వాడని కారుకు నిర్వహణ ఖర్చు!
వికారాబాద్: జిల్లా గ్రంథాలయంలో ఓ అవినీతి బాగోతం బయటపడింది. కారు వాడకున్నా నిర్వహణ ఖర్చు కింద ఓ అధికారి నెలకు రూ.15వేల బిల్లుపెట్టి తీసేసుకుంటున్నట్టు రికార్డులో నమోదైంది. జిల్లా గ్రంథాయలంలో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి వి.శంక ర్‌రెడ్డికి ప్రభుత్వం జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను పరిశీలించడానికి కారు సౌకర్యం కల్పించింది. ఆయన నెలలో 25 రోజులపాటు ఆయా శాఖల గ్రంథాలయాలను పరిశీలించడానికి గానీ లేదా హైదరాబాద్‌లో ఉన్న హెడ్‌ఆఫీస్‌కు వెళ్లడానికి కారు ఉపయోగించుకోవచ్చు.
కానీ శంకర్‌రెడ్డి కారు ఉపయోగించకుండానే దాని అద్దె, డీజిల్ ఖర్చు కింద నెలకు రూ.15 వేలు తీసుకుంటున్నారు. విషయం ఏమిటంటే ఆయన హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు కూడా కారులో రారు.. ట్రైన్లోనే వస్తారు. కానీ అద్దె కారును వాడుతున్నట్టు, దానికి నెలకు ఇంత ఖర్చవుతోందని లెక్కలు చూపిస్తున్నారు. ఇక జిల్లాలోని ఇతర గ్రంథాలయాలకు వెళ్లాలంటే జిల్లా గ్రంథాలయంలో పనిచేసే వారి బైక్‌మీద వెళ్తుంటారు. ఈ రూపంలో ఇప్పటివరకు శంకర్‌రెడ్డి గ్రంథాలయానికి సంబంధించి సుమారుగా రూ.7.20 లక్షలను దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే పుస్తకాలు, ఫర్నీచర్ కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగినట్టు అనుమానాలున్నాయి.
నాకు కారు సౌకర్యం ఉంది..
నాకు నెలలో 15 రోజులు కారు వాడుకొనే వెసులుబాటు ఉంది. జిల్లాలో ఎక్కడైనా కారులో తిరగొచ్చు. అందుకుగాను ప్రతినెలా రూ.12 వేలు బిల్లు తీసుకుంటున్నా. కారు మాత్రం వాడడం లేదు. - వి.శంకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి