మాజీ ఎంపీ ఉండవల్లికి మాతృవియోగం
రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తల్లి లక్ష్మి (99) ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్యాపురంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1916 ఆగస్టు 12న కర్ణాటక రాష్ట్రంలో మైసూరు సమీపంలోని హోలీ నర్సాపూర్ గ్రామంలో ఆమె జన్మించారు. ఆమె భర్త సుబ్బారావు రాజమహేంద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షునిగా సేవలు అందించారు. సంఘ సేవకురాలిగా పేరొందిన లక్ష్మి ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళాగౌతమి ఆధ్వర్యంలో ఉత్తమ సామాజిక సేవకు 2012లో మహర్షి బులుసు సాంబమూర్తి స్మారక పురస్కారాన్ని అందుకున్నారు.
లక్ష్మి భౌతిక కాయాన్ని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబి, వైఎస్సార్ సీపీ నాయకులు రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి రాజా, ఆకుల వీర్రాజు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ ఎస్.శివరామసుబ్రహ్మణ్యం, ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఆమె అంత్యక్రియలు మధ్యాహ్నం కోటిలింగాలరేవు కైలాసభూమిలో జరిగాయి.