పట్టభద్రుల జాడేదీ..?
* ఓటరుగా నమోదుకు ఆసక్తి చూపని గ్రాడ్యుయేట్లు
* కాలేజీలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు లేఖలు రాసిన ఎన్నికల సంఘం
నల్లగొండ: పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నామమాత్రంగానే కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించేదుకుగాను గత నెల 26 నుంచి కొత్తగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఓటరుగా నమోదుకు ఈ నెల 16వ తేదీ చివరి గడువు. అయితే రాజకీయపార్టీలు గడువు పెంచాలంటూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఓటరు నమోదు ప్రారంభమైననాటినుంచి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే మూడు జిల్లాల్లో కలిపి కేవలం 9,415 దరఖాస్తులు మాత్రమే అధికారులకు చేరాయి.
వీటిలో నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 4,784 దరఖాస్తులు రాగా, ఆ తర్వాతిస్థానంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. మన జిల్లాలో ఓటరు నమోదు తీరును పరిశీలిస్తే...పట్టణాల్లోనే ఎక్కువ శాతం దరఖాస్తులు వచ్చాయి. మండలాల్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు గ్రాడ్యుయేట్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. అత్యధికంగా నల్లగొండ పట్టణంలో 650 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట 398, మిర్యాలగూడ 375, భువనగిరి 317, కోదాడ 159, హుజూర్‌నగర్ 135, దేవరకొండ 105 దరఖాస్తులు వచ్చాయి. ఇక మండలాల్లో అత్యధికంగా మునగాల 106, నార్కట్‌పల్లి 95, తుంగతుర్తి 98, అత్యల్పంగా డిండి మండలంలో 16, గుండాల 15, శాలిగౌరారం మండలంలో 15 దరఖాస్తులు వచ్చాయి.
నగరాల్లోనే నివాసం...
మారుమూల మండలాలు, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాల్లో ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో కావడం లేదు. ఉద్యోగం, వ్యాపారం, చదువులరీత్యా ఎక్కువ శాతం గ్రాడ్యుయేట్లు నగరాల్లోనే ఉంటున్నారు. దీంతో ఓటరు నమోదు శాతం పెరగడం లేదు. అయితే ఎన్నికల సంఘం దీనిని దృష్టిలో పెట్టుకుని కాలేజీలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు లేఖలు రాసింది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్లు అయిన ఉద్యోగులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగాని పక్షంలో ...అందరి దరఖాస్తులను ఒక్కరే తీసుకుని సంబంధిత త హసీల్దారు కార్యాలయంలో లేదా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సమర్పించే అవకాశం కల్పించారు.
పోటీపోటీగా ప్రచారం..
ఓటరు నమోదు షెడ్యూల్ కంటే ముందుగానే గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సంఘాలు ఓటరు నమోదుకు తెరతీశాయి. ప్రచారం నిర్వహించడంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ముందంజలో ఉంది. అధికారికంగా అభ్యర్థి పేరు ఖరారు కాకపోయినప్పటికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు పేరును ప్రకటించారు. ఇటీవలే ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. కానీ ఓటరు నమోదు కార్యక్రమంలో ఈ రెండు పార్టీలు సమష్టిగా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇతర రాజకీయపక్షాలు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఓటరు నమోదు గడువు ముగింపు దగ్గరపడుతున్న తరుణంలో ఈ పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాకపోవడం పట్ల రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అదీగాక ఇదే పద్ధతిలో ఓటరు నమోదు కొనసాగితే రాజకీయ పార్టీలకు ఇబ్బందులు తప్పవు.