
తిమ్మరాశిపల్లిలో ఓటరు గణనను పరిశీలిస్తున్న కమిషనర్ చింతవేణు
సాక్షి,కల్వకుర్తి : మున్సిపల్ ఎన్నికలను జూలైలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టీకే శ్రీదేవి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటరు గణనను ప్రారంభించాలని సర్క్యూలర్ జారీ చేశారు.వచ్చే నెల 2న మున్సిపాలిటీల పాలకవర్గ పదవీకాలం పూర్తి కానుంది.దీంతో పాలకవర్గం పూర్తయిన వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు గణన పూర్తి చేసి, జాబితాను రూపొందించేలా చూడాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
మున్సిపాలిటీ పరిధిలో..
కల్వకుర్తి మున్సిపాలిటీలలో ఓటరు గణనను ఆయా మున్సిపాలిటీ అధికారులు,సిబ్బంది ప్రారంభించారు. మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేశారు. ఆయా గ్రామాల ఓటరు గణనను కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మహిళా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓటరు గణనను చేసి, గడువులోగా మున్సిపల్ ప్రధాన కార్యాలయానికి పంపించాలని, మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ తిరిగి ఓటర్లను కులాల వారీగా గుర్తించాలని సర్కులర్‌లో ఉంది. అలాగే కులాల వారీగా గుర్తించిన ఓటర్ల వివరాలను మున్సిపాలిటీ పరిధిలోని రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలకు, ఆయా కార్యాలయాలలో ఓటరు జాబితాను ప్రదర్శించాలి.
ఇంటింటికి తిరగకుండానే..
మున్సిపాలిటీలో గతంలో కులాల వారీగా నిర్వహించిన ఓటరు జాబితాను మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సూచించారు. అయితే మున్సిపల్ సిబ్బంది మాత్రం వారికి ఇష్టం వచ్చినట్లుగా ఇంటింటికి తిరగకుండానే, ఓటరు గణను పూర్తి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారైన మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటరు గణను నిర్వహించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
∙ఈనెల 21న మున్సిపాలిటీ పరిధిలోని బీఎల్‌ఓలకు ఓటరు గణనను ఎలా నిర్వహించాలనే విషయమై శిక్షణ తరగతులు.
∙22నుంచి జూలై 4వరకు ఇంటింటికీ తిరిగి కులాల వారీగా ఓటరు గణనను చేయాలి.
∙జూలై 5న కులాల వారీగా ఓటరు జాబితా తయారు చేయాలి.
∙జూలై 6న డ్రాఫ్ట్ పబ్లికేషన్ పోలింగ్ బూత్ వారీగా తయారుచేసి సంబంధిత మున్సిపల్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఓటరు జాబితాను అందజేయాలి.
∙జూలై 7 నుంచి 11వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ.
∙జూలై 12 నుంచి 14వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలి.
∙జూలై 15నుంచి 16వరకు వచ్చిన అభ్యంతరాలపై ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి, వాటిని గుర్తించాలి.
∙జూలై 17న అన్ని అభ్యంతరాల పరిశీలన తర్వాత ఓటరు జాబితాను తయారు చేయాలి.
∙జూలై 18న కులాల వారీగా ఫైనల్ ఓటరు జాబితాను తయారు చేయాలి.
∙జూలై 19న ప్రతిపాదిత ఫార్మాట్‌లో ఓటరు జాబితాను మున్సిపల్ ప్రధాన కార్యాలయానికి పంపించాలి.
ఓటరు గణన చేపడుతున్నం
రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి ఆయా మున్సిపాలిటీల్లో కులాల వారీగా, మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలతో కలుపుకొని ఓటరు జాబితాను సిద్ధం చేయమని సర్క్యూలర్ వచ్చింది. కులాల వారీగా మహిళా ఓటర్లను గుర్తించి వాటికి సంబంధించిన ఓటరు గణన పూర్తి చేసి, గడువులోగా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించాలని దేశాలు వచ్చాయి. దీంతో మున్సిపాలిటీలో విలీన గ్రామాలతో పాటు, పట్టణంలో ఓటరు గణనను ప్రారంభించాం.
– చింత వేణు, కమిషనర్, కల్వకుర్తి మున్సిపాలిటీ