vulture eyes
-
అంతరించిపోతున్న రాబంధులు.. మనుగడ కోసం పోరాటం!
సాక్షి, మంచిర్యాల: జీవ వైవిధ్యం దెబ్బతింటుండటంతో పర్యావరణ పరిరక్షణలో తోడ్పడే రాబంధులు ప్రస్తుతం రాష్ట్రంలో మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. పూర్వం గ్రామాల్లో ఏదైనా పశువు చనిపోతే గుంపులుగా కనిపించేవి. జీవుల కళేబరాన్ని తిని ప్రకృతి నేస్తాలుగా పర్యావరణ రక్షణకు తోడ్పడేవి. అయితే మానవాళి ప్రకృతి విధ్వంసక చర్యలతో అవి పదుల సంఖ్యకు పడిపోయాయి. గ్రామాల్లో పశువుల సహజ మరణాలు తగ్గిపోయాయి. అవి చనిపోయే వరకు ఆగకుండా ముందే వధశాలలకు తరలిస్తున్నారు. దీంతో రాబంధులకు తిండి దొరక్క చివరకు అటవీ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు కనిపించడం తగ్గిపోయిన రాబంధులు చాలా కాలం తర్వాత 2013లో తొలిసారిగా కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట మండలం నందిగామ శివారులో కనిపించాయి. పెద్దవాగు, ప్రాణహిత నది కలిసే పాలరాపు గుట్టపై గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇందులో 20 పెద్దవి, మరో పది వరకు చిన్నవి ఉన్నట్లు గుర్తించారు. కాగా, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సిరొంచ డివిజన్ కమలాపూర్ రేంజ్ చల్వడాతోపాటు మరో నాలుగు చోట్ల కూడా 60 నుంచి 70 వరకు రాబంధులు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఇందులో పొడుగు ముక్కు (గిప్స్ ఇండికస్), ఓరియంటల్ వైట్ బ్లాక్, స్లెండర్ బిల్డ్ జాతులు ఉన్నట్లు చెపుతున్నారు. కాగా, పొడుగు ముక్కు రాబంధులు ప్రాణహిత తీరంలో సంచరిస్తున్నాయి. రోజుకు వంద కిలోమీటర్లు సులువుగా తిరిగే ఈ పక్షులు నదికి ఇరువైపుల స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. ఇదిలా ఉండగా చాలా కాలానికి నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు పరిసరాల్లోని కృష్ణానది తీరంలో కూడా కొన్ని రాబంధులు కనిపించినట్లు అటవీ అధికారులు చెపుతున్నారు. దెబ్బతీసిన డైక్లోఫినాక్.. గతంలో పశువుల్లో వ్యాధుల నివారణ కోసం డైక్లోఫినాక్ మందును ఎక్కువగా ఉపయోగించేవారు. దీంతో పశువుల కబేళరాలను తిన్న రాబంధులకు తీవ్ర ముప్పు ఏర్పడింది. వాటి మూత్రపిండాలు, పునరుత్పత్తిపై ఈ మందు ప్రభావం చూపడంతో రాబంధుల జాతి అంతరించేందుకు ఇది ప్రధాన కారణమైంది. 2006లో ఈ మందును కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే అప్పటికే 9 రాబంధు జాతుల్లో దేశంలో నాలుగు జాతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) అనే అంతర్జాతీయ పర్యావరణ సంస్థ రాబంధులను అంతరించిపోతున్న జాతుల్లో చేర్చింది. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల సెల్ టవర్లు, విద్యుత్ తీగలకు తాకి ఇవి చనిపోయినట్లు గుర్తించారు. పర్యావరణంలో ప్రముఖ పాత్ర రాబంధులు పర్యావరణ పరిరక్షణలో ప్రకృతి నేస్తాలుగా ఉంటాయి. మృతిచెందిన జీవ వ్యర్థాలను ఇవి ఆహారంగా తీసుకుని.. ఆంత్రాక్స్, రేబిస్, ట్యూబర్క్యులోసిస్ వంటి ప్రమాదకర రోగాలు ప్రబలకుండా కాపాడతాయి. అలాగే కళేబరాలను మట్టిలో కలిసిపోయేలా తోడ్పడతాయి. రాబంధులు ఉండే ప్రాంతాన్ని జీవ వైవిధ్యతకు చిహ్నంగా పర్యావరణ వేత్తలు చెపుతుంటారు. అటవీ శాఖ సంరక్షణ చర్యలు ప్రాణహిత తీరంలో రాబంధుల సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి స్థిరంగా ఉండలేకపోతున్నాయి. ఆ ప్రాంతంలో వేటను నిషేధించారు. అలాగే మనుషుల సంచారాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట ఈ ప్రాంతంలో గుట్టపై ఆరోగ్యకరమైన పశువు మాంసాన్ని ఆహారంగా వేశారు. అయితే అవి తినేందుకు ఇష్టపడలేదు. వానాకాలంలో గుట్టపై గూళ్లు దెబ్బతినడంతో మళ్లీ మహారాష్ట్రకు వైపు వెళ్లాయి. ఇటీవల కొన్ని తిరిగివచ్చాయి. సహజ ఆహార వేట అలవాటుతో అవి అధికారులు వేసిన ఆహారాన్ని ఇష్టపడక పలు చోట్ల సంచరిస్తున్నాయి. రాబంధులు సంచరిస్తున్న ఈ ప్రాంతాన్ని నాలుగేళ్ల క్రితమే ‘జఠాయువు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’గా ప్రకటించాలని అటవీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో అంతరించి పోయే దశలో ఉన్న రాబంధుల సంతతి పెరగకపోతే పర్యావరణానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాణితోటపై రాబందుల కన్ను
► 10 ఎకరాల ప్రభుత్వ స్థలం కాజేసేందుకు యత్నం ► ప్రజావసరాలకు కేటాయించాలని గ్రామ పెద్దలు డిమాండ్ ► రెండు పర్యాయాలు పేదలకు పట్టాలిచ్చి...స్థలాలు చూపని వైనం ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కొందరు రాబందులా వాలిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేయాలని పథకాలు రచిస్తారు. మండల పరిధిలోని చిన్నటేకూరు గ్రామ రెవెన్యూలోని పది ఎకరాల రాణితోటపై ఇప్పుడు కొందరి కన్ను పడింది. పరిశ్రమల స్థాపన పేరుతో కాజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కల్లూరు: 44వ నంబరు జాతీయ రహదారి పక్కనే రాణితోట పేరుతో 10.81 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 89 సర్వే నెంబరులో 4.47 ఎకరాలు, 90/2లో 3.44 ఎకరాలు, 92/2లో 2.90 ఎకరాలు ఉంది. ప్రజల అవసరాలకు ఈ భూమిని కేటాయించాలని గ్రామ పెద్దలు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ప్రస్తుతం భూ విలువలు భారీగా పెరగడంతో కొందరు అక్రమార్కులు రాణితోటను కబ్జా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులో వ్యాపార, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. శంకర్ అనే ప్రైవేట్ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా ఈనెల 17వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జేసీబీ సహాయంతో ముళ్లపొదలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. గమనించిన గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. తద్వారా పనులను నిలిపివేయించారు. పరిశ్రమల స్థాపన, ఇతర యూనిట్ల స్థాపన పేరుతో ఇంకొందరు రాణితోట స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఆర్డీఓ, తహసీల్దార్, వీఆర్ఓలు స్థలాలను నిత్యం పరిశీలిస్తూనే ఉన్నారు. ఈనెల 22న ఆర్డీఓ, తహసీల్దార్లు, 23న కల్లూరు, కర్నూలు వీఆర్ఓలు స్థలాన్ని, మ్యాప్‌లను పరిశీలించారు. ప్రజా ప్రతినిధులకు విన్నవించినా స్పందన కరువు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామ పెద్దలు డిమాండ్ చేయగా 2004లో 270 మంది పేదలకు ఒక్కొక్కరికి 1.50 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తూ నాటి రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు జారీ చేశారు. అయితే, వారికి స్థలాలు చూపించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేశారు. తర్వాత కల్లూరు మండలం అర్బన్, రూరల్ మండలాలుగా విభజన కానున్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. రూరల్ మండలం అయితే చిన్నటేకూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుచేస్తారని, అప్పుడు ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు రాణితోట స్థలం ఉపయోగపడుతుందని అందరూ భావించారు. అది కార్యరూపం దాల్చకపోవడంతో రెండవ పర్యాయం 2014లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నాటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రయత్నం చేశారు. పట్టాలు రూపుదిద్దుకున్నా పంపిణీకి నోచుకోలేదు. ఏడాది క్రితం మళ్లీ గ్రామపెద్దలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కలిసి రాణితోట స్థలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడా మైదానం ఏర్పాటుచేయాలని విన్నవించారు. మరోపక్క హైదరాబాద్ శిల్పారామం నుంచి కొందరు స్థలం కావాలని ప్రతిపాదనలు అందజేసినట్లు సమాచారం. ఇందుకోసం వీఆర్ఓ స్థలాన్ని పరిశీలించినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి చిన్నటేకూరు గ్రామానికి సమీపంలో ఉలిందకొండ, లక్ష్మీపురం, బొల్లవరం, పర్ల గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ పదవ తరగతి ఉత్తీర్ణులైన వారందరూ జూనియర్ కళాశాలలో చేరాలంటే కర్నూలు నగరానికి వెళ్లాలి. చిన్నటేకూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలను రాణితోటలో ఏర్పాటుచేస్తే 5 గ్రామాల్లోని విద్యార్థులకు ఉన్నత చదువు అందుతుంది. – మల్లికార్జున, చిన్నటేకూరు ఇతరులకు కట్టబెడితే ఊరుకోం రాణితోట స్థలంలో పేదలకు ఇళ్లు కేటాయించాలి. రూరల్ మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా వ్యాపార వేత్తలకు, పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయిస్తే గ్రామస్తులమంతా కలిసి ఉద్యమిస్తాం. – రామాంజనేయులు, మండల ఉపాధ్యక్షుడు