ఆలస్యంగా వచ్చిన బీఎల్‌ఓలు
ఒకటి రెండుచోట్ల విధులకు గైర్హాజరు
ఓటరు నమోదుకు ఫారం తెచ్చుకోవాల్సిందే
ప్రత్యేక ఓటరు నమోదులో ప్రజల కష్టాలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలోనూ బూత్ లెవల్ ఆఫీసర్లు ఓటరుకు చుక్కలు చూపించారు. అధికారులు అనేకమార్లు ఆదేశాలు జారీ చేసినా కొంతమంది బూత్ లెవల్ ఆఫీసర్ల పనితీరు మారడం లేదు. దీంతో ఓటు హక్కు కోసం వచ్చినవారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన ఓటర్ల నమోదుకు తీసిపోని విధంగా తాజాగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదులోనూ అదే నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే అనేక పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక మారుమూల ప్రాంతాల్లో ఎలా జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాలకు సకాలంలో బూత్ లెవల్ ఆఫీసర్లు రాకపోవడంతో పక్కనే ఉన్న ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని కృష్ణ మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ లెవల్ ఆఫీసర్ గైర్హాజరయ్యారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు మండిపడ్డారు. ఓటు హక్కు కోసం ఇప్పటికే అనేకమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఓటు హక్కు రాలేదని, చివరిసారిగా జరుగుతున్న ఓటర్ల నమోదులోనైనా న్యాయం జరుగుతుందని ఇక్కడకు వస్తే బూత్ లెవల్ ఆఫీసర్ ఆచూకీ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పక్కనే ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో హడావుడిగా మరొకరిని నియమించారు. ఒంగోలులోని మంగమూరుడొంక, కొప్పోలు వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
అక్కడ ఫుల్.. ఇక్కడ నిల్...
ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, గతంలో పేర్లు ఉండి తొలగించినవారు నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్దనే ఓటు నమోదుకు సంబంధించిన ఫారం-6తో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారన్న జిల్లా అధికారుల ప్రకటనలు కాగితాలకే పరిమిత మయ్యాయి. ఒంగోలు నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫారం-6 కొరత కొట్టొచ్చినట్లు కనిపించింది. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను చూసుకోవడం, అందులో తమ పేర్లు లేకపోవడంతో ఓటు హక్కు నమోదుకు ఫారాలు ఇవ్వాలని కోరితే బూత్ లెవల్ ఆఫీసర్లు చేతులెత్తేశారు. తమవద్ద ఒక్క ఫారం ఉందని, జిరాక్స్ తీయించుకొని రావాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఒకవైపు సమయం గడిచిపోతుండటం, ఇంకోవైపు సమీప ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు లేకపోవడం, ఉన్నా అవి మూసివేయడంతో ప్రజలు జిరాక్స్ కాపీల కోసం పరుగులు పెట్టారు. ఫారం-6కు నిజంగా కొరత వచ్చిందనుకుంటే పొరబడినట్లే. కలెక్టరేట్‌లోని హెచ్-సెక్షన్ ముందు గుట్టలు గుట్టలుగా ఫారం-6 పడి ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయకపోవడం వల్లనే సమస్యలు తలెత్తాయి. గతంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదులో ఇదే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో ఓటరుగా చేరాలనుకునేవారికి తిప్పలు తప్పలేదు.
ఒంగోలులోని మంగమూరుడొంకలో నివాసం ఉంటున్న తుళ్లూరు ఉదయలక్ష్మి అనే 70 ఏళ్ల బామ్మకు ఓటు లేకుండా చేశారు. అనేక ఎన్నికల్లో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఆమె పేరు తొలగించారు. ఓటు హక్కు పునరుద్ధరణకు కుమార్తె సాయంతో ఆ బామ్మ ఒంగోలులోని ఉమామహేశ్వర జూనియర్ కాలేజీలోని పోలింగ్ కేంద్రానికి వచ్చింది.
ఓటు హక్కు కోసం ఉద్యోగస్తుడు ఎన్నిసార్లు తిరగాలని సాంబశివనగర్‌కు చెందిన రాచమళ్ల రామచంద్రారెడ్డి వాపోయాడు. పొగాకు బోర్డులో ఉద్యోగం చేస్తున్న ఆయన నాలుగేళ్ల క్రితం కందుకూరు నుంచి ఒంగోలుకు బదిలీ అయ్యారు. గత ఏడాది నవంబర్ 12వ తేదీ ఓటు కోసం భార్యాభర్తలిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం తో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ జరిగిన ప్రజాదర్భార్‌లో కలెక్టర్‌ను కలిసి స్వయంగా ఫిర్యా దు చేశారు. అయినా ఇంతవరకు ఓటు హక్కు పొందలేదు. చివరి ప్రయత్నంగా మరోమారు భార్యాభర్తలిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు.
నా భార్య ఓటును తొలగించారు: హరిప్రసాదరావు, గద్దలగుంట, ఒంగోలు
మా కుటుంబంలో మూడు ఓట్లున్నాయి. నా భార్య ఓటును జాబితా నుంచి తొలగించారు. బూత్ లెవల్ ఆఫీసర్లను అడిగితే తమకు తెలియదంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేస్తే ఆధారాలు ఇవ్వలేదని మెసేజ్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్న మాకు ఆధారాలతో ఏం సంబంధం.
ఉప ఎన్నికలో ఓటు వేసినా జాబితాలో పేరులేదు: బాలాజీనాయక్, గద్దలగుంట, ఒంగోలు
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓటు వేశాను. ఆ తరువాత ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో చూసుకుంటే పేరు తొలగించారు. మా కుటుంబంలో పదకొండు ఓట్లు ఉన్నాయి. అక్రమంగా నా ఓటు తొలగించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా విచారించలేదు. చదువుకున్న మమ్మల్నే ఇబ్బందిపెడితే నిరక్షరాస్యుల పరిస్థితి ఏమిటి.
ఇరవై ఏళ్ల నుంచి ఓటు హక్కు కోసం
తిరుగుతున్నా : ఆంజనేయులు,
లాయరుపేట, ఒంగోలు
ఓటు హక్కు కోసం ఇరవై ఏళ్ల నుంచి తిరుగుతున్నా. ఇంతవరకు ఓటరుగా గుర్తించలేదు. ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన ప్రతిసారీ అన్నిరకాల గుర్తింపు కార్డులను తీసుకొస్తున్నా. ఓటర్ల జాబితాలో మాత్రం పేరు ఉండటం లేదు. ఓటు హక్కు అంటేనే విసుగొచ్చేలా చేశారు. చివరి ప్రయత్నంగా మరోమారు దరఖాస్తు చేసుకున్నా. వస్తుందో రాదో ఎదురు చూడాలి.
అకనాలెడ్జ్‌మెంట్ ఉన్నా ఓటు హక్కులేదు: వెంకట్రావు, లాయరుపేట, ఒంగోలు
రెండేళ్ల నుంచి ఓటు హక్కు కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా. అకనాలెడ్జ్‌మెంట్ ఇచ్చారుగానీ ఓటరు గుర్తింపు కార్డు అందలేదు. భార్యాభర్తలిద్దరికీ ఓటరు గుర్తింపు కార్డులు రాలేదు. దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ ఎలాంటి విచారణ చేయలేదు. విచారించకుండానే అనర్హులుగా తేల్చేస్తున్నారు. ఓటరు నమోదు ఫారానికి ఒక్కోదానికి ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు.
ఓటరుకు తప్పని తిప్పలు
Published Mon, Mar 10 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
Advertisement
Advertisement