కు విన్నవించారు. అయితే ఎన్జీఓతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థల బృందం కలెక్టర్‌ను కలిసింది. తామే కులాన్నీ కించపరిచే ఉద్దేశంతో ఈ ప్రకటన ఇవ్వలేదని తెలిపింది. -
గోదారి తీరాన.. గుబాళిస్తున్న ‘మానవత’
కంబాలచెరువు (రాజమండ్రి) :ఎన్నో వాగువంకలూ, చెలమలూ, సెలయేళ్లూ కలిస్తేనే అఖండ గోదావరి అవుతుంది. జాలులుగా, ప్రవాహాలుగా ఆ నదిలో చేరిన జలసిరికి.. దప్పిక గొన్న నోళ్లకు, నెర్రెలు తీసిన బీళ్లకు చేరితేనే నిజమైన సార్థకత. అదిగో.. ఆ స్ఫూర్తితోనే ఆ నదీతీరాన ఉన్న రాజమండ్రి నుంచి విలక్షణ సేవలు అందిస్తోంది ‘మానవత’ అనే స్వచ్ఛంద సేవాసంస్థ. ‘సమాజం నుంచి స్వీకరించడమే కాదు.. సమాజానికి సమర్పించడమూ మన కర్తవ్యం. అవసరమైన వారికి సేవ చేయడమే మానవత్వం’ అన్న లక్ష్యంతో నగరానికి చెం దిన కొందరు ప్రముఖులు 2012లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం సేవలను విస్తరించే సంకల్పంతో ఉంది. 2002 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్.రామచంద్రారెడ్డి అనే సేవాతత్పరుడు చేస్తున్న సేవలతో పొందిన స్ఫూర్తే ఈ తీరంలో ఆ తరహా సేవలకు అంకురార్పణ చేయించిందని నిర్వాహకులు అంటున్నారు. పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోయి, దూరాన ఉన్న ఆత్మీయులు రావలసిన సందర్భాల్లో భౌతికకాయాలను చెడిపోకుండా భద్రపరచడం భరించలేని వ్యయంతో కూడిన పని. దాంతో చాలామంది రావలసిన వారు రాకుండానే అంత్యక్రియలు నిర్వహిస్తుం టా రు. అలాంటి సందర్భాల్లో మృతదేహాలను చెడిపోకుండా పదిలపరిచే ‘ఫ్రీజర్ బాక్స్’లను పేదకుటుంబాలకు ఉచితంగా అందిస్తోంది ‘మానవత’. ప్రస్తుతం రాజమండ్రి, పరిసర ప్రాంతాల వరకు ఈ బాక్స్‌లను ఉచితంగా అందజేస్తున్నారు. జిల్లాలోని దూరప్రాంతాలకైతే కేవలం రవాణా చార్జీలు తీసుకుంటున్నారు. అలాగే రాజమండ్రి, పరిసరాల్లో చనిపోయిన వారిని రాజమండ్రిలోని కైలాసభూమికి తరలించేందుకు ఉచితంగా శాంతిరథాన్ని సమకూరుస్తున్నారు. ఈ వాహనాన్ని పద్మసాయి ఫైనాన్స్ సంస్థ సమకూర్చింది. కాగా స్కూళ్లలో చదువుతున్న పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో చేతులు అపరిశుభ్రంగా ఉండడం చూసిన సంస్థ సభ్యుల్లో ఒకరైన మెహర్ మధు ఆ స్థితికి విరుగుడుగా ఏదైనా చేయాలనుకున్నారు. ప్రస్తుతం ఆయన నగరంలోని స్కూళ్లన్నింటికి లిక్విడ్ సోప్‌ను నిరంతరాయంగా ఉచితంగా అందిస్తున్నారు. తమ సంస్థ సేవలు వినియోగించుకోవాలంటే కేవలం ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుందని మానవత నిర్వాహకులు చెపుతున్నారు. అవసరమైన వారు 93979 16060, 94913 86972, 92466 52620లో సంప్రదించవచ్చంటున్నారు. త్వరలో అంబులెన్స్, రక్తదాన శిబిరాలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 108 అందుబాటులేక కొందరికి ప్రాణాంతకమవుతోంది. అలాంటి స్థితిలో ఆపన్నులను ఆదుకునేందు కు అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది మానవత. త్వరలోనే ఈ సదు పాయం నగరవాసులకు కల్పించనుంది. అ లాగే సమయానికి రక్తం దొరకక చాలామంది రోగులకు విషమ పరిస్థితి ఎదురవుతోంది. ఆ దిశగా వారి కోసం ఉచిత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ నిర్వాహుకులు తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారులు మెహర్‌మధు, రత్నాజీ (పద్మసాయి), బాబి, చింతా ప్రభాకరరడ్డి(సీపీ రెడ్డి), బలేష్ గుప్త, చక్కా త్రినాథ్, మద్దుల మురళీకృష్ణ, మన్యం బాబ్జి, గౌతమీ నేత్రాలయం మధు, పి.రామచంద్రయ్య, విక్రమ్‌జైన్‌లు సారథులుగా ముందుకు నడిపిస్తున్న ‘మానవత’ మరింత మందిలో మానవీయతను తట్టి లేపి, ఇతోధిక సేవలకు ప్రేరణ కావాలని ఆశిద్దాం.