స్వచ్ఛంద బోధకులు... | they teach study to childrens as Volunteer teachers | Sakshi
Sakshi News home page

స్వచ్ఛంద బోధకులు...

Published Fri, Sep 5 2014 12:23 AM | Last Updated on Thu, Jul 25 2019 5:25 PM

స్వచ్ఛంద బోధకులు... - Sakshi

స్వచ్ఛంద బోధకులు...

మనవద్ద ఉన్నదేదైనా ఇతరులకు ఇచ్చేస్తూ పోతే చివరకు మనమే లేమిలో కూరుకుపోతాం. డబ్బుదస్కాలకు, ఆస్తిపాస్తులకు ఈ సూత్రం వర్తిస్తుంది. అయితే ఇతరులకు పంచే కొద్దీ పెరిగేది, మనల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దేదీ ఒకటుంది. అదే.. విద్య. దీనిని గుర్తిస్తున్న ‘సిటీ’జనులు వాలంటరీ టీచింగ్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. తమ విజ్ఞానాన్ని విద్యార్థులకు పంచడానికి ఆరాటపడుతున్నారు.
 
జీతభత్యాలు లేకున్నా, తమ విలువైన సమయాన్ని బోధన కోసం వెచ్చిస్తూ అమూల్యానుభవాలను పోగు చేసుకుంటున్నారు. స్వచ్ఛంద బోధన చేస్తున్న వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మొదలుకొని గృహిణుల వరకు వివిధ నేపథ్యాలకు చెందిన వారు ఎందరో ఉన్నారు. భావితరానికి మార్గదర్శకులుగా ఉంటున్న వీరి అనుభవాలు వారి మాటల్లోనే..
 
ఆసక్తి ఉంటే చాలు...
ఇప్పుడిప్పుడే నగరంలో స్వచ్ఛంద ఉపాధ్యాయ విధులపై ఆసక్తి పెరుగుతోంది.  విభిన్న వృత్తి వ్యాపకాల్లో బిజీగా ఉండే వారు సైతం వాలంటరీ టీచింగ్‌కు సై అంటున్నారు.  ‘‘మేం కొన్ని నెలల క్రితమే సిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది పూర్తిగా వాలంటరీ టీచర్ల మీదే ఆధారపడిన కార్యక్రమం తొలుత 10 స్కూళ్లను ఎంచుకున్నాం. అయితే యువత నుంచి వచ్చిన స్పందన అనూహ్యంగా ఉండడంతో...  ఏడాదిలోపు 100 స్కూల్స్‌కు మా సేవలు విస్తరింపజేయాలనుకుంటున్నాం’’అని టీచ్ ఫర్ చేంజ్ (www.teachforchange.in, www.facebook.com/teachforchange.officia) ప్రోగ్రామ్ నిర్వాహకులు చైతన్య చెప్పారు.  
 
స్కూల్‌డేస్ గుర్తొస్తున్నాయి..
బోయినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నా. నా క్లాస్‌లో 50 మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారు. నేను వెళ్లగానే పిల్లలంతా లేచి గుడ్మార్నింగ్ టీచర్ అని విష్ చేస్తుంటే మా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. ఇంగ్లిష్ పాఠాలతో పాటు పిల్లలకు ప్రవర్తన, పరిశుభ్రతలనూ తెలియజేస్తున్నా. మొదట వారానికి ఒకరోజు వెళతానని మాట ఇచ్చా. అయితే, ఈ వ్యాపకానికి ఎంతగా అలవాటు పడ్డానంటే, ఇప్పుడు వారానికి నాలుగైదు రోజులు వెళుతున్నా. టీచింగ్‌ని అద్భుతమైన జాబ్ అని ఎందుకంటారో ఇప్పుడర్థమవుతోంది.
 -హేమ, గృహిణి. బోయినపల్లి.
 
ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా..
వీకెండ్స్‌లో ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి పిల్లలకు పాఠాలు చెబుతున్నా. బస్తీ పిల్లలను హ్యాండిల్ చేయడం, వాళ్లకు అర్థమయ్యేలా విషయాలు చెప్పడం అంత తేలిక కాదు. ఒక్కో సెక్షన్‌లో 70 మంది వరకు పిల్లలుంటారు. వారి ఆహారం, అలవాట్లు చూశాక నాలో మరింత పట్టుదల పెరిగింది. నా వల్ల ఒక్క స్కూడెంట్ బాగుపడినా చాలు కదా అనుకున్నా. మొదట్లో పిల్లలు సరిగా మాట వినడం లేదని కొంత డిజప్పాయింట్ అయినా, ఇప్పుడిప్పుడే వారిని మచ్చిక చేసుకోవడం ఎలాగో తెలుసుకుంటున్నా.                   
- నివేదిత, ఐటీ అనలిస్ట్, కొండాపూర్.
 
పని ఒత్తిడి హుష్‌కాకి...
వీకెండ్స్‌లో క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెడుతూనే ఒక రిలాక్స్‌డ్ ఫీలింగ్ కలుగుతుంది. పిల్లల నవ్వు ముఖాలు, వారు మనపై చూపే ప్రేమతో అన్ని ఒత్తిళ్లూ మటుమాయమవుతాయి. వారితో నవ్వుతున్నాం, ఆడుతున్నాం.. సింపుల్‌గా పిల్లల్లా మారిపోతున్నాం.  ‘టీచ్ ఫర్ చేంజ్’ ద్వారా వాలంటరీ టీచింగ్‌కు అవకాశం వచ్చినప్పుడు చాలా ఉద్వేగంగా అనిపించింది. ప్రస్తుతం కుకట్‌పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులకు చదువు చెబుతున్నా.
 
బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన ‘చెప్పు.. మరచిపోతా. బోధించు.. గుర్తుంచుకుంటా. నేర్పు.. లీనమవుతా’ మాటలను నేను విశ్వసిస్తాను. హడావుడిగా చెప్పేసి, అంతే స్పీడ్‌గా మరచిపోయే పద్ధతికి వ్యతిరేకంగా పిల్లలను కూడా ఇన్‌వాల్వ్ చేసే టీచింగ్ మెథడ్స్‌నే ఫాలో అవుతున్నా. వీకెండ్స్‌లో ఎక్కడెక్కడో గడిపి టైమ్ వృథా చేయడం కంటే సమాజానికి మేలు చేయడం సబబు కదా.
- వై.అశోక్, జూనియర్ మేనేజర్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ డెవలపర్స్ లిమిటెడ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement