ఆమె చదువుకు ఆటంకాలెన్నో..!
సాక్షి, సిటీబ్యూరో : ఓవైపు చదువులో అమ్మాయిలు దూసుకెళ్తున్నప్పటికీ... మరోవైపు గ్రామాల్లో పరిస్థితులు ఇంకా మెరుగుపడాల్సి ఉందంటున్నారు ఆర్జీరావు ట్రస్ట్ నిర్వాహకులు బొంత దామోదర్‌రావు. పదేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో విద్యాసేవలు అందిస్తున్న ఆయన... అమ్మాయిల చదువుకు ఎదురవుతున్న అడ్డంకులు, తన అనుభవాలు, ఆలోచనలు ‘సాక్షి.. నేను శక్తి’ శీర్షికతో పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...
ఓ గ్రామంలోని అమ్మాయికి ఖరగ్‌పూర్ ఐఐటీలో సీటొచ్చింది. అంత దూరం ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తామంటూ? తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఈ విషయం తెలిసి మా మేనేజర్ వెళ్లి వాళ్లను కన్విన్స్ చేసి, ఒప్పించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అడ్మిషన్ టైమ్ అయిపోయింది. ప్రస్తుత విద్యావ్యవస్థ రోజురోజుకూ ఖరీదెక్కి, వసతులతో కూడిన నాణ్యమైన విద్య సామాన్యులు అందుకోలేనిదే.! అన్నట్టుగా మారింది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు అబ్బాయిల చదువుపై చూపిస్తున్న ఆసక్తి.. అమ్మాయిల విషయంలో చూపడం లేదు.
పిల్లల చదువు ఆగిపోకూడదని, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని మేం ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్‌తో ట్రస్ట్ తరఫున అవసరమైన పుస్తకాలు కొనివ్వడం, హాస్టల్ ఫీజు కట్టడం తదితర చేస్తున్నాం. అయితే మేం 100 మంది పిల్లలకు చేయూతనందిస్తుంటే, అందులో 30శాతం వరకే కొనసాగుతున్నారని తేలింది. డ్రాపవుట్ అవుతున్న వారిలో అత్యధికులు ఆడపిల్లలే. దీనికి కారణాలేమిటని విశ్లేషిస్తే.. ఆడపిల్లల విద్యకు సంబం«ధించి తల్లిదండ్రుల్లో అవగాహన, ఆసక్తి పెరగకపోవడమే ప్రధానంగా కనిపించింది.
వివాహంతో చదువుకు విడాకులు
తల్లిదండ్రులు గట్టిగా అనుకుంటే ఇప్పుడున్న స్థితిలో పిల్లలను చదివించకుండా ఉండే పరిస్థితి నిజానికి లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య, మాలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఓ స్థాయి వరకు సులభంగానే చదివించొచ్చు. అయితే ఆడపిల్ల పెళ్లికిస్తున్న ప్రాధాన్యత చదువుకు ఇవ్వడం లేదు. గ్రామాల్లో తల్లిదండ్రులు ఇప్పటికీ ఆడపిల్లను బరువుగానే భావిస్తున్నారు. మంచి సంబంధం వస్తే చాలు కూతురి చదువుకు గుడ్‌బై చెప్పించేస్తున్నారు.
‘ఓ అమ్మాయి చాలా బాగా చదివేది. మేం కూడా అన్ని రకాలుగా ప్రోత్సహించాం. అయితే ఫైనల్ ఇయర్లో అడుగుపెడుతుందనగా పెళ్లి కుదరింది. అంతే... తల్లిదండ్రులు చదువు మాన్పించేశారు. మేం ఎంత కన్విన్స్ చేసినా వినలేదు. ఆ అమ్మాయి కోసం మేం పడిన వ్యయప్రయాసలన్నీ వృథా అయ్యాయి. ’
వసతుల లేమి.. దూరభారం..
దాదాపు 70శాతం గ్రామీణ పాఠశాలల్లో మరుగుదొడ్ల లాంటి కనీస వసతులు లేవు. వీటి నిర్మాణ, నిర్వహణలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న నిధులు వృథా అవుతున్నాయి. ఈ కారణంతో యుక్త వయసు తర్వాత ఆడపిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు సంశయిస్తున్నారు. అదే విధంగా చాలా పల్లెల్లో పాఠశాలలు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రాకపోకలకు సంబంధించి తల్లిదండ్రుల్లో ఎన్నో రకాల భయాలున్నాయి. ఈవ్‌టీజింగ్ లేదా మరే పెద్ద, చిన్న సమస్య వచ్చినా స్కూల్/కాలేజ్‌కి గుడ్‌బై చెప్పించేసి ఇంటి దగ్గర కూర్చోబెడుతున్నారు. వీటికి తోడు ఇంగ్లిష్ చదువులు అమ్మాయిలకు ఎందుకనే భావన, ఎప్పటికైనా ఆడపిల్లే కదా.. అనే చులకన లాంటివన్నీ ఆడపిల్లల చదువుకు గండికొడుతున్నాయి.
స్వచ్ఛందంగా కదలాలి.. సరిదిద్దాలి..
స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, విద్యావేత్తలతో కలిసికట్టుగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు చేపట్టాం. కస్తూర్బా బాలికల పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలు ఉండవు. అలాంటి వాళ్లకు వందేమాతరం ఫౌండేషన్‌తో కలిసి శిక్షణనిస్తున్నాం. ప్రస్తుతం రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంగీకరిస్తే ట్రస్టు ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల విద్యార్థులను విభిన్న అంశాల్లో సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ట్రిపుల్ ఎల్ (లాంగ్వేజ్, లాజిక్, లెర్నింగ్) పేరుతో లైఫ్‌స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. సహజంగా పాఠశాల చివరి పీరియడ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి... దాన్ని ఉపయోగించుకుంటున్నాం. కస్తూర్బా స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలు చేస్తున్నాం. విద్యార్థినులకు గైడెన్స్ అందించేందుకు ‘నిర్మాణ్’ సంస్థతో కలిసి టోల్‌ఫ్రీ నెంబర్(1800–425–2425) ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కొంతకాలం పనిచేస్తే ఆడపిల్లల చదువుకు అడ్డంకుల్ని అధిగమించొచ్చు.