ఒంగోలు కలెక్టరేట్/సెంట్రల్, న్యూస్‌లైన్ : ఓటర్లంతా ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయకుమార్ సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులంతా వినియోగించుకోవాలని, నూరుశాతం ఓటింగ్ జరిపి సమర్థులైన పాలకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. స్వీప్ ఆధ్వర్యంలో స్థానిక చర్చిసెంటర్‌లో పొదుపు సంఘాల సభ్యులతో శనివారం ఓటుహక్కుపై చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పొదుపు సంఘాల మహిళలు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి చర్చి సెంటర్‌కు చేరుకున్నారు.
జిల్లా ఎన్నికల అధికారి విజయకుమార్ వారిచేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పొదుపు సంఘాల సభ్యులంతా మానవహారంగా ఏర్పడి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ నినాదాలు చేశారు. నగరంలోని వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లంతా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కుపై ఓటర్లలో చైతన్యం కోసం జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలే పాలన సాగించాలన్నారు. అలాంటి పరిపాలన కోసం అర్హులంతా ఓటువేసి ప్రపంచ వ్యాప్తంగా దేశానికి వన్నె తీసుకురావాలని విజయకుమార్ కోరారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, స్టెప్ సీఈఓ బీ రవి, ఒంగోలు ఆర్డీవో ఎంఎస్ మురళి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సీహెచ్ విజయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి, మెప్మా పీడీ కమలకుమారి పాల్గొన్నారు.
ఓటు వేయడం బాధ్యత
Published Sun, May 4 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement