మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ స్వల్ప మార్పు
Published Wed, Mar 1 2017 12:30 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
- వచ్చే నెల 10 నాటికి ఓటర్ల జాబితా ప్రచురణ
- రాజకీయ పార్టీల సమావేశంలో మున్సిపల్ కమిషనర్
- ఓటరు జాబితాలో అభ్యర్థనలు, అభ్యంతరాలు తెలియజేయాలని సూచన
కర్నూలు(టౌన్): నగరంలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని రాజకీయ పార్టీ నాయకులు నగరపాలక అధికారులు, ప్రభుత్వానికి విన్నవించిన నేపథ్యంలో సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీలు చేసిన ప్రతిపాదనలు, గడువు లేకపోవడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసింది. గత నెల 28వ తేదీన ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేశారు. మార్చి1 నుంచి 6 వ తేదీ వరకు అభ్యర్థనలు, అభ్యంతరాల పరిశీలనకు చర్యలు తీసుకున్నారు. 7వ తేదీ నుంచి 9వతేదీ వరకు బీసీ ఓటర్ల మార్కింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈ మార్పులకు సంబందించి మంగళవారం సాయంత్రం స్థానిక నగరపాలక కమిషనర్ చాంబర్‌లో వివిధ రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హాఫీజ్‌ఖాన్, పార్టీ పాణ్యం ఇన్‌చార్జీ తోట వెంకటకృష్ణా రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేర్నెకల్ సురేందర్‌రెడ్డి, పర్వేజ్ ( టీడీపీ) రాముడు (సీపీఎం), సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
ఓటర్ల తుది జాబితాపై సూచనలు ఇవ్వండి: నగరపాలక కమిషనర్
ఓటర్ల తుది జాబితాపై తగిన సూచనలు ఇవ్వాలని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు కోరారు. ముసాయిదా జాబితాలో తప్పొప్పులు, అభ్యంతరాలుంటే తెలియజేయాలన్నారు. ఇలాంటి వాటిని పరిశీలించి వచ్చే నెల 10వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. దీనిపై హాఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఓటర్ల సర్వే తూతూ మంత్రంగా చేపట్టడం వల్ల జాబితాలో తప్పులు దొర్లాయన్నారు. ఇంటింటికి సర్వే సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ...మరోసారి ఇలాంటి తప్పులు రాకుండా ఉంటాయన్నారు.
తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ డీ లిమిటేషన్ చేస్తే వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యలో పెద్దగా మార్పులుండవన్నారు. అయితే ఇటివల జాబితాను పరిశీలిస్తే.. అనేక వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో వ్యత్యాసం ఉందన్నారు. సీపీఎం నాయకులు రాముడు మాట్లాడుతూ ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందన్నారు. వార్డుల వారీగా ఓటర్ల సంఖ్య సక్రమంగా లేదన్నారు. వీకర్‌సెక‌్షన్ కాలనీ వార్డులో 8 వేల ఓట్లుంటే, నరసింగరావు పేటలో 3 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో పట్టణ ప్రణాళిక అధికారులు కృష్ణకుమార్, శాస్త్రి షభ్నం, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఇశ్రాయేలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement