ఒంగోలు, న్యూస్‌లైన్, స్థానిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ఆదివారం జరగనుంది. జిల్లాలోని మొత్తం 56 మండలాలకు 28 మండలాల్లో 385 ఎంపీటీసీ, 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీ బరిలో మొత్తం 1056 మంది, జెడ్పీటీసీ బరిలో మొత్తం 111 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. 10,21,189 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
ఈమేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. తొలి దశ కింద చీరాల, పర్చూరు, అద్దంకి, మార్కాపురం, గిద్దలూరు, వై.పాలెం నియోజకవర్గాలలోని 28 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీ బరిలో వైఎస్సార్‌సీపీ తరఫున 389, బీఎస్పీ 6, బీజేపీ 4, సీపీఐ 12, సీపీఎం 12, కాంగ్రెస్ 25, టీడీపీ 382, స్వతంత్రులు 226తోపాటు మొత్తం 1056 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జెడ్పీటీసీ బరిలో వైఎస్సార్‌సీపీ తరఫున 28, బీఎస్పీ 2, బీజేపీ 2, సీపీఐ 1, సీపీఎం 2, కాంగ్రెస్ 8, టీడీపీ 27, లోక్‌సత్తా 1, స్వతంత్రులు 40 మందితో కలిపి మొత్తం 111 మంది బరిలో ఉన్నారు.
అభివృద్ధి ప్రదాతకు పట్టం కట్టేందుకు సిద్ధం...
జిల్లాలో తొలిదశ ప్రాదేశిక ఎన్నికలు జరుగుతున్న 28 మండలాల్లో అభివృద్ధి ప్రదాతకే పట్టం కట్టేందుకు ఓటర్లు సంసిద్ధులయ్యారు.
రాష్ట్ర విభజనతో సంక్షోభానికి కారకులైన వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
2001లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 15 జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోవున్న సమయంలో కాంగ్రెస్‌పై ఈ ప్రాంత ప్రజలు ఎనలేని ఆదరణ కనబరిచారు.
28 స్థానాల్లో 25 జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా కేవలం 3 స్థానాలు మాత్రమే టీడీపీకి దక్కాయి. ప్రస్తుతం పరిస్థితి మారింది.సమైక్యాంధ్ర ఉద్యమంలో జిల్లా ప్రజలు వైఎస్సార్ సీపీ వెన్నంటి నడిచారు.విభజనకు వ్యతిరేకంగా నినదించారు. ఆందోళనలు చేపట్టారు.ఇతర పార్టీల నేతలు మొక్కుబడి దీక్షల పేరుతో కాలక్షేపం చేశారు. జనం తోడుగా గొంతు విప్పలేకపోయారు.
ఉద్యోగ, కార్మిక, కర్షక, శ్రామిక, ఉపాధ్యాయ రంగాల్లోని వారిలో అత్యధిక శాతం సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీతో కలిసి పోరాడారు. తమతో కలిసి వస్తేనే భవిష్యత్తని, లేకుంటే రాజకీయ సమాధి కాక తప్పదని హెచ్చరించారు.
పదవిపై ఉన్న వ్యామోహంతో కొందరు నేతలు వ్యవహరించిన తీరు జనం మదిలో భగ్గుమంటోంది. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని నాయకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని..ఈ ఎన్నికల్లో వారికి సరైన గుణపాఠం చెబుతామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.ఓటర్లను ఎలాగైనా తమవైపు తిప్పుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కుల రాజకీయాలకు తెరలేపారు.
డబ్బు, మద్యం యథేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు.ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా..అభివృద్ధి చేసేది ఎవరో, అభివృద్ధి చేస్తామంటూ మోసపూరిత ప్రకటనలిచ్చేదెవరో తమకు స్పష్టంగా తెలుసని, తమ తీర్పు ద్వారా అభివృద్ధి ప్రదాతలకు పట్టం కడతామని చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల తొలిదశ పోలింగ్
Published Sun, Apr 6 2014 1:47 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement