voterlist
-
కులాలు తారుమారు!
సాక్షి, కోల్‌సిటీ/జ్యోతినగర్(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ కోసం అధికారులు చేపట్టిన కుల గణన సర్వేలో మళ్లీ తప్పులుదొర్లాయి. సోమవారం అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శనకు పెట్టారు. జాబితాలో డివిజన్ల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను సామాజిక వర్గాలవారీగా ప్రదర్శనకు పెట్టారు. మంగళవారం జాబితాను పరిశీలించిన పలువురు ఖంగుతిన్నారు. ఓటర్ల కులాలను తప్పులతడకగా నమోదు చేసిన అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా డివిజన్లలో సామాజిక వర్గాలను గుర్తించడానికి అధికారులు మొక్కుబడిగా సర్వే చేపట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక సామాజిక కులానికి చెందిన వ్యక్తిని, మరో సామాజిక కులం వ్యక్తిగా తప్పుగా నిర్ధారిస్తూ ఓటర్ల ముసాయిదా జాబితాలో పొందుపర్చడం గమనార్హం. గత జూలైలో కూడా అధికారులు ఓటర్ల సామాజిక వర్గాలను గుర్తించడంలో తప్పులు దొర్లాయని ఆయా సామాజిక వర్గాలకు వారు ఫిర్యాదులు చేశారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి కొత్త జాబితా రూపొందించినట్లు చెబుతున్న అధికారులు, సోమవారం విడుదల చేసిన ఓటర్ల ముసాయిదాలో కూడా తప్పులు దొర్లడంతో చర్చనీయాశంగా మారింది. అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేయకుండా... ఒకే దగ్గర కూర్చొని తప్పులతడకగా జాబితా తయారు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. సామాజిక వర్గాల గుర్తింపులో అయోమయం... ఓటర్ల సామాజిక వర్గాల గుర్తింపులో అయోమయం, గందరగోళం నెలకొంది. పలు డివిజన్‌కు చెందిన బీసీలను ఎస్సీలు, ఎస్టీలుగా నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీసీ సామాజిక వర్గానికి ఓల్లాది ఓదెలు అనే వ్యక్తితోపాటు అతని కుటుంబ సభ్యులను ఎస్టీ సామాజిక వర్గంగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన బత్తుల భరత్ అనే యువకునితోపాటు అతని కుటుంబ సభ్యులను ఎస్సీలుగా జాబితాలో పొందుపరిచారు. మరో ఓసీ సామాజికవర్గానికి చెందిన కుటుంబ సభ్యులను బీసీలుగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను బీసీలుగా మార్చారు. ఒకే కుటుంబంలో ఒకరిని బీసీలుగా, ఇంకొకరిని ఎస్సీలు జాబితాలో పొందుపరిచారు. హిందూ పేరుతో ఓటర్లు! కొత్తగా ఏర్పడిన మూడో డివిజన్లోని ఓటరు ఐడీ నంబర్లు ఆర్కేకే2238285, ఆర్కేకే2240877, ఆర్కేకే2247336, ఆర్కేకే2240836 ఐడీలలో ఓటరు పేరు ముద్రితం కాకుండా హిందూ హిందూ అని ముద్రితమైంది. ఒకే ఇంటి నంబరులో ఉన్న ఇద్దరు ఓటర్లకు మూడేసి ఓట్లు ఉన్నట్లు వాటికి మూడు రకాల ఐడీ నంబర్లు సైతం ఉన్నాయి. దీంతో ఓటరు జాబితాను తయారు చేసిన తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి ఓటరు సర్వే చేసిన వారు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరికి మూడు ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఓటరు తుది జాబితా వచ్చే లోపు సవరణలు చేపట్టి కచ్చితమైన ఓటరు జాబితాను తయారు చేయాలని పలువురు కోరుతున్నారు.. పురుషులు.. మహిళలుగా.. కోల్‌సిటీ(రామగుండం): ఈ ఓటరు స్లిప్పై పేరున్న వ్యక్తి కానుగంటి శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గోదావరిఖనిలో ఉంటాడు. ఇతని పేరు, ఫొటోను చూసి కూడా పురుషుడు అని గుర్తించని ఉద్యోగులు ఓటరు జాబితాలో మహిళగా తప్పుగా నమోదు చేశారు. ఇలా మహిళలను పురుషులుగా గుర్తిస్తూ ఓటరు జాబితాలో పొందుపరిచారు. రామగుండం కార్పొరేషన్లో సోమవారం విడుదల చేసిన ముసాయిదాలో చాలా మంది ఓటర్ల వివరాల నమోదులో తప్పులు దొర్లాయి. మహిళలను పురుషులుగా నమోదు చేసిన అధికారులు, పురుషులను మహిళలుగా గుర్తించారు. కొందరు ఓటర్ల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లను హిందూ అని నమోదు చేశారు. దీంతో ఓటరు జాబితా ఆధారంగా డివిజన్లలో మహిళలు, పురుషుల సంఖ్యను లెక్కించడంలో తేడాలు ఏర్పడే సమస్యలు ఉన్నాయి. మంగళవారం వీటిని గుర్తించిన బల్దియా అధికారులు, మరోసారి జాబితాను క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. పురుషుల పేర్లు, ఫొటోలను చూసి కూడా ఆడవాళ్లను మగవాళ్లుగా, పురుషులను మహిళలుగా ఓటరుగా నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. -
మళ్లీ ఓటరు గణన
సాక్షి,కల్వకుర్తి : మున్సిపల్ ఎన్నికలను జూలైలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టీకే శ్రీదేవి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటరు గణనను ప్రారంభించాలని సర్క్యూలర్ జారీ చేశారు.వచ్చే నెల 2న మున్సిపాలిటీల పాలకవర్గ పదవీకాలం పూర్తి కానుంది.దీంతో పాలకవర్గం పూర్తయిన వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు గణన పూర్తి చేసి, జాబితాను రూపొందించేలా చూడాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో.. కల్వకుర్తి మున్సిపాలిటీలలో ఓటరు గణనను ఆయా మున్సిపాలిటీ అధికారులు,సిబ్బంది ప్రారంభించారు. మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేశారు. ఆయా గ్రామాల ఓటరు గణనను కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మహిళా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓటరు గణనను చేసి, గడువులోగా మున్సిపల్ ప్రధాన కార్యాలయానికి పంపించాలని, మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ తిరిగి ఓటర్లను కులాల వారీగా గుర్తించాలని సర్కులర్లో ఉంది. అలాగే కులాల వారీగా గుర్తించిన ఓటర్ల వివరాలను మున్సిపాలిటీ పరిధిలోని రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలకు, ఆయా కార్యాలయాలలో ఓటరు జాబితాను ప్రదర్శించాలి. ఇంటింటికి తిరగకుండానే.. మున్సిపాలిటీలో గతంలో కులాల వారీగా నిర్వహించిన ఓటరు జాబితాను మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సూచించారు. అయితే మున్సిపల్ సిబ్బంది మాత్రం వారికి ఇష్టం వచ్చినట్లుగా ఇంటింటికి తిరగకుండానే, ఓటరు గణను పూర్తి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారైన మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటరు గణను నిర్వహించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ∙ఈనెల 21న మున్సిపాలిటీ పరిధిలోని బీఎల్ఓలకు ఓటరు గణనను ఎలా నిర్వహించాలనే విషయమై శిక్షణ తరగతులు. ∙22నుంచి జూలై 4వరకు ఇంటింటికీ తిరిగి కులాల వారీగా ఓటరు గణనను చేయాలి. ∙జూలై 5న కులాల వారీగా ఓటరు జాబితా తయారు చేయాలి. ∙జూలై 6న డ్రాఫ్ట్ పబ్లికేషన్ పోలింగ్ బూత్ వారీగా తయారుచేసి సంబంధిత మున్సిపల్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఓటరు జాబితాను అందజేయాలి. ∙జూలై 7 నుంచి 11వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ. ∙జూలై 12 నుంచి 14వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలి. ∙జూలై 15నుంచి 16వరకు వచ్చిన అభ్యంతరాలపై ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి, వాటిని గుర్తించాలి. ∙జూలై 17న అన్ని అభ్యంతరాల పరిశీలన తర్వాత ఓటరు జాబితాను తయారు చేయాలి. ∙జూలై 18న కులాల వారీగా ఫైనల్ ఓటరు జాబితాను తయారు చేయాలి. ∙జూలై 19న ప్రతిపాదిత ఫార్మాట్లో ఓటరు జాబితాను మున్సిపల్ ప్రధాన కార్యాలయానికి పంపించాలి. ఓటరు గణన చేపడుతున్నం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి ఆయా మున్సిపాలిటీల్లో కులాల వారీగా, మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలతో కలుపుకొని ఓటరు జాబితాను సిద్ధం చేయమని సర్క్యూలర్ వచ్చింది. కులాల వారీగా మహిళా ఓటర్లను గుర్తించి వాటికి సంబంధించిన ఓటరు గణన పూర్తి చేసి, గడువులోగా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించాలని దేశాలు వచ్చాయి. దీంతో మున్సిపాలిటీలో విలీన గ్రామాలతో పాటు, పట్టణంలో ఓటరు గణనను ప్రారంభించాం. – చింత వేణు, కమిషనర్, కల్వకుర్తి మున్సిపాలిటీ -
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ స్వల్ప మార్పు
- వచ్చే నెల 10 నాటికి ఓటర్ల జాబితా ప్రచురణ - రాజకీయ పార్టీల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ - ఓటరు జాబితాలో అభ్యర్థనలు, అభ్యంతరాలు తెలియజేయాలని సూచన కర్నూలు(టౌన్): నగరంలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని రాజకీయ పార్టీ నాయకులు నగరపాలక అధికారులు, ప్రభుత్వానికి విన్నవించిన నేపథ్యంలో సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీలు చేసిన ప్రతిపాదనలు, గడువు లేకపోవడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసింది. గత నెల 28వ తేదీన ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేశారు. మార్చి1 నుంచి 6 వ తేదీ వరకు అభ్యర్థనలు, అభ్యంతరాల పరిశీలనకు చర్యలు తీసుకున్నారు. 7వ తేదీ నుంచి 9వతేదీ వరకు బీసీ ఓటర్ల మార్కింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈ మార్పులకు సంబందించి మంగళవారం సాయంత్రం స్థానిక నగరపాలక కమిషనర్ చాంబర్లో వివిధ రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హాఫీజ్‌ఖాన్, పార్టీ పాణ్యం ఇన్చార్జీ తోట వెంకటకృష్ణా రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేర్నెకల్ సురేందర్‌రెడ్డి, పర్వేజ్ ( టీడీపీ) రాముడు (సీపీఎం), సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఓటర్ల తుది జాబితాపై సూచనలు ఇవ్వండి: నగరపాలక కమిషనర్ ఓటర్ల తుది జాబితాపై తగిన సూచనలు ఇవ్వాలని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు కోరారు. ముసాయిదా జాబితాలో తప్పొప్పులు, అభ్యంతరాలుంటే తెలియజేయాలన్నారు. ఇలాంటి వాటిని పరిశీలించి వచ్చే నెల 10వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. దీనిపై హాఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఓటర్ల సర్వే తూతూ మంత్రంగా చేపట్టడం వల్ల జాబితాలో తప్పులు దొర్లాయన్నారు. ఇంటింటికి సర్వే సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ...మరోసారి ఇలాంటి తప్పులు రాకుండా ఉంటాయన్నారు. తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ డీ లిమిటేషన్ చేస్తే వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యలో పెద్దగా మార్పులుండవన్నారు. అయితే ఇటివల జాబితాను పరిశీలిస్తే.. అనేక వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో వ్యత్యాసం ఉందన్నారు. సీపీఎం నాయకులు రాముడు మాట్లాడుతూ ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందన్నారు. వార్డుల వారీగా ఓటర్ల సంఖ్య సక్రమంగా లేదన్నారు. వీకర్‌సెక్షన్ కాలనీ వార్డులో 8 వేల ఓట్లుంటే, నరసింగరావు పేటలో 3 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో పట్టణ ప్రణాళిక అధికారులు కృష్ణకుమార్, శాస్త్రి షభ్నం, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఇశ్రాయేలు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితాలోని తప్పులను సవరించండి
–తహసీల్దార్లు, ఆర్డీఓలకు డీఆర్ఓ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): శాసన మండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను తప్పులు లేకుండా తయారు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్(వీసీ) ద్వారా ఓటర్ల జాబితాల తయారీపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జాబితాలో ఉన్న తప్పులను సరిచేయాలని, ఎలాంటి తప్పులు లేని 100 శాతం ఓటర్ల ఫొటోలతో జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, తప్పుల సవరణలపై దృష్టి సారించాలని, ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. వీసీలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, ఎన్నికల సెల్ సూపరింటెండెంటు ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితాను సరిచేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న తప్పులను ఈ నెల 22 లోపు సరిచేయాలని చీఫ్ ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఓటర్ల జాబితాలోని తప్పులు, డబుల్ ఎంట్రీలు, కచ్చితమైన ఫోటోలు, ఓటర్ వివరాలు సరిచేయడంతో పాటు డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని అన్నారు. మున్సిపాలిటీలలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బౌండరీలను పేపర్‌పై స్కెచ్ వేసుకొని గూగుల్ మ్యాప్‌కు అప్లోడ్ చేయాలని సూచించారు.కచ్చితమైన ఓటర్ వివరాలతో సెప్టెంబర్ 31 వరకు సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను ప్రకటించాలని అన్నారు. వీసీలో డిఆర్వో భాస్కర్, ఎన్ఐసీ డీఐఓ మూర్తి, ఎన్నికల విభాగం సీనియర్ సహాయకులు హనీఫ్, కృష్ణకుమార్‌లు హాజరయ్యారు.