voting patterns
-
పోటీ చేసేవాళ్లెక్కువ..! పోలింగ్ తక్కువ...!!
సాక్షి వెబ్, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకు ఎక్కువ ఓట్లు వేయించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. అనేక రకాలుగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ఒక నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థులు పోటీలో నిలిస్తే వారంతా ఎవరి ప్రయత్నాల్లో వారుంటారు. ఓటింగ్ పెంచుకోవడానికి తెగ తాపత్రయ పడుతారు. నలుగురు పోటీలో ఉన్న చోట ఇలా ఉంటే... అదే నలభై మంది ఉన్న చోట ఎలా ఉండాలి. కచ్చితంగా పోలింగ్ ఎక్కువగా నమోదు కావాలి. కానీ అలా జరగడం లేదు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు గమనిస్తే... అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో అత్యధిక పోలింగ్ జరగాలి. కానీ ప్రతిసారీ రివర్స్ లో నగరాల్లోనే తక్కువ పోలింగ్ నమోదు కావడం గమనిస్తూనే ఉన్నాం. తాజా ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ పడిన తీరు, అభ్యర్థులు ఎక్కువగా పోటీలో ఉన్న నియోజకవర్గాల్లోనే పోలింగ్ తక్కువ కావడం గమనార్హం. ఉదాహరణకు మల్కాజిరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 42 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోటీ చేస్తున్న వారంతా ప్రచారం చేసుకోవడంతో పాటు పెద్దఎత్తున ఏజెంట్లను రంగంలోకి దింపారు. కానీ విచిత్రమేమంటే... రాష్ట్ర వ్యాప్తంగా అతితక్కువ ఓటింగ్ నమోదైన నియోజకవర్గాల్లో మల్కాజిరిగి కూడా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లో మాత్రమే 80 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. అయితే, ఈసారి 69 స్థానాల్లో పోలింగ్ శాతం 80 దాటింది. గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగినప్పటికీ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో అతి తక్కువ పోలింగ్ నమోదైంది. తెలంగాణలో ఎస్సీ (19), ఎస్టీ (12) నియోజకవర్గాలు మొత్తం 31 స్థానాల్లో పోలింగ్ సరళి చూస్తే 26 నియోజకవర్గాల్లో 80 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. కేవలం అయిదు చోట్ల మాత్రమే అంతకన్నా తక్కువ పోలింగ్ నమోదు కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) స్థానంలో అతితక్కువగా 49.05 శాతం పోలింగ్ నమోదైంది. ఇకపోతే, ఒక్కో నియోజకవర్గంలో 20 మంది అంతకన్నా ఎక్కువ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలు 22 ఉన్నాయి. మల్కాజిగిరి (42), ఎల్బీ నగర్ (35), ఉప్పల్ (35), ఖైరతాబాద్ (32), అంబర్ పేట్ (31), శేరిలింగంపల్లి (29), సికింద్రాబాద్ (29), రాజేంద్ర నగర్ (26), ముషీరాబాద్ (26), గోషామహల్ (25), యాకుత్ పుర (21), కుత్బుల్లాపూర్ (20), కూకట్ పల్లి (20), ఇబ్రహీంపట్నం (20), మలక్ పేట్ (20) చొప్పున అభ్యర్థులు పోటీలో నిలిచారు. కానీ ఈ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం మాత్రం అతితక్కువ నమోదైంది. -
అసలు ఓటెందుకు వేయాలి?
ఓటు.. వజ్రాయుధం. ఈ మాట కొన్ని దశాబ్దాల నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఎప్పుడు మన దేశంలో ఎన్నికలు జరిగినా 70 శాతం పోలింగు నమోదైంది అంటేనే అదో పెద్ద ఘనతలా భావిస్తున్నాం. చాలా సందర్బాలలో 60 శాతనికి దగ్గర్లోనే పోలింగు నమోదవుతుంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని అందరికీ తెలిసినా, చదువుకున్నవాళ్లు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే ఇలా తక్కువ పోలింగు నమోదవుతోంది. అంటే, నిరక్షరాస్యులు కూడా ఓటు విలువ తెలుసుకుని వయోవృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేస్తుంటే, సూటు బూటు వేసుకున్న ‘పెద్దోళ్లు’ మాత్రం ఓటుహక్కు వినియోగించుకోడానికి చాలా దూరంగా ఉండిపోతున్నారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం. జనవరి 25వ తేదీన ఎన్నికల కమిషన్ ఆవిర్భవించిన సందర్భంగా ప్రతియేటా ఈ దినోత్సవం చేస్తూ.. ఆ రోజున ఓటర్లలో చైతన్యం నింపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అసలు ఓటు ఎందుకు వేయాలి, వేస్తే లాభమేంటి, వెయ్యకపోతే నష్టమేంటో చూద్దాం.. 400 పైచిలుకు భాషలు, వివిధ కులాలు, మతాలు కలిగి ఉన్న దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం చాలా కష్టం. అందుకు ఏకైక మార్గం.. అందరూ ఓట్లు వేయడమే. ఓ ఎన్నికలో 60 శాతం పోలింగ్ నమోదైందని అనుకుందాం. అందులో 10 మంది అభ్యర్థులుంటే, వారి మధ్య ఓట్లు చీలగా.. మహా అయితే 10-15 శాతం లోపు ఓట్లు (మొత్తం ఓటర్లలో) సాధించిన వాళ్లు కూడా ఎన్నికైపోయే అవకాశముంది. అంటే, దాదాపు 85-90 శాతం మంది అక్కర్లేదనుకున్నవాళ్లు సైతం ప్రజాప్రతినిధి అవుతారన్నమాట. అలా కాకుండా నూటికి నూరుశాతం లేదా.. 80-90 శాతం వరకు పోలింగ్ జరిగితే, నిజమైన ప్రజాభిప్రాయం ఫలితాలలో ప్రతిబింబిస్తుంది. ఎక్కువ మంది ప్రజలు కావాలనుకున్నవాళ్లే ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారు. ఇటీవలి కాలంలో ఓటర్ల నమోదు ఎక్కువగానే జరుగుతోంది. నాయకులు దగ్గరుండి చేర్పించడమో, ఆన్ లైన్లో ఓటరుగా నమోదుచేసుకునే ప్రక్రియ ఎక్కువమందికి తెలియడమో.. ఏదైనా ఓటర్ల నమోదు గణనీయంగా పెరిగింది. కానీ ఓటరు గుర్తింపుకార్డును కేవలం ఫొటో గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవడం మాని.. ఎన్నికలలో ఓట్లు తప్పనిసరిగా వేయాలి. చదువుకున్నవాళ్లు తమ సొంత ఆలోచనతో ఓటు వేస్తారు తప్ప ఎలాంటి ప్రలోభాలకు లోనుకారు కాబట్టి, ఇలాంటి వాళ్లంతా ఓట్లు వేస్తే.. డబ్బుపెట్టి కొనుక్కునేవాళ్లు కాకుండా.. నిజంగా రాజకీయాలను బాగుచేద్దాం అనుకునే వాళ్లకు అవకాశం వస్తుంది. కేవలం ఓట్లు వేయడమే కాదు.. రాజకీయాలు కుళ్లిపోయాయి అనుకోవడం మానేసి, ఆ కుళ్లును దగ్గరుండి కడగాలని అనుకోవడం కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఉపయోగపడుతుంది. అంటే, యువత రాజకీయాల్లోకి ప్రవేశించాలి. స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.