Voter registration program
-
ఓటరుగా నమోదు చేసుకోండి
సాక్షి, సూర్యాపేట: ఓటరు గుర్తింపు కార్డు.. ఓటు వేసేందుకు కాదు... పింఛన్ మంజూరుకు.. బ్యాంకు ఖాతా తెరిచేందుకు.. వ్యక్తిగత గుర్తింపునకు ఓటరు కార్డే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంతటి ప్రాధాన్యం కలిగిన ఓటరు కార్డును పొందేందుకు.. అందులో అవసరమైన మారులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.భారత ఎన్నికల సంఘం ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్ జారీ చేసింది. ఐదు నెలలపాటు కొనసాగనున్న ఈ పక్రియకు యం త్రాంగం సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో 18 ఏళ్లు నిండిన ప్రతీ వ్యక్తి కీలకమైన ఓటుహక్కును కలిగి ఉండాలని ఎన్నికల సంఘం చెబుతోంది. అందుకు ఏటా అర్హుల నుంచి ఓటుహక్కు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రతీసారి అక్టోబర్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించే ఎన్నికల సంఘం ఈసారి నెల ముందుగానే ఓటరు నమోదు, జాబితాలో మార్పున?కు, చేర్పులకు, సవరణలకు ముందుకు వచ్చింది. ఓటరు జాబితను పారద్శకంగా పక్కా సమాచారంతో తయారు చేయాలనే సంకల్పంతో ముందస్తుగా షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 31వరకు, 2020, జనవరి 1తేదీతో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు, ఆపై వయస్సుగలవారు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో ఏమైనా సవరణలు ఉన్నా.. చిరునామాలో మార్పులు, చేర్పులు ఉన్నా.. ఫొటో తప్పు ఉన్నా.. మరే పొరపాటు ఉన్నా సరిదిద్దుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకు ఎన్నికల సంఘం నెల రోజులు గడువు ఇచ్చింది. అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలని సూచనలు చేసింది. ఏం చేయాలంటే ఓటరు నమోదుకు సమీపంలో బీఎల్ఓను సంప్రదించాలి. వీలుకాని పక్షంలో దగ్గర లోని ఈసేవ కేంద్రంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయంగా సందర్శించి ఓటు నమోదు, సవరణ చేసుకోవచ్చును. దరఖాస్తుకు రెండు ఫొటోలు, వయసు ధ్రువీకరణ పత్రం, చదువుకోనివారు ఆధార్‌కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ పత్రం రేషన్ కార్డు జిరాక్సు జత చేయాలి. లేదా ఆన్లైన్ ద్వారా కాని , బీఎల్ఓల ద్వారా ఓటు నమోదు, సవరణలు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌లో ఇంటింటి సర్వే సెప్టెంబర్ 1 నుంచి బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. నెల రోజులపాటు నిర్వహించే ఈ సర్వేలో ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ను తెలుసుకోవడం, ఆ దరఖాస్తు ఆమోదానికి అప్లోడ్ చేయడం, జాబితాలో ఎవరైనా చనిపోయినవారు గానీ, వలస వెళ్లినవారు ఉంటే గుర్తించి వివరాలు సేకరిస్తారు. 18 ఏళ్లు నిండిన వారున్నా వారి వివరాలను నమోదు చేసుకుంటారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు తమ పరిధిలోని ఇంటింటీ సర్వే చేయనున్నారు. 1950కి ఫోన్ చేస్తే చాలు.. ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ఉంటే ఎక్కడ ఉంది? తెలుసుకోవడానికి సబంధించిన బూత్‌స్థాయి అధికారిని సంప్రదించాలి. లేదంటే 1950 ఓటరు హెల్ప్‌లైన్‌కి పోన్ చేసి తెలుసుకోవచ్చు. కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. షెడ్యూల్ ఇదీ... ఓటరు నమోదు, సవరణలు ఆగస్టు 1 నుంచి 31 వరకు బీఎల్ఓల ఇంటింటి సర్వే సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ముసాయిదా జాబితా విడుదల అక్టోబర్ 10, 2019 అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్15 నుంచి నవంబర్30 వరకు తుది జాబితా ప్రకటన జనవరి 01, 2020 -
మరో అవకాశం
కరీంనగర్: యువతీ, యువకులకుశుభవార్త. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ, గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో తమ పేర్లుగల్లంతయ్యాయని పలువురు ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ మేరకు ప్రత్యేక అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ జాబితా విడుదల చేసిన విషయం విదితమే.అయితే,అప్పట్లో దరఖాస్తు చేసుకోలేని వారి కోసం మళ్లీ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శని, ఆదివారాల్లో ఓటరుగా నమోదు, చేర్పులు, మార్పుల ప్రక్రియ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులతో పాటు చిరుమానా మారిన వారు మార్పులు, చేర్పులు అవసరమైన వారు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 9,68,305 మంది ఓటర్లు గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం అర్హులైన వారితో పాటు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అర్హులకు చోటు కల్పించాక గత నెల 22న తేదీన జాబితా విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం కరీంనగర్ జిల్లాలో 9,68,305 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 4,81,271 మంది కాగా, మహిళలు 4,87,013 మందితో పాటు ఇతరులు 21 మంది ఉన్నట్లు తేల్చారు. మళ్లీ ఓటరుగా నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించనున్న ఈ నేపథ్యంలో ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. అర్హులైన వారు తగిన ఆధారాలతో స్థానిక రెవెన్యూ కార్యాలయం లేదా బీఎల్ఓల వద్ద నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేనిపక్షంలో మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఇదే సమయంలో బీఎల్ఓలు ప్రతీ ఇంటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలిస్తారు. జాబితాలో లేని వారిని గుర్తించి పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటారు. ఇక ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు కళాజాత బృందాలను సైతం నియమించారు. ఆయా బృందాల సభ్యులు గ్రామాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో రెండు రోజుల పాటు బీఎల్ఓలు ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. -
దరఖాస్తుల వెల్లువ
ఆదిలాబాద్‌అర్బన్: రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగియనుంది. గత నెల రోజుల నుంచి కొనసాగుతున్న ఈ సవరణ ప్రక్రియకు భారీగా స్పందన లభించింది. గతేడాదిలో మూడు సార్లు ఓటరు నమోదు చేపట్టినా రానంతగా స్పందన ఈసారి వచ్చింది. అయినా గ్రామాల్లో పూర్తి స్థాయిలో అర్హులైన యువత నమోదుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఓటు నమోదుపై అవగాహనలు, చైతన్య ర్యాలీలు, ప్రత్యేక నమోదులు, సదస్సులు పట్టణంలో మినహా గ్రామాల్లో కన్పించకపోవడంతో అర్హత గల వారు ఓటుకు దూరంగా ఉన్నారని సమాచారం. అలాంటి వారికి నమోదు గురించి తెలియపరిస్తే ఏ కొంత లక్ష్యాన్ని అయినా అందుకోవచ్చు. ఇదిలా ఉండగా, జిల్లాలో డిసెంబర్ 26 నుంచి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టగా ఇప్పటి వరకు 32,167 దరఖాస్తులు వచ్చాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 11లోగా పరిశీలన చేసి తుది జాబితాను రూపొందిస్తారు. అనంతరం ఫిబ్రవరి 22న జాబితాను విడుదల చేస్తారు. జిల్లాలో 32,167 దరఖాస్తులు జిల్లాలో నెల రోజులుగా కొనసాగుతున్న ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా అధికారులు అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈసారి చేపట్టిన నమోదుకు ఏకంగా 32,167 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 13,706 దరఖాస్తులు రాగా, బోథ్ అసెంబ్లీ పరిధి నుంచి 18,461 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఓసారి పరిశీలిస్తే.. జాబితాలో కొత్తగా ఓటు నమోదుకు 19,506 దరఖాస్తులు రాగా, జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు 828 వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఓటరు కార్డులో సవరణ చేసుకునేందుకు 452 దరఖాస్తులు రాగా, ప్రస్తుతమున్న పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులకు, చిరునామాల మార్పులకు 11,381 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను శనివారం నుంచి పరిశీలన ప్రారంభించి వచ్చే నెల 11లోగా పూర్తి చేయనున్నారు. నమోదుకు భారీగా స్పందన ఈసారి చేపట్టిన ఓటరు నమోదుకు జాబితాలో పేర్లు లేని వారు, యువత బాగా స్పందించారు. 2019 జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ నమోదుకు అర్హులు కావడంతో జిల్లాలో ప్రక్రియ ఊపందుకుంది. కళాశాలల్లో నమోదు, పట్టణంలోని వార్డుల్లో, గ్రామాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టడంతో అర్హత గల వారు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్క అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తప్పా.. పంచాయతీ ఎన్నికల జరుగుతున్నందున యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం తప్పా ఓటు నమోదు గురించి అవగాహనలు చేపట్టిన సంఘటనలు కన్పించలేదు. పోలింగ్ కేంద్రాల వారీగా నమోదుకు దరఖాస్తులు స్వీకరించడం, ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో ఫారాలు అందుబాటులో ఉండడం, ఆన్లైన్ ద్వారా వెసులుబాటు కల్పించడంతో చాలామంది నమోదుకు అభ్యర్థించడంతో ఈసారి నమోదుకు కలిసివచ్చిందని చెప్పవచ్చు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు గల్లంతైన విషయం తెలిసిందే. అర్హత ఉండి గల్లంతైన వారిని నమోదు చేయడంతోపాటు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం కూడా భారీ స్పందనకు కారణమైంది. -
పోటెత్తాయ్...
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : కొత్త ఓటర్లుగా నమోదు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువు మంగళవారం ముగిసింది. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి అధికారులు విశేష ప్రచారం చేసినా అంతంత మాత్రంగానే స్పందంగా ఉండగా.. చివరి రోజు మాత్రం దరఖాస్తుదారులు అనూహ్యమైన స్పందన వచ్చింది. నిర్ణీత గడువులోపు మంగళవారం నాటికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 60 వేలకు పైగా కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయి తే చివరిరోజు ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో ఒక్కసారిగా రావడంతో సర్వర్ సమస్య తలెత్తింది. ఫలితంగా కేంద్రాలు కిటకిటలాడగా సర్వర్ బిజీగా మారింది. దీంతో చాలా మంది కొత్త ఓటర్లు దరఖాస్తులు సమర్పించలేకపోయారు. అయితే, చాలా మంది స్వయంగా దరఖాస్తులు సమర్పించగా.. చేర్పులు, మార్పుల కోసం పెద్దసంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 10నుంచి ఓటరు జాబితాలో పేరు నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులతో పాటు, అభ్యంతరాల నమోదుకు ఈ నెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని స్కూళ్లు, కాలేజీలు, గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చాలా బూత్‌ల్లో బీఎల్ఓలు అందుబాటులో లేకపోవడం కారణంగా ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు చేసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. స్వయంగా దరఖాస్తులు సమర్పించినప్పటికీ వాటిని గడువులోపు ఆన్లైన్లో నమోదు చేయలేదని తెలుస్తోంది. మ్యాన్యువల్ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించే విషయంలో స్పష్టత రా లేదు. కాగా కొన్ని చోట్ల ఓటరు నమోదు దరఖాస్తులు ఫారం–6 అందుబాటులో లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమైంది. ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధికార యం త్రాంగం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యం త్రాంగం నిత్యం సమావేశాలు, ఓటరు నమోదు క్యాంపెయిన్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్ మంగళవారంతో ముగియడంతో జిల్లా అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నోడల్ అధికారులను నియమించారు. ఈ సందర్భంగా వారితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వచ్చే అవకాశమున్నందున సమర్దవంతంగా విధులు నిర్వహించేందుకు సిద్దం కావాలని సూచించారు. కాల్‌సెంటర్ ద్వారా సందేహాల నివృత్తి ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల విభాగం, కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఓటరు జాబితాలో పేర్లు, ఇతర సందేహాల నివృత్తి చేసుకునేందుకు కాల్‌సెంటర్ ఫోన్ నంబర్ 08542–241165, టోల్‌ఫ్రీ నంబర్ 180018011950 కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే వెసలుబాటు కల్పించారు. ఎన్నికల మూడ్‌లోకి.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గత 20 రోజులుగా జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈ నెల 10వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసిన అనంతరం జిల్లా యంత్రాంగం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పాత ఈవీఎంలను పంపించగా, ఈనెల 18న ఎన్నికల కమిషన్ నుండి జిల్లాకు కొత్త ఈవీఎంలు, వీవీప్యాట్లు వచ్చాయి. వీటికి ఫస్ట్‌లెవెల్ చెకింగ్‌తో పాటు రాజకీయ పార్టీలకు æపనితీరుపై అవగాహన కల్పించారు. ఈ నెల 10 నుండి మంగళవారం వరకు ఓటరు నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా.. నిత్యం సమావేశాలను నిర్వహిస్తూ అధికారులకు ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేస్తున్నారు. నోడల్ ఆఫీసర్ల నియామకం ఎన్నికల విధులు సమర్దవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నోడల్ ఆఫీసర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వచ్చే అవకాశమున్నందున సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణపై శిక్షణను ప్రతీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నోడల్ ఆఫీసర్లకు సూచించారు. ఈనెల 26న ఉదయం మహబూబ్‌నగర్‌లో, మధ్యాహ్నం జడ్చర్ల, 27న ఉదయం దేవరకద్ర, మధ్యాహ్నం నారాయణపేట, 28న ఉదయం మరికల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. నోడల్ అధికారులు సిబ్బందితో సమన్వ యం చేసుకుంటూ విధులు సమర్దవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జేసీ వెంక ట్రావు, వివిధ అధికారులు పాల్గొన్నారు. -
పట్టభద్రులు అంతంతే
సాక్షి, మహబూబ్‌నగర్: పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగుతోంది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం గతనెల 26వ తేదీ నుంచి ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓటరుగా నమోదు కా ర్యక్రమం నెలరోజులుగా సాగుతున్నా.. ఒకసారి గడువు పెంచినప్పటికీ పట్టభద్రుల నుంచి అంతగా స్పందన కనిపిం చడం లేదు. తాజాగా నేటి(మంగళవారం)తో గడువు ముగియనుంది. అయినప్పటికీ జిల్లాలో పట్టభద్రుల నమోదు కార్యక్రమం చాలా పేలవంగా సాగింది. జిల్లాలో ఇప్పటివరకు 11,686 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటిలో కేవలం 2,563 మాత్రమే ఓటర్లుగా నమోదయ్యాయి. ఇలా జిల్లాలో 41,674 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా జిల్లాలోనే.. పట్టభద్రుల ఓటరు నమోదులో జిల్లా నుంచే అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ మూడు జిల్లాలకు కలిపి 57,816 దరఖాస్తులు రాగా, అత్యధికంగా హైదరాబాద్ నుంచి 26,376 దరఖాస్తులొచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 19,754 దరఖాస్తులు వచ్చాయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కేవలం 11,686 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఏటా జిల్లా నుంచి 10వేల మంది డిగ్రీ చదువును పూర్తిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంత లేదన్నా ఓటరు నమోదుకు 30వేలకు తగ్గకుండా దరఖాస్తులు వస్తాయని భావించిన నేపథ్యంలో కేవలం 11వేలు మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద జిల్లాలో 41,674 మంది మాత్రమే పట్టభద్రులుగా నమోదవడాన్ని బట్టి చూస్తే జిల్లాలో గ్రాడ్యుయేట్లు ఇంతేమందా? అనే సందేహం కలుగుతుంది. అదే విధంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో లక్ష మందికి పైగా పట్టభద్రులుగా నమోదయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో మాత్రం కేవలం 41వేలు మాత్రమే పట్టభద్రులుగా ఉన్నారు. అభ్యర్థుల ప్రచారం ముమ్మరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కార్యక్రమ ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతున్నా..అభ్యర్థుల ప్రచారం మాత్రం ముమ్మరం చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్.రాంచందర్‌రావు, ఉపాధ్యాయ సంఘాల నుంచి పీఆర్టీయూ అభ్యర్థిగా వెంకట్‌రెడ్డి, టీపీఆర్టీయూ నుంచి హర్షవర్ధన్‌రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. తమ అనుమాయులతో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. -
పట్టభద్రుల జాడేదీ..?
* ఓటరుగా నమోదుకు ఆసక్తి చూపని గ్రాడ్యుయేట్లు * కాలేజీలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు లేఖలు రాసిన ఎన్నికల సంఘం నల్లగొండ: పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నామమాత్రంగానే కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించేదుకుగాను గత నెల 26 నుంచి కొత్తగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఓటరుగా నమోదుకు ఈ నెల 16వ తేదీ చివరి గడువు. అయితే రాజకీయపార్టీలు గడువు పెంచాలంటూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఓటరు నమోదు ప్రారంభమైననాటినుంచి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే మూడు జిల్లాల్లో కలిపి కేవలం 9,415 దరఖాస్తులు మాత్రమే అధికారులకు చేరాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 4,784 దరఖాస్తులు రాగా, ఆ తర్వాతిస్థానంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. మన జిల్లాలో ఓటరు నమోదు తీరును పరిశీలిస్తే...పట్టణాల్లోనే ఎక్కువ శాతం దరఖాస్తులు వచ్చాయి. మండలాల్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు గ్రాడ్యుయేట్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. అత్యధికంగా నల్లగొండ పట్టణంలో 650 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట 398, మిర్యాలగూడ 375, భువనగిరి 317, కోదాడ 159, హుజూర్నగర్ 135, దేవరకొండ 105 దరఖాస్తులు వచ్చాయి. ఇక మండలాల్లో అత్యధికంగా మునగాల 106, నార్కట్‌పల్లి 95, తుంగతుర్తి 98, అత్యల్పంగా డిండి మండలంలో 16, గుండాల 15, శాలిగౌరారం మండలంలో 15 దరఖాస్తులు వచ్చాయి. నగరాల్లోనే నివాసం... మారుమూల మండలాలు, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాల్లో ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో కావడం లేదు. ఉద్యోగం, వ్యాపారం, చదువులరీత్యా ఎక్కువ శాతం గ్రాడ్యుయేట్లు నగరాల్లోనే ఉంటున్నారు. దీంతో ఓటరు నమోదు శాతం పెరగడం లేదు. అయితే ఎన్నికల సంఘం దీనిని దృష్టిలో పెట్టుకుని కాలేజీలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు లేఖలు రాసింది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్లు అయిన ఉద్యోగులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగాని పక్షంలో ...అందరి దరఖాస్తులను ఒక్కరే తీసుకుని సంబంధిత త హసీల్దారు కార్యాలయంలో లేదా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సమర్పించే అవకాశం కల్పించారు. పోటీపోటీగా ప్రచారం.. ఓటరు నమోదు షెడ్యూల్ కంటే ముందుగానే గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సంఘాలు ఓటరు నమోదుకు తెరతీశాయి. ప్రచారం నిర్వహించడంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. అధికారికంగా అభ్యర్థి పేరు ఖరారు కాకపోయినప్పటికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్రావు పేరును ప్రకటించారు. ఇటీవలే ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. కానీ ఓటరు నమోదు కార్యక్రమంలో ఈ రెండు పార్టీలు సమష్టిగా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇతర రాజకీయపక్షాలు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఓటరు నమోదు గడువు ముగింపు దగ్గరపడుతున్న తరుణంలో ఈ పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాకపోవడం పట్ల రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అదీగాక ఇదే పద్ధతిలో ఓటరు నమోదు కొనసాగితే రాజకీయ పార్టీలకు ఇబ్బందులు తప్పవు. -
ఓటరుకు తప్పని తిప్పలు
ఆలస్యంగా వచ్చిన బీఎల్ఓలు ఒకటి రెండుచోట్ల విధులకు గైర్హాజరు ఓటరు నమోదుకు ఫారం తెచ్చుకోవాల్సిందే ప్రత్యేక ఓటరు నమోదులో ప్రజల కష్టాలు ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలోనూ బూత్ లెవల్ ఆఫీసర్లు ఓటరుకు చుక్కలు చూపించారు. అధికారులు అనేకమార్లు ఆదేశాలు జారీ చేసినా కొంతమంది బూత్ లెవల్ ఆఫీసర్ల పనితీరు మారడం లేదు. దీంతో ఓటు హక్కు కోసం వచ్చినవారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన ఓటర్ల నమోదుకు తీసిపోని విధంగా తాజాగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదులోనూ అదే నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే అనేక పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక మారుమూల ప్రాంతాల్లో ఎలా జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాలకు సకాలంలో బూత్ లెవల్ ఆఫీసర్లు రాకపోవడంతో పక్కనే ఉన్న ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని కృష్ణ మెమోరియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ లెవల్ ఆఫీసర్ గైర్హాజరయ్యారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు మండిపడ్డారు. ఓటు హక్కు కోసం ఇప్పటికే అనేకమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఓటు హక్కు రాలేదని, చివరిసారిగా జరుగుతున్న ఓటర్ల నమోదులోనైనా న్యాయం జరుగుతుందని ఇక్కడకు వస్తే బూత్ లెవల్ ఆఫీసర్ ఆచూకీ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పక్కనే ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో హడావుడిగా మరొకరిని నియమించారు. ఒంగోలులోని మంగమూరుడొంక, కొప్పోలు వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఫుల్.. ఇక్కడ నిల్... ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, గతంలో పేర్లు ఉండి తొలగించినవారు నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్దనే ఓటు నమోదుకు సంబంధించిన ఫారం-6తో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారన్న జిల్లా అధికారుల ప్రకటనలు కాగితాలకే పరిమిత మయ్యాయి. ఒంగోలు నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫారం-6 కొరత కొట్టొచ్చినట్లు కనిపించింది. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను చూసుకోవడం, అందులో తమ పేర్లు లేకపోవడంతో ఓటు హక్కు నమోదుకు ఫారాలు ఇవ్వాలని కోరితే బూత్ లెవల్ ఆఫీసర్లు చేతులెత్తేశారు. తమవద్ద ఒక్క ఫారం ఉందని, జిరాక్స్ తీయించుకొని రావాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఒకవైపు సమయం గడిచిపోతుండటం, ఇంకోవైపు సమీప ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు లేకపోవడం, ఉన్నా అవి మూసివేయడంతో ప్రజలు జిరాక్స్ కాపీల కోసం పరుగులు పెట్టారు. ఫారం-6కు నిజంగా కొరత వచ్చిందనుకుంటే పొరబడినట్లే. కలెక్టరేట్లోని హెచ్-సెక్షన్ ముందు గుట్టలు గుట్టలుగా ఫారం-6 పడి ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయకపోవడం వల్లనే సమస్యలు తలెత్తాయి. గతంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదులో ఇదే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో ఓటరుగా చేరాలనుకునేవారికి తిప్పలు తప్పలేదు. ఒంగోలులోని మంగమూరుడొంకలో నివాసం ఉంటున్న తుళ్లూరు ఉదయలక్ష్మి అనే 70 ఏళ్ల బామ్మకు ఓటు లేకుండా చేశారు. అనేక ఎన్నికల్లో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఆమె పేరు తొలగించారు. ఓటు హక్కు పునరుద్ధరణకు కుమార్తె సాయంతో ఆ బామ్మ ఒంగోలులోని ఉమామహేశ్వర జూనియర్ కాలేజీలోని పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఓటు హక్కు కోసం ఉద్యోగస్తుడు ఎన్నిసార్లు తిరగాలని సాంబశివనగర్కు చెందిన రాచమళ్ల రామచంద్రారెడ్డి వాపోయాడు. పొగాకు బోర్డులో ఉద్యోగం చేస్తున్న ఆయన నాలుగేళ్ల క్రితం కందుకూరు నుంచి ఒంగోలుకు బదిలీ అయ్యారు. గత ఏడాది నవంబర్ 12వ తేదీ ఓటు కోసం భార్యాభర్తలిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం తో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ జరిగిన ప్రజాదర్భార్‌లో కలెక్టర్‌ను కలిసి స్వయంగా ఫిర్యా దు చేశారు. అయినా ఇంతవరకు ఓటు హక్కు పొందలేదు. చివరి ప్రయత్నంగా మరోమారు భార్యాభర్తలిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. నా భార్య ఓటును తొలగించారు: హరిప్రసాదరావు, గద్దలగుంట, ఒంగోలు మా కుటుంబంలో మూడు ఓట్లున్నాయి. నా భార్య ఓటును జాబితా నుంచి తొలగించారు. బూత్ లెవల్ ఆఫీసర్లను అడిగితే తమకు తెలియదంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేస్తే ఆధారాలు ఇవ్వలేదని మెసేజ్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్న మాకు ఆధారాలతో ఏం సంబంధం. ఉప ఎన్నికలో ఓటు వేసినా జాబితాలో పేరులేదు: బాలాజీనాయక్, గద్దలగుంట, ఒంగోలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓటు వేశాను. ఆ తరువాత ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో చూసుకుంటే పేరు తొలగించారు. మా కుటుంబంలో పదకొండు ఓట్లు ఉన్నాయి. అక్రమంగా నా ఓటు తొలగించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా విచారించలేదు. చదువుకున్న మమ్మల్నే ఇబ్బందిపెడితే నిరక్షరాస్యుల పరిస్థితి ఏమిటి. ఇరవై ఏళ్ల నుంచి ఓటు హక్కు కోసం తిరుగుతున్నా : ఆంజనేయులు, లాయరుపేట, ఒంగోలు ఓటు హక్కు కోసం ఇరవై ఏళ్ల నుంచి తిరుగుతున్నా. ఇంతవరకు ఓటరుగా గుర్తించలేదు. ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన ప్రతిసారీ అన్నిరకాల గుర్తింపు కార్డులను తీసుకొస్తున్నా. ఓటర్ల జాబితాలో మాత్రం పేరు ఉండటం లేదు. ఓటు హక్కు అంటేనే విసుగొచ్చేలా చేశారు. చివరి ప్రయత్నంగా మరోమారు దరఖాస్తు చేసుకున్నా. వస్తుందో రాదో ఎదురు చూడాలి. అకనాలెడ్జ్మెంట్ ఉన్నా ఓటు హక్కులేదు: వెంకట్రావు, లాయరుపేట, ఒంగోలు రెండేళ్ల నుంచి ఓటు హక్కు కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా. అకనాలెడ్జ్మెంట్ ఇచ్చారుగానీ ఓటరు గుర్తింపు కార్డు అందలేదు. భార్యాభర్తలిద్దరికీ ఓటరు గుర్తింపు కార్డులు రాలేదు. దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ ఎలాంటి విచారణ చేయలేదు. విచారించకుండానే అనర్హులుగా తేల్చేస్తున్నారు. ఓటరు నమోదు ఫారానికి ఒక్కోదానికి ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు.