waitress
-
వెయిట్రస్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్క పంచ్‌తో శివంగిలా విరుచుకుపడి..
ఆత్మ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. ఎటు నుంచి ఏ విపత్తు వస్తుందో ఎవరికి తెలియదు. ఆపద కాలంలో మనల్ని ధైర్యంగా ఉంచడమే కాకుండా.. ప్రత్యర్థి, ఆగంతకుల బారి నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు ఆత్మ రక్షణ తోడ్పడుతుంది. అచ్చం ఇలాంటి కోవకే చెందిన ఓ ఘటన రెస్టారెంట్లో చోటుచేసుకుంది. తనతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కస్టమర్లకు ఓ మహిళ వెయిట్రస్ దిమ్మతిరిగే పంచ్‌లతో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రెస్టారెంట్‌లోని టేబుల్ వద్ద ఇద్దరు వ్యక్తుల కూర్చొని ఉండగా.. వారి ముందు ఓ లేడీ వెయిట్రస్ నిల్చొని ఉంది. టేబుల్లో కొన్ని ఖాళీ బీర్ సీసాలు కూడా ఉన్నాయి. ఇంతలో ఇద్దరు కస్టమర్లలో ఒక వ్యక్తి నిలబడి వెయిట్రస్ చేయి బలవంతంగా పట్టుకున్నాడు. రెండోసారి కూడా పట్టుకునేందుకు ప్రయత్నించగా సదరు యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. అంతటితో ఆగకుండా అతని ముఖంపై పిడిగుద్దులు గుద్ది, కడుపులో తన్ని కింద పడేసింది. ఇది చూసిన రెండో వ్యక్తి మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయినా బెదరని వెయిట్రస్ అతన్ని ధైర్యంగా ఎదుర్కొంది. సినిమాలో హీరోకు ఏమాత్రం తీసిపోకుండా అతనిపై శివంగిలా విరుచుకుపడింది. ఆమె పైకి కుర్చీ విసరగా.. యువతి తన కాలితో ఒక్క కిక్ ఇవ్వగానే ఎగిరి కిందపడిపోయాడు. ఈ దృశ్యాలన్నీ రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనిని ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఫేర్ చేయగా.. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. అయితే ఈ ఘటన ఎప్పుడూ, ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు. ఇదిలా ఉండగా యువతి ధైర్య సాహసాలను చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నైపుణ్యాలను మెచ్చుకుంటూ పోకిరీలతో పోరాడిన యువతిని ‘ఫిమేల్ బ్రూస్ లీ’ అంటూ కొనియాడుతున్నారు. Female Bruce Lee 💪💪 pic.twitter.com/Fg3Ben0IpQ — CCTV IDIOTS (@cctvidiots) April 15, 2023 -
ఒక్కసారిగా మైండ్ బ్లాక్!.. వెయిట్రస్‌కు కోట్ల విలువైన కారు టిప్‌గా ఇచ్చాడు
ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మీస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్సన్ ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లును సంపాదించుకున్నాడు. వెరైటీ కంటెంట్లతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు వినోదాన్ని పంచుతుంటాడు ఈ యూట్యూబర్. అందుకే తన ఫాలోవర్లు సంఖ్య 139 మిలియన్లకు పెంచుకోగలిగాడు. తన బిజినెస్ వెంచర్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు సరికొత్తగా ప్లాన్లు చేసే ఈ యూట్యూబర్ ఇటీవల ఓ వెయిట్రస్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఊహించని టిప్.. రెస్టారెంట్‌కు వెళ్లిన ఆ యూట్యూబర్ అక్కడ పని చేస్తున్న వెయిట్రెస్‌తో.. ఇంత వరకు నువ్వు అత్యధికంగా ఎంత టిప్ తీసుకున్నావు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు, ఆమె 50 డాలర్లు అని సమాధానమిస్తుంది. దాంతో ఇప్పటివరకూ నీకు టిప్‌గా కారు ఎవరైన ఇచ్చారా అని అడుగుతూ తన కారు తాళాన్ని వెయిట్రెస్‌కు ఇస్తాడు. మొదట్లో ఆమె ఈ విషయాన్ని నమ్మదు గానీ తర్వాత ఆ యూట్యూబర్ తను కారును పార్క్ చేసిన ప్రదేశానికి వెయిట్రెస్‌ను తీసుకువెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు. బ్లాక్ టయోటా కారును వెయిట్రెస్‌కు టిప్‌గా అందిస్తాడు ఆ యూట్యూబర్. టిప్‌గా ఇచ్చిన కారుపై తన చాక్లెట్ కంపెనీ ఫీస్టబుల్ లోగో కనిపిస్తుంది. కస్టమర్ నుంచి కోట్లు ఖరీదైన కారుని టిప్‌గా అందుకోవడంతో వెయిట్రెస్ ఆనందంలో మునిగి తేలిపోతుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యూట్యూబర్ ఔదార్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) -
Kara Perez Success Story:ఒకపుడు వెయిట్రెస్.. ఇపుడు కోట్లలో సంపాదిస్తోంది.. ఎలా?
పట్టుదల ఉండాలేగానీ ఏమైనా సాధించవచ్చుఅనేది కారాపెరెజ్ మరోసారి నిరూపించారు.ముఖ్యంగా కష్టాల కొలిమిలో మండిన వారు మరింత శ్రమించి విజయాలు సాధిస్తారు. కారా పెరెజ్అది అలాంటి స్ఫూర్తిదాయకమైన కథే. ఎడ్యుకేషన్ ఫీజు కట్టడానికి అమెరికాలో ఒక హోటల్లో వెయిట్రెస్‌గా పనిచేసింది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కంపెనీ స్థాపకురాలిగా,మనీ ఎక్స్పర్ట్, స్పీకర్‌గా అందరికి ఆదర్శనీయంగా నిలుస్తోంది. పెరెజ్ అమెరికాలో ఆస్టిన్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూన్నపుడు రూ. 15 లక్షలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం) సంపాదించేది. ఈ సంపాదనతో నిజానికి అక్కడ బతకడమే కష్టం. దీనికితోడు రూ.24 లక్షలకు పైగా విద్యార్థి రుణాన్ని చెల్లించాల్సి వచ్చింది. అదే ఆమెను క్రియేటివ్‌గా ఆలోచించేలా చేసింది. 2011లో పట్టభద్రురాలైన ఆమెకు ఎన్ని పార్ట్ టైం జాబ్‌లతో కష్టాలు తీరలేదు. అప్పులు, తక్కువ సంపాదన అనే విష వలయం నుండి బయటపడాలని అంతకుముందే క్రియేట్ చేసుకున్న బ్లాగు వైపు దృష్టి పెట్టింది. రోజుకు 12 గంటలు పనిచేస్తూ ఉద్యమంలాగా దీనిపై పనిచేసింది. అప్పులన్నీ తీర్చేసింది. మొదట్లో తన వ్యక్తిగత ప్రయాణం గురించి బ్లాగింగ్ చేసేది. పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ స్టూడెంట్ లోన్లు గురించి డబ్బు, పొదుపు, గురించి అనేక వ్యాసాలు రాసింది. అలా అనేక సమావేశాలకు స్పీకర్‌గా అవకాశం లభించింది. కాలక్రమంలో మహిళలు ఎక్కువ ఆసక్తి చూపడం గమనించింది. దీంతో ఎక్కువగా మహిళలతోనే ఎక్కువ సమావేశమవుతూ, అప్పులను తగ్గించు కోవడానికి లేదా పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం ప్రారంభించింది. క్రమంగా బ్లాగ్ కాస్తా ‘బ్రేవ్లీ గో’ అనే ఫైనాన్షియల్ ఎడ్యుకేషనల్ కంపెనీకి నాంది పలికింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం రూ. 1.5 కోట్లు సంపాదిస్తోంది. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక విద్య కోసం తాను పనిచేస్తున్నానని, అందుకే తనను తాను ఫైనాన్షియల్ ఫెమినిస్ట్‌గా చెప్పుకుంటుంది. ఈ సంస్థ ద్వారా వర్క్‌షాప్‌లు, కోర్సులు, స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్తో మహిళల్లో డబ్బు సంపాదన, పొదుపు లాంటి అలవాట్లను పెంపొందించడంలో శిక్షణ ఇస్తుంది. 34 ఏళ్ల పెరెజ్ ఇపుడు సేల్స్ ద్వారా లక్ష డాలర్లు, సోషల్ మీడియా మేనేజర్, హైస్కూల్ కోచ్ , ఫ్రీలాన్స్ రైటింగ్ వంటి పార్ట్ టైమ్ ఉద్యోగాలతో మరో 27వేల డాలర్లు ఆర్జిస్తోంది. 2017లో, ఆమె స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారా డబ్బు సంపాదిస్తోంది. కాగా తన డొమైన్ పేరుకోసం కేవలం 12 డాలర్లు, వెబ్సైట్ హోస్ట్‌లో 50 డాలర్లు, టెక్సాస్‌లో కంపెనీని స్థాపించడానికి 308 డాలర్లు ఖర్చు చేసింది. వెబ్సైట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌పై న్యాయవాదికి 900 డాలర్లు మాత్రమే ఆమె ఖర్చు చేసింది. -
ఆమె పూర్వానుభవం.. ఒక ప్రాణం నిలిపింది
వైరల్: ఆపదలో ఉన్న వ్యక్తుల్ని ఆదుకోవడం నిజంగా గొప్ప విషయం. కేవలం మానవ సంబంధాలతో సాయం చేసేవాళ్లను చూస్తే అభినందించకుండా ఉండలేం. అయితే.. ముప్పును అంచనా వేసి సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు నిలబెట్టడం మరింత విశేషమే కదా. అలాంటి ఘటనే ఇది.. గుడ్ న్యూస్ మూమెంట్ అనే ఇన్స్టాగ్రామ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో.. ఒక ఫ్యామిలీ ఓ రెస్టారెంట్లో తింటూ ఉంటారు. అందులో ఓ వ్యక్తికి గొంతులో ఏదో అడ్డం పడి.. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఏం జరిగిందంటూ ఆరా తీసే యత్నం చేస్తారు. అంతలో ఓ వెయిట్రెస్ అక్కడి రావడంతో.. ఆమెకు అతని పరిస్థితిని వివరిస్తారు. ఇంక.. క్షణం ఆలస్యం కూడా చేయకుండా ఆమె అతనికి యాంటీ చోక్ ట్రీట్మెంట్ ఇస్తుంది. దీనినే హిమ్లిచ్ మనువహ్(heimlich maneuver) అంటారు. గొంతుకు ఏదైనా అడ్డం పడి.. శ్వాసకు ఇబ్బంది ఏర్పడిన తరుణంలో ఈ తరహా చికిత్స అందిస్తారు. తద్వారా అడ్డం పడ్డ వస్తువు బయటకు రావడం లేదంటే లోపలికి వెళ్లిపోవడం ద్వారా ఆ వ్యక్తికి ఉపశమనం కలిగి.. సాధారణ స్థితికి వచ్చాడు. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెను షీ(హీ)రోగా అభివర్ణిస్తున్నారంతా. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) కస్టమర్‌ను కాపాడిన ఆ వెయిట్రెస్ పేరు లేసీ గప్టిల్ అని.. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా గతంలో పని చేసిన ఆమె సీపీఆర్‌తో పాటు హిమ్లిచ్ మనువర్లోనూ శిక్షణ తీసుకుందని తెలుస్తోంది. అమెరికన్ డాక్టర్ హెన్రీ హీమ్లిచ్ ఈ విధానానికి సృష్టికర్త కాగా.. ఆ పేరు మీదుగా ఈ అత్యవసర చికిత్సకు పేరొచ్చింది. గొంతులో ఏదైనా అడ్డం పడినప్పుడు.. ఉక్కిరిబిక్కిరి అయిన బాధితుడు ఊపిరి పీల్చుకోలేని స్థితిలో సాధారణంగా మాట్లాడలేడు. గొంతుపై రెండు చేతులను ఉంచి. సాయం కోసం వేడుకుంటాడు. అలాంటప్పుడు ఈ చికిత్సను చాలా జాగ్రత్తగా అందించాల్సి ఉంటుంది. -
రూ.2.3లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్.. కేసు పెట్టిన రెస్టారెంట్
వాషింగ్డన్: రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసి హాయిగా తిన్నాడు. ఆ తర్వాత వెయిట్రెస్‌కు రూ.2.3లక్షలు(3వేల డాలర్లు) టిప్ ఇచ్చాడు. అంత భారీ మొత్తం తనకే అని తెలిసి ఆమె ఆశ్చర్యంతో పాటు ఆనందంలో మునిగిపోయింది. అమెరికా పెన్సిల్వేనియాలోని అల్ఫ్రెడోస్ పిజ్జా కేఫ్ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. టిప్ ఇచ్చిన కస్టమర్ పేరు ఎరిక్ స్మిత్ కాగా.. తీసుకున్న వెయిట్రెస్ పేరు మరియానా లాంబర్ట్. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చాడు కస్టమర్. తాను ఇచ్చిన టిప్‌ను తిరిగిచ్చేయాలన్నాడు. దీంతో రెస్టారెంట్‌తో పాటు వెయిట్రెస్ కూడా కంగుతింది. ఎరిక్ తన బిల్లుతో పాటు టిప్‌ను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాడు. టిప్ ఇస్తూ బిల్లుపై 'ఫర్ జీసస్'(జీసస్ కోసం) అని రాశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పేరుతో ఉద్యమం నడుస్తోంది. చాలా మంది ఇతరుల కోసం భారీ సాయం చేస్తున్నారు. దీంతో ఇది దేవుడు తనకోసం ఇచ్చిన కానుక అని వెయిట్రెస్ సంబరపడిపోయింది. కానీ కొన్ని గంటలకే ఆనందం ఆవిరైంది. తాను టిప్ ఇచ్చిన రూ.2.3లక్షలపై క్రెడిట్ కార్డు కంపెనీతో గొడవపడ్డాడు ఎరిక్. ఈ మొత్తాన్ని బిల్లులో చేర్చవద్దన్నాడు. దీంతో క్రెడిట్ కార్డు కంపెనీ ఈ విషయాన్ని రెస్టారెంట్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని రెస్టారెంట్ యాజమాన్యం ఎరిక్‌ను సంప్రదించేందు ప్రయత్నించింది. ఫేస్బుక్లో సందేశాలు పంపింది. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఎరిక్‌పై కోర్టులో దావా వేసింది రెస్టారెంట్ యాజమాన్యం. రూ.2.3లక్షలను తాము అప్పటికే లాంబర్ట్‌కు ఇచ్చేశామని, ఇప్పుడు అంత మొత్తాన్ని తిరిగి ఇవ్వలేమని చెప్పింది. కస్టమరే స్వయంగా టిప్ ఇచ్చి మళ్లీ వెనక్కి ఇవ్వాలనడంపై అభ్యంతరం తెలిపింది. ఆ టిప్ తీసుకునేందుకు లాంబర్ట్‌కు పూర్తి అర్హత ఉందని, ఆమె చాలా కష్టపడి పనిచేస్తుందని చెప్పింది. చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
కస్టమర్లు నీచంగా ప్రవర్తిస్తారు: బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐటం సాంగ్స్‌లో తన స్టెప్పులతో కుర్రకారును అల్లాడిస్తుందీ భామ. సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ గతంలో వెయిటర్‌గా పని చేసిందట. తాజాగా ఈ విషయాన్ని ఓ రియాలిటీ షోలో వెల్లడించింది. కెనడాలో 16 ఏళ్లకే వెయిటర్‌గా పని చేశానని తెలిపింది నోరా. వ్యక్తిగత కారణాల వల్ల 18 ఏళ్లు వచ్చేదాకా వెయిటర్‌గా విధులు నిర్వర్తించానని పేర్కొంది. వెయిటర్‌గా పని చేయాలంటే బాగా మాట్లాడగలిగే సామర్థ్యంతో పాటు, జ్ఞాపకశక్తి,, ఓపిక, సహనం కూడా ఉండాలంటోంది. కొన్నిసార్లు కస్టమర్లు నీచంగా ప్రవర్తిస్తారని, అలాంటప్పుడు పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో మనం స్వతాహాగా నేర్చుకోక తప్పదని చెప్పుకొచ్చింది. ఇక నోరా ఫతేహి సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరిసారిగా 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో నటించింది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడటంతో పాటు కీలక పాత్ర పోషించింది. -
అసభ్యంగా తాకాడు.. ఆపై...!
జార్జియా: లైంగిక వేధింపులను మౌనంగా భరించే వాళ్లు కొందరైతే.. ఎదురించేవాళ్లు మరికొందరు. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని గల్ల పట్టి పోలీసులకు అప్పగించారు ఓ మహిళ. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ఆకతాయిని కటకటాల వెనక్కి నెట్టారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే... జార్జియా, సవన్నా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో వచ్చాడు. వెయిట్రెస్ ‘ఈమెలియా(25)’ తన పనిలో నిమగ్నమై ఉండగా.. వెనకాల నుంచి వచ్చిన సదరు వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకాడు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా ఆమె అతన్ని గల్ల పట్టి లాగిపడేశారు. వెంటనే పోలీసులకు కేక వేయటంతో.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించాడు. అయితే ఆమె మాత్రం అతన్ని వదలకుండా అలాగే పట్టుకున్నారు. చివరకు చేసిన పనికి భార్య, ఇద్దరు పిల్లల ముందే అతగాడు అరెస్ట్ అయ్యాడు. నిందితుడు ర్యాన్ చెర్విన్స్కీ(31)ని రెండు రోజులు జైల్లో ఉండి.. ఆపై బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. జూన్ 30న ఈ ఘటన చోటు చేసుకోగా.. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. రెడ్డిట్‌లో వీడియో అప్లోడ్ కాగా, నాలుగు రోజుల్లోనే మిలియన్‌కి పైగా వ్యూవ్స్‌ను రాబట్టిందీ వీడియో. పలువురు ఈమెలియాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘మనం వేసుకునే దుస్తులు కాదు. మగాళ్లు మారాలి. మహిళలకు కూడా వాళ్లను ఎదురించే ధైర్యం రావాలి’ అని ఈమెలియా చెబుతున్నారు. -
భారీ ఉడుమును భలే ఈడ్చిపారేసింది
న్యూసౌత్‌వేల్స్: చిన్న బొద్దింకను చూస్తేనే అమ్మాయిలు బాబోయ్ అంటూ అమ్మాయిలు ఎగిరిగంతేస్తారు.. అలాంటిది అచ్చం ఓ చిన్నసైజు గాడ్జిల్లాలాంటి ఉడుమును చూస్తే పరిస్థితి ఏమిటి? ఊహించుకుంటేనే ఉలిక్కిపడేట్టు ఉంది కదా! కానీ, ఓ అమ్మాయి ఆ ఉడుమును చూడటమే కాదు దాని తోకపట్టుకొని ఈడ్చి పారేసింది. తన రెస్టారెంటులో అడుగుపెట్టడానికి నీకెన్ని గుండెలు అన్నట్లుగా ఆ ఉడుమును అవలీలగా అదేదో కొబ్బరిమట్టను ఈడ్చుకెళ్లి బయటపడేసినట్లు విసిరేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని రెస్టారెంట్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఫేసబుక్‌లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. సామియా లిలా(25) అనే యువతి న్యూసైత్ వేల్స్‌లోని మిమోసా వైన్స్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తోంది. ఆ రెస్టారెంటులోకి అత్యంత అరుదైన రకానికి చెందిన భారీ ఉడుము వచ్చి అక్కడ ఉన్నవారిని హడలెత్తించింది. చాలామంది కేకలు పెట్టి భయంతో పరుగులు పెట్టేట్లు చేసినా ఆ యువతి మాత్రం దానిని చాలా సింపుల్‌గా తీసుకొని తోకపట్టి ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లింది. అది తిరగబడే ప్రయత్నం చేసినా ఎంతో నైపుణ్యంతో చాకచక్యంగా పట్టుకొని బయటకు పడేసి కస్టమర్లు అవాక్కయ్యేలా చేసింది. ఇలా ఎలా చేయగలిగావని ప్రశ్నించిన వాళ్లకు అలాంటి జంతువులంటే తనకు చాలా ఇష్టం అని, అందుకే దానిని పట్టుకోగలిగానని చెప్పుకొచ్చింది. -
వెయిట్రెస్‌కు భారీ టిప్ ఇచ్చిన హీరో
న్యూయార్క్: హోటల్లో రుచికరమైన వంటకాలు వడ్డించే వెయిటర్లకు టిప్ ఇవ్వడం సర్వసాధారణమే. కానీ హాలీవుడ్ హీరో జిమ్ క్యారీ ఓ మహిళా వెయిటర్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆమెకు ఏకంగా 224 డాలర్లు (రూ. 15వేలు) టిప్‌గా ఇచ్చాడు. 'లయర్ లయర్', 'ద మాస్క్' వంటి చిత్రాల్లో నటించిన ఈ 53 ఏళ్ల నటుడు న్యూయార్క్ సిటీలో స్నేహితులతో కలిసి జల్సా చేశాడు. మిట్ప్యాకింగ్ జిల్లాలోని ప్రముఖ చెస్టర్ రెస్టారెంట్లో మిత్రులకు పార్టీ ఇచ్చాడు. సంప్రదాయ అమెరికన్ ఆహారం అందించడంలో పేరొందిన ఈ రెస్టారెంట్లో పాయింట్ నాయిర్ వైన్, లెమన్ చికెన్.. తదితర రుచికరమైన వంటలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా మంచి మూడ్‌లో ఉన్న ఆయన మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారని, వెయిట్రెస్‌కు 224 డాలర్ల టిప్ ఇచ్చారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఈ విందులో స్నేహితులతో ఆయన చాలా సంతోషంగా గడిపారని న్యూయార్క్ పోస్టు తెలిపింది. గేన్స్వూర్ట్ హోటల్ లో భాగమైన ఈ రెస్టారెంట్లో వెయిటర్లకు జీతం కన్నా టిప్పే అధికంగా లభిస్తుందని చెప్తున్నారు. గతంలోనూ చాలామంది సెలబ్రిటీలు ఇక్కడ వెయిటర్లకు భారీగా టిప్ ఇచ్చారు. -
కస్టమర్‌కి కిడ్నీదానం చేసేసింది..
జార్జియా(అమెరికా): అవసరం ఉంటే మాట సాయం చేస్తాం...మరీ దగ్గరి వారయితే డబ్బు దానం చేస్తాం... కిడ్నీ లాంటి అవయవాలైతే కుటుంబ సభ్యులు అయినా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. అయితే ఎలాంటి రక్తసంబంధం లేకుండానే రెస్టారెంట్ రెగ్యులర్‌గా వచ్చే ఓ కస్టమర్ కోసం అందులో పనిచేసే అమ్మాయి ఏకంగా తన కిడ్నీని దానం చేసేసింది. వివరాల్లోకి వెళితే...జార్జియాలోని రోస్ వెల్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో వెయిటరెస్గా పని చేసే మారియానా విల్లారియల్ అనే అమ్మాయి తమ రెగ్యులర్ కస్టమర్‌కు కిడ్నీని దానం చేసింది. 10 ఏళ్ల నుంచి తమ రెస్టారెంట్‌కు రెగ్యులర్ కస్టమర్‌తో పాటు, మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్న డాన్ థామస్ క్యాన్సర్ వ్యాధితో రెండు కిడ్నీలు పాడైపోయాయి. మామూలు పరిచయం మాత్రమే అయినప్పటికీ అతని ప్రాణం కాపాడటానికి తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో విల్లారియల్ నుంచి సేకరించిన కిడ్నీతో థామస్‌కు వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. 'కొన్ని రోజుల కింద మా నానమ్మను కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగానే కోల్పోయాను... ఆ సమయంలో మా నానమ్మ కోసం నేనేమీ చేయలేకపోయాను...అందుకే నా కిడ్నీ థామస్‌కి సరిపోతుందని తెలిసిన వెంటనే కిడ్నీ దానం చేయడానికి ఒప్పుకున్నాను..డాన్ థామస్‌ని కాపాడటంలో మా గ్రాండ్ మదరే నాకు ఆదర్శం.. డాన్ థామస్ మరిన్ని రోజులు బతికితే అదే నాకు ఆనందం' అని సర్జరీ అనంతరం మారియానా విల్లారియల్ తెలిపింది.