ఆత్మహత్యలకోసం మరో 70 మంది లేఖలు
భోపాల్: వ్యాపం కుంభకోణం కేసులో నిందితులైన మరో 70మంది మెడికల్ విద్యార్థులు, జూనియర్ వైద్యులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖలు రాశారు. తమకు బెయిలయినా ఇప్పించాలని లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని అందులో విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన మెడికల్ పరీక్షల్లో వీరంతా అవకతవకలకు పాల్పడ్డారని, వేరేవారితో పరీక్షలు రాయించడం, అధికారులకు డబ్బులిచ్చి మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంవంటి ఆరోపణలతో కేసులు పెట్టారు.
ప్రస్తుతం గ్వాలియర్ జైల్లో ఉన్న వీరంతా తమను చాలా కాలం నుంచి విచారిస్తున్నారని, దీంతో తమ భవిష్యత్తు అంధకారంగా మారిందని, ఫలితంగా మానసికంగా సమాజ పరంగా తీవ్ర ఒత్తిడి నెలకొందని ఆవేదన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్లే తమకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి లేఖలు రాష్ట్రపతికి కొంతమంది విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే.